హైదరాబాద్, సెప్టెంబర్ 2: రాష్ట్రం విడిపోతే జల వివాదాలు పెరుగుతాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఇప్పటికే కర్నాటకతో తుంగభద్ర ప్రాజెక్టుతో ఉన్న సమస్యలు తొలగలేదని, ఇక రాష్ట్రం విడిపోతే శ్రీశైలం ప్రాజెక్టుకు కొత్త రాష్ట్ర సరిహద్దులతో వివాదాలు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. సిపిఐ మాజీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ అధ్వర్యంలో అనంతపురం జిల్లాకు చెందిన రైతులు సోమవారం ముఖ్యమంత్రిని కలుసుకున్న సమయంలో ఆయన మరోసారి సమైక్యరాగాన్ని వినిపించారు. అనంతపురం జిల్లాలో తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొన్నాయని, వేరు శెనగ పంట ఎండిపోయి రైతుల పరిస్థితి దారుణంగా మారిందని అక్కడి నుంచి వచ్చిన వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటూ ఇది రాజకీయాలు మాట్లాడే సమయం కాకున్నప్పటికీ.. భవిష్యత్తు పరిణామాలు చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సాగునీటి సమస్యలకు పరిష్కారం చూపించకుండా రాష్ట్రాన్ని విభజిస్తే కొత్త రాష్ట్ర సరిహద్దుతో కొత్త సమస్యలు, నీటి ఇబ్బందులు తలెత్తుతాయని కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. వర్షాలు, వరదలు వచ్చిన సమయంలో కూడా తుంగభద్ర నుంచి మన రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన నీరు రావడం లేదని, ఇప్పుడు కొత్త రాష్ట్ర సరిహద్దు కూడా ఏర్పడితే శ్రీశైలం ద్వారా ప్రయోజనాలు పొందే ఐదు జిల్లాలకు తాగు, సాగునీటి సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తికి కూడా సమస్యలు పెరుగుతాయని వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వివరించారు. కాగా, శ్రీశైలం ప్రాజెక్టులో 871 అడుగులు నీరు ఉంటేనే రాయలసీమకు నీరు ఇవ్వడం సాధ్యమవుతుందని, ప్రస్తుతం వర్షాలు కురిసినందువల్ల అనంతపురం రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులతో చర్చిస్తానని ముఖ్యమంత్రి హామీనిచ్చారు.
రాయలసీమకు నీటి సమస్యలు అనంత రైతులతో సిఎం సమైక్య రాగం
english title:
cm
Date:
Tuesday, September 3, 2013