హైదరాబాద్, సెప్టెంబర్ 2: సమైక్యాంధ్ర కోరుతూ సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంగళవారం అసెంబ్లీ ఆవరణలో దీక్ష చేపట్టనున్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం చైర్మన్, రాష్ట్ర మంత్రి ఎస్ శైలజానాథ్ అధ్యక్షతన దీక్ష చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి నివాళి అర్పించి, అక్కడే బైఠాయించాలని భావిస్తున్నారు. అయితే అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనుమతిని నిరాకరిస్తున్నారు. ఒక్కసారి ఇలాంటి దీక్షలకు అనుమతిస్తే భవిష్యత్తులో ఇంకా అనేకమంది వివిధ డిమాండ్లతో దీక్షలు చేపట్టేందుకు దరఖాస్తులు చేస్తారని, తద్వారా చట్టసభకు ఉన్న గౌరవానికి విఘాతం కలుగుతుందని ఆయన ఆందోళన చెందుతున్నారు. గాంధీ విగ్రహం వద్ద స్పీకర్ అనుమతించకుంటే, అసెంబ్లీ ఆవరణలోని సిఎల్పీ కార్యాలయం సమీపంలో లేదా మంత్రులు సభలోకి వెళ్ళే దారిలో దీక్ష చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఉదయం 10నుంచి మధాహ్నం ఒంటి గంట వరకు దీక్ష చేపట్టనున్నట్టు మంత్రి శైలజానాథ్ తెలిపారు. ఇలాఉండగా మంగళవారం సీమాంధ్ర ప్రజాప్రతినిధులు దీక్ష చేపట్టనున్నందున పోలీసు ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
అసెంబ్లీ ఆవరణలో ‘సీమాంధ్ర’ శిబిరం
english title:
seemandhra
Date:
Tuesday, September 3, 2013