హైదరాబాద్, సెప్టెంబర్ 2: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ ఈనెల 7న ఎపి ఎన్జీవోలు నిర్వహించనున్న ‘సేవ్ ఆంధ్ర ప్రదేశ్’ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఎపి ఎన్జీవో అధ్యక్షుడు పి. అశోక్ బాబు డిమాండ్ చేశారు. సభకు ప్రభుత్వం అనుమతినిస్తే క్రమ శిక్షణతో, శాంతియుతంగా నిర్వహిస్తామని హామీనిచ్చారు. సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించిన పక్షంలో హైకోర్టుకు వెళ్లి న్యాయపరంగా అనుమతి తెచ్చుకుంటామని ఆయన తెలిపారు. అలాగే తెలంగాణవాదంపై, ఉద్యమంపై మాకెలాంటి చెడు అభిప్రాయం లేదని స్పష్టం చేశారు. సభ సజావుగా జరగడానికి తెలంగాణవాదులు సహకరిస్తే సీమాంధ్ర ప్రజలకు తెలంగాణవాదులపై నమ్మకం కల్గుతుందన్నారు. వినాయక చవితి తర్వాత ఎపి ఎన్జీవో, అన్ని సంఘాలు సమావేశమై సమైక్యాంధ్ర కోసం శాశ్వత జెఎసిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. గన్‌ఫౌండ్రీలోని ఎపి ఎన్జీవో భవన్‌లో సోమవారం మధ్యాహ్నం ఎపి ఎన్జీవోలు, సీమాంధ్ర ఆర్టీసీ కార్మిక సంఘాలు, ఇతర సమైక్యాంధ్ర జెఎసిల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 7న జరిగే సమైక్య సభను విజయవంతం చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. సమావేశం అనంతరం అశోక్‌బాబు మీడియాతో మాట్లాడుతూ 6న చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. 7న జరిగే సభను విజయవంతం చేయడానికి ప్రతీ ఇంటి నుంచి ఒకరు చొప్పున హాజరవ్వాలని కోరారు. ఈ సభకు రాష్టవ్య్రాప్తంగా 23 జిల్లాల్లోని సమైక్యవాదులు హాజరవుతారని తెలిపారు. ఏ ఒక్క రాజకీయ పార్టీకి అనుకూలంగానో, వ్యతిరేకంగానో తమ ఉద్యమం ఉండదన్నారు. సమైక్య ఉద్యమానికి మద్దతిచ్చే ఏ పార్టీకైనా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు జరిగితే దాన్ని బూచిగా చూపి సభను అడ్డుకునే ప్రయత్నాలు చేయొద్దని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సభకు 50 సంఘాల మద్దతు తెలిపాయన్నారు. అలాగే నేటి నుంచి ఎపి ఎన్జీవో భవన్‌లో నేటి నుంచి హైదరాబాద్‌లోని సీమాంధ్ర కాలనీవాసులు సభను విజయవంతం చేసేలా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారని ఆయన చెప్పారు.
కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు
సెప్టెంబర్ 7న జరిగే ‘సేవ్ ఆంధ్ర ప్రదేశ్’ సభను విజయవంతం చేయడానికి 25 మందితో కూడిన కో-ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ఎపి ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. వైస్ చైర్మన్‌లుగా, జాయింట్ కన్వీనర్‌లుగా ఆర్టీసీ కార్మిక సంఘాలు, ఇతర సంఘాల నుంచి సభ్యులను నియమించారు. ఈ కమిటీకి సలహాదారులుగా హైకోర్టు సీనియర్ అడ్వకేట్ సివి. మోహన్‌రెడ్డి, హైకోర్టు బార్ కౌన్సిల్ మెంబర్ కె. చిదంబరం, ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌లు ఉంటారని అశోక్‌బాబు తెలిపారు.
డిజిపి కార్యాలయంలో ఇరు ప్రాంత నేతల వినతులు
ఇలాఉండగా సోమవారం ఇరు ప్రాతాల జెఎసి నేతలు డిజిపిని కలవడానకి ప్రయత్నించారు. అయితే డిజిపి దినేష్‌రెడ్డి కార్యాలయంలో లేకపోవడంతో అదనపు డిజి గోపాల్‌రెడ్డికి వినతి పత్రాలను ఇచ్చారు. డిజిపి కార్యాలయానికి వచ్చిన సీమాంధ్ర ఉద్యోగుల జెఎసి నేతలు చంద్రశేఖరరెడ్డి, రవీందర్ మీడియాతో మాట్లాడుతూ తాము ఎవరికీ వ్యతిరేకం కాదని రాష్ట్రం విడిపోతే జరిగే నష్టాల గురించి ప్రజలకు సభల ద్వారా వివరించాలన్న లక్ష్యంతో ఈ నెల 7న హైదరాబాద్‌లో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు అనుమతి ఇవ్వాలని గత 15రోజుల క్రితమే సెంట్రల్ జోన్ డిసిపికి దరఖాస్తు చేశామన్నారు. మరోవైపు తెలంగాణ న్యాయవాదులు ఉపేంద్ర, గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ 7న సీమాంధ్ర జెఏసి నేతలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ పేరుతో సభకు అనుమతి నిరాకరించాలని వారు కోరారు.
శాంతియుతంగా నిర్వహిస్తాం ప్రతి ఇంటి నుంచి ఒకరు తరలిరావాలి ఎపి ఎన్‌జిఓ అధ్యక్షుడు అశోక్‌బాబు
english title:
ashok babu
Date:
Tuesday, September 3, 2013