హైదరాబాద్, సెప్టెంబర్ 2: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుది నాలుకా? తాటిమట్టా? అని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి హరీశ్‌రావు మండిపడ్డారు. చంద్రబాబు తరహాలో ఇన్నిమార్లు మాట మార్చిన నాయకుడు దేశంలో ఎవరూ లేరని, ఆయన్ను చూసి ఊసరవెల్లులు కూడా సిగ్గుపడే పరిస్థితి ఏర్పడిందని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. ప్రజలు రోడ్లపైకి వస్తే తాను ఇంట్లో ఎలా కూర్చుంటానని చంద్రబాబు గుంటూరు జిల్లా పర్యటనలో వ్యాఖ్యానించారని, మరి తెలంగాణ సమాజం రోడ్డుపైకి వచ్చినప్పుడు బాబు రోడ్డు ఎందుకు ఎక్కలేదని ప్రశ్నించారు. చంద్రబాబు దృష్టిలో తెలంగాణ ప్రజలు, ప్రజలు కాదా? వారి బాధలు పట్టవా? వారి ప్రాణాలకు విలువలేదా? వెయ్యి మందికిపైగా తెలంగాణలో ఆత్మబలిదానాలు జరిగితే ఏ ఒక్కరి కుటుంబానైనా పరామర్శించారా? అని ఆయన నిలదీశారు. చంద్రబాబు, వైఎస్‌ఆర్‌సిపి పోటి పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని ఆయన విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తునా లేచినప్పుడు ప్రధాన మంత్రికి చంద్రబాబు లేఖ ఎందుకు రాయలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ అంశాన్ని తేల్చడానికి ఐదుగురితో కమిటి వేసి, తమ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని పండుగ కానుకంటూ దసరా రోజున గొప్పగా ప్రకటించ లేదా అని ఆయన ప్రకటించారు. అలాగే 2008 మహానాడులో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోలేదా? 2009లో తమ పార్టీతో పొత్తు పెట్టుకోలేదా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో టిఆర్‌ఎస్ కుమ్మక్కు అయిందని విమర్శిస్తున్నారు, ఎఫ్‌డిఐపై బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆ పార్టీతో కుమ్మక్కై తమ సభ్యులను గైర్హాజర్ అయ్యేలా చూసింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై తమ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే మద్దతు ఇవ్వకుండా ఆ ప్రభుత్వాన్ని కాపాడింది మీరేనన్న విషయాన్ని మర్చిపోయారా? అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రి చిదంబరాన్ని ఢిల్లీలో రహస్యంగా కలిసి వచ్చింది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. తాను ఆ రోజు వాజ్‌పాయ్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుండా అడ్డుకున్నానని నిసిగ్గుగా చెప్పుకుంటున్నారు, తనలాగా తెలంగాణను అడ్డుకోవడం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి చేతకావడం లేదనీ, తనకు అవకాశం ఇస్తే ఆరు నెలల్లో అడ్డుకుంటానని చంద్రబాబు పరోక్షంగా చెబుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. టిఆర్‌ఎస్‌తో పొత్తు వద్దని తాను ఆనాడే చెప్పానని హరికృష్ణ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, తండ్రి ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన బావ చంద్రబాబు పంచన చేరిన హరికృష్ణా ఒక నాయకుడేనా అని హరీశ్‌రావు దుయ్యబట్టారు.
చంద్రబాబుపై హరీశ్ నిప్పులు
english title:
harish rao
Date:
Tuesday, September 3, 2013