హైదరాబాద్, సెప్టెంబర్ 2: విద్యారంగంలో వినూత్న పోకడలతో అద్భుతాలు సృష్టిస్తున్న టీచర్లను పక్కన పెట్టి రాజకీయంగా పలుకుబడి ఉపయోగించుకున్న ఉపాధ్యాయులకు అవార్డులు ప్రతి ఏటా దక్కడం మిగిలిన వారికి విస్మయం కలిగిస్తోంది. ఈ ఏడాది కూడా అవార్డుల ఎంపిక కమిటీ ముందుకు వివిధ మంత్రుల కోటా కింద సిఫార్సు లేఖలు రావడం గమనార్హం. గత వారం రోజులుగా ఎవరికి అవార్డులు ఇవ్వాలనే అంశంపై వైయుక్తింగా ఉన్నతాధికారులు, మంత్రులు తమ అభిప్రాయాలు చెప్పడం చూస్తుంటే వ్యక్తిగత ప్రతిభా పాటవాల కంటే రాజకీయ పలుకుబడికే పెద్ద పీట వేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. తల్లిదండ్రుల తర్వాత అత్యంత ఉన్నత స్థానం గురువులదే. అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదనీ, సమాజంలో గురుస్థానం వెలకట్టలేనిదని చెబుతుంటారు. ఆదర్శ సమాజ స్థాపనకు పునాది పాఠశాలలేనని నినాదాలు పలుకుతున్న మన దేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ వారసులను ప్రోత్సహించేందుకు ఈ అవార్డులను అందజేస్తున్నారు. అయితే ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమనే చూపుతున్నాయి. ప్రతి ఏటా ఉపాధ్యాయ వృత్తిలో అంకితభావం, సామాజిక పరంగా చేసిన సేవలను గుర్తించి జిల్లా, రాష్ట్ర , జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ప్రదానం చేయడం ఆనవాయితీ.
అయితే ఉత్తమ ఉపాధ్యాయుల నోటిఫికేషన్ జారీ చేయడం, ఎంపిక కమిటీ తదితర అంశాలపైనే ఉపాధ్యాయులకు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఉత్తమ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవడం ఏమిటని వారు అంటున్నారు. ఉపాధ్యాయుల జీవితం, అర్హతలు, పనితీరు, ప్రగతి, వికాసం, ప్రతిభ తదితర అంశాలను తీసుకుని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేస్తుంటారు. ఉపాధ్యాయుడు వృత్తిపరంగా, సామాజిక పరంగా, ప్రవృత్తిపరంగా చేసిన సేవలు ఆధారంగా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక జరగాలనే లక్ష్యంతో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు దరఖాస్తు విధానానికి శ్రీకారం చుట్టాయి. అయితే ప్రాధమిక దశలో జిల్లా స్థాయిలోనూ, రెండో అంచెలో రాష్ట్ర స్థాయిలోనూ కమిటీల పనితీరు నామా మాత్రంగా ఉంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని సార్లు దరఖాస్తుకు నోటిఫికేషన్ జారీలో ఆలస్యం మూలంగా, ఉత్తర్వులు రాష్ట్రం నుండి జిల్లాలకు, మండలాలలకు చేరే సరికి పుణ్యకాలం కాస్తా పూర్తయిపోతుంది. ఆఖరికి హడావుడిగా వచ్చిన దరఖాస్తులను నామమాత్రపు సంతకాలతో ఉన్నతాధికారులకు పంపిస్తున్నారు.
సుమారు 32 ఏళ్ల క్రితం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు అందరికీ రెండేళ్ల సర్వీసు పొడిగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. కాని అవి అమలు కావడం లేదు. అంతేకాకుండా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి ఆ జీవో కాపీ కూడా ఒకటి ఇస్తుడటం గమానార్హం.
రాష్టస్థ్రాయిలో ఉత్తమ ఉపాద్యాయులకు గతంలో తొలుత 500 రూపాయిలు, ఆ తర్వాత వెయ్యి, ప్రస్తుతం 3వేల రూపాయిలు, సర్ట్ఫికేట్, మెడల్ అందజేస్తున్నారు. అయితే 20 ఏళ్ల క్రితం వృత్తిపరంగా, సామాజిక పరంగా సేవలు అందించిన చాలా మంది ఉపాధ్యాయులు అవార్డులు అందుకోకుండానే బోధనకు దూరం అయిపోతున్నారు. ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయ ఉత్తమ అవార్డులను క్రీడాకారులకు ఇచ్చే ధ్రొణాచార్య అవార్డుతో సమానం చేయాలనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
కాగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయులకు ఒక ఇంక్రిమెంట్, జాతీయ ఉపాధ్యాయులకు రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని అవార్డు టీచర్సు ఫెడరేషన్ అధ్యక్షుడు బి. శ్రీనివాసరావు, ప్రధానకార్యదర్శి మార్గం యల్లయ్య పేర్కొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు ఉచిత బస్సు పాస్‌లు ఇవ్వాలని, జిల్లా కేంద్రాల్లో ఇళ్ల స్థలాలు, హెల్త్‌కార్డులు కూడా ఇవ్వాలని వారు సూచించారు.
సాంకేతికంగా ప్రామాణికత లేని స్క్రూటినీ.. కేంద్ర, రాష్ట్ర విధానాలపై ఉపాధ్యాయుల్లో అసంతృప్తి
english title:
teachers awards
Date:
Tuesday, September 3, 2013