Clik here to view.

హైదరాబాద్, సెప్టెంబర్ 2: హైదరాబాద్‌పై హక్కులే లక్ష్యంగా రెండు ప్రాంతాల ఉద్యోగులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. హైదరాబాద్ మాదేనంటూ తెలంగాణ ఉద్యోగులు, హైదరాబాద్ అందరిదీనంటూ సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న ఆందోళనతో సచివాలయం హోరెత్తుతోంది. ఇరుప్రాంతాల ఉద్యోగుల ఆందోళన సోమవారం కూడా ఉద్రిక్త పరిస్థితుల్లో సాగింది. మంగళవారం నుంచి సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలు సచివాలయంలో ఊపందుకున్నాయి. హైదరాబాద్‌పై హక్కు ఏ ఒక్కరికో సొంతం కాదని, ఆంధ్రప్రదేశ్‌లోని అందరికీ హైదరాబాద్ చెందినదంటూ ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. సచివాలయంలోని ఎల్ బ్లాక్ ముందు వారు సోమవారం కూడా ధర్నా నిర్వహించారు. ఇదే సమయంలో తెలంగాణ ఉద్యోగులు కూడా సీమాంధ్ర ఉద్యోగుల ధర్నా చేస్తున్న ప్రాంతానికి అతి దగ్గరలోనే ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సచివాలయ భద్రత చూసే ఎస్పీఎఫ్ పోలీసులే కాకుండా బయటినుంచి కూడా పోలీసులు భారీగా మోహరించి రెండువర్గాల మధ్య ఘర్షణ తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఉభయ ప్రాంతాల నిరసన ప్రదర్శనల నేపథ్యంలో నినాదాలు హోరెత్తించాయి. పాటలు, నృత్యాలతో తెలంగాణ ఉద్యోగులు ఆందోళన నిర్వహించగా, ప్రసంగాలు, నినాదాలతో సీమాంధ్ర ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. చివరకు పోలీసులు రెండువర్గాలకు నచ్చచెప్పడంతో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు ప్రదర్శనగా చెరోవైపు వెళ్లిపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలావుంటే, మంగళవారం నుంచి సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెకు వెళ్లనున్నారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు ఇచ్చారు. దాదాపు 2500 మంది ఉద్యోగులు సచివాలయంలో సమ్మెకు దిగనున్నారు. రెండు ప్రాంతాల ఆందోళనలతో ఇప్పటికే సచివాలయంలో ఫైళ్ల కదలికలు స్తంభించిపోగా, ఇప్పుడు సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెతో పాలన మరింత స్తంభిస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.