హైదరాబాద్, సెప్టెంబర్ 2: టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో జరుపుతున్న ఆత్మగౌరవ యాత్ర వల్ల రెండు ప్రాంతాల్లోనూ పార్టీకి ప్రయోజనకరమేనని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. చంద్రబాబు యాత్రపై సీమాంధ్ర ప్రాంతం టిడిపి నాయకులు అది సమైక్యాంధ్ర యాత్ర అని చెబుతుండగా, తెలంగాణ నాయకులు మాత్రం రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజలను ఒప్పించడానికి చంద్రబాబు జరుపుత్ను ఓదార్పు యాత్ర అని చెబుతున్నారు. సీమాంధ్ర ప్రజలు సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్నారు, ఈ ఉద్యమంలో మీ వెంటే నేను అని చంద్రబాబు బహిరంగంగానే ప్రకటించినందున ఇది సమైక్యాంధ్ర యాత్రే అని టిడిపి శాసన సభాపక్షం ఉప నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు వాదిస్తున్నారు. ఇది సీమాంధ్ర ప్రజలను ఓదార్చడానికి సాగిస్తున్న ఓదార్పు యాత్ర అని టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. తెలంగాణ అంశం టిడిపికి ఇబ్బందికరంగా మారినప్పటి నుంచి ఈ అంశంపై చంద్రబాబు రెండు ప్రాంతాల ప్రజలకు రెండు రకాలుగా అర్ధం అయ్యే విధంగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో పర్యటించినప్పుడు టిడిపి తెలంగాణకు వ్యతిరేకం కాదు అని ప్రకటించడం ఆ వెంటనే రెండు కళ్ల సిద్ధాంతం చెప్పడం ద్వారా రెండు ప్రాంతాల ప్రజలకు రెండు రకాల సంకేతాలు పంపించారు. ఇప్పుడు తిరిగి మళ్లీ ఇదే రకమైన సంకేతాలను టిడిపి నాయకత్వం నమ్ముకుంటోంది. యాత్ర ద్వారా సమైక్య ఉద్యమానికి అండగా నిలుస్తున్నట్టు సీమాంధ్రలో ప్రచారం చేస్తున్నారు.
అదే సమయంలో విభజనపై రాష్ట్ర ప్రజలను ఒప్పించడానికే బాబు యాత్ర జరుపుతున్నారని తెలంగాణ నాయకులతో చెప్పిస్తున్నారు. సీమాంధ్రలో చంద్రబాబు బాగా మాట్లాడుతున్నారని ఆయన మాటల్లో తెలంగాణ వారు అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అంశాలేమీ లేవని టిడిపి అధికార ప్రతినిధి ఎ రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర హోంమంత్రి షిండేకు టిడిపి లేఖ ఇచ్చింది. ఆ లేఖను ఉప సంహరించుకుంటున్నామని చెబితే అభ్యంతరం వ్యక్తం చేయాలి కానీ లేఖకు కట్టుబడి ఉన్నట్టు ఇంతకు ముందే ప్రకటించినందున ఇప్పుడు బాబు సీమాంధ్రలో ఏం మాట్లాడినా అభ్యంతరం పెట్టాల్సిన అవసరం ఏముందని తెలంగాణ టిడిపి నాయకులు చెబుతున్నారు. రెండు ప్రాంతాల్లోనూ పార్టీ బతకాలి, తెలంగాణపై కేంద్రం తన నిర్ణయాన్ని అమలు చేసేంత వరకు ఎవరి రాజకీయాలు వారు చేస్తునే ఉంటారు, ఆ తరువాత అంతా సద్దుమణిగిపోతుందని తెలంగాణ టిడిపి నాయకులు చెబుతున్నారు.
చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రపై ఎవరి వాదన వారిదే
english title:
chandra babu
Date:
Tuesday, September 3, 2013