విశాఖపట్నం/విజయనగరం/శ్రీకాకుళం, సెప్టెంబర్ 2: సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. మన్యంలో రెండోరోజు కూడా సంపూర్ణంగా కొనసాగింది. విశాఖ ఆశీల్‌మెట్ట జంక్షన్ వద్ద కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను సమైక్య వారధి పేరుతో ప్రారంభించేందుకు తెలుగు యువత కార్యకర్తలు ప్రయత్నించగా, పోలీసులు వారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లిపోయారు. గాజువాక మెయిన్ రోడ్డుపై భారీ క్రేన్‌లతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. సుమారు 50 క్రేన్‌లను రోడ్లపై నిలబెట్టడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వైకాపా ఆధ్వర్యంలో ఐదు వేల మందికి వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రా యూనివర్శిటీలో రిసెర్చ్ స్కాలర్స్ రోడ్లపైనే చదువుతూ నిరసన తెలియచేశారు. ఆర్టీసీ ఉద్యోగులు గత నెలలో పనిచేసిన కాలానికి జీతాలా చెల్లించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఎన్‌జిఓలు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం సహా అన్ని ప్రాంతాల్లోనూ సమైక్య నిరసనలు తీవ్రస్థాయిలో వ్యక్తమయ్యాయి. విజయనగరం జిల్లా అంతటా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు మారుమోగాయి. మానవహారాలు.. బిందెల నృత్యాలు..కోలాటాలు...ఎడ్లబళ్ల ర్యాలీలు.. రాస్తారోకోలతో నిరనసలు వ్యక్తం చేశారు. జిల్లా గెజిటెడ్ అధికారుల ఐకాసా ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగించారు. న్యాయవాదుల రిలే దీక్షలు కొనసాగాయి. సాలూరు, భోగాపురం, పూసపాటిరేగ, చీపురుపల్లిలో సమైక్యాంధ్ర నిరసనలు పెల్లుబికాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఎన్జీఒ నేతలు రోడ్లను ఊడ్చి వినూత్న నిరసనకు దిగారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు బైక్ ర్యాలీ నిర్వహించి నిరసనలతో హోరెత్తించారు. అమరజీవి పొట్టిశ్రీరాములు కూడలి నుంచి డే అండ్ నైట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం సాగించారు. సంక్షేమాధికారులు వంటావార్పు నిర్వహించారు. కుక్కల మెడలో సీమాంధ్ర మంత్రుల పేర్లతో బోర్డు ఏర్పాటు చేసి పట్టణంలో ర్యాలీ నిర్వహించి వినూత్న నిరసన వ్యక్తంచేశారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఉపకులపతి కార్యాలయం పైకప్పు ఎక్కి విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విద్యార్థి జేఏసి నేతలు నిరసన వ్యక్తంచేశారు.
విద్యుత్ ఉద్యోగుల వర్క్‌టు రూల్
రాజమండ్రి/ఏలూరు: తూర్పుగోదావరి జిల్లా అట్టుడుకుతోంది. జిల్లాలోని జిల్లా స్థాయి అధికారులు, గెజిటెడ్ అధికారులు కూడా నిరవధిక సమ్మెకు దిగనున్నారు. రెవెన్యూ శాఖలోని అత్యంత కీలకమైన ఆర్డీవోలు, ఇతర జిల్లా అధికారులు మంగళవారం నుండి సమ్మెలో పాల్గొననున్నారు. జిల్లాలో ఐఏఎస్ అధికారులు మినహా మిగిలిన అన్ని స్థాయిల్లోని అధికారులు నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టవుతోంది. విద్యుత్ ఉద్యోగుల జెఏసి ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు, అధికారులు వర్క్‌టు రూల్ ఆందోళనను ప్రారంభించారు. మంగళవారం జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు, అధికారులు సోమవారం రాజమండ్రిలో మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో ఎం వేణుగోపాలరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లాలో సమైక్యాంధ్ర ఆందోళనలు సోమవారం కూడా కొనసాగాయి. జిల్లా కేంద్రం ఏలూరులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని రోడ్డుపై బట్టలు కుట్టి నిరసన తెలిపారు. భీమడోలు మండలంలోని పూళ్ల గ్రామం వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిపై 500 అడుగుల పొడవు జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. భీమవరంలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. ఆచంట బంద్ పూర్తిగా జరిగింది.
కదంతొక్కిన కళాకారులు
నెల్లూరు/ఒంగోలు: సమైక్యాంధ్ర పరిరక్షణలో భాగంగా నెల్లూరు జిల్లాలో సోమవారం కళాకారులు, ఉద్యోగ జెఎసి నేతలు ఆందోళనలు చేశారు. సుమారు పాతిక కళాకారుల సంఘాల తరఫున నిరసన చేపట్టారు. స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న పలువురు మహనీయుల వేషధారణలతోపాటు పౌరాణిక అలంకరణల్లో కళాకారులు అందరినీ ఆకట్టుకున్నారు. ఏపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నేతృత్వంలో స్థానిక కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రెవెన్యూ సంఘం తరఫున నగరంలో భారీ ప్రదర్శన జరిగింది. న్యాయవాదులు దీక్షల్లో పాల్గొన్నారు. ప్రకాశం ప్రజాగర్జన విజయవంతమైంది. ఒంగోలులో జరుగుతున్న ప్రజాగర్జనకు మద్దతుగా అన్నివర్గాలూ సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రజాగర్జన సదస్సుకు జిల్లాలోని అన్నిప్రాంతాలనుండి ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.
ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి
తిరుపతి: ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, సామాన్యులకు కీడు జరిగే విభజనను వ్యతిరేకించి సమైక్యాంధ్ర సాధనే అంతిమ లక్ష్యంగా ప్రతిఒక్కరూ ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్యోగ జెఎసి కన్వీనర్ రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతిలో సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకు ఉద్ధృత రూపం దాల్చుతోంది. ఉద్యోగులు, టిటిడి ఉద్యోగులు కలసి సోమవారం ఆర్టీసీ బస్టాండు సమీపంలో కనివినీ ఎరుగని రీతిలో సుమారు ఐదువేల మందితో కలసి నిరసన దీక్షలు చేశారు.
కడప అంతటా నిరసనల జోరు
కడప2: కడప జిల్లాలో విభజన సెగలు మరింత చెలరేగుతున్నాయి. జెఎసి, ఎన్జీవోలు, విద్యుత్ ఉద్యోగుల ఆధ్వర్యంలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం అన్ని వర్గాల ప్రజలు సమరోత్సాహంతో పాల్గొంటున్నారు. షర్మిల సమైక్య శంఖారావం పేరుతో చేపట్టిన యాత్ర బుధవారం కడపకు చేరనున్న నేపథ్యంలో ఆ ఊపు లక్ష్యాన్ని సాధించేవరకు సాగేలా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి వైకాపా శ్రేణులు సిద్ధమవుతున్నాయి. సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ప్రదర్శనలు, రాస్తారోకోలు, ధర్నాలు, దీక్షలు, రహదారి దిగ్బంధాలు జరిగాయి. ఖాజీపేట ఆర్‌ఇఎస్ జూనియర్ కాలేజీ అధ్యాపకుల దీక్షకు మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. కేసీఆర్ దీక్ష చేసినపుడు తెలంగాణ అగ్ని గుండమవుతోందని కొందరు నేతలు సోనియాకు చెప్పడంతో డిసెంబర్ 9వ తేదీన ప్రకటన వచ్చిందన్నారు.
స్తంభించిన జనజీవనం
కర్నూలు: సమైక్యాంధ్రకు మద్దతుగా కర్నూలు జిల్లాలో సోమవారం ఆటోల బంద్‌తో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఆటోడ్రైవర్ల సంఘం పిలుపు మేరకు సమైక్య రాష్ట్ర సాధన కోసం 24 గంటల పాటు బంద్ పాటించారు. జూనియర్ డాక్టర్లు కర్నూలులో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఇందిరా క్రాంతి పథం ఉద్యోగులు సామూహిక రిలే నిరాహార దీక్షలు కొనసాగుతుండగా వారికి మద్దతుగా ప్రభుత్వ ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు, ఆదోని, ఎమ్మిగనూరు తదితర పట్టణాల్లో సమైక్య ఉద్యమం జోరుగా సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
అనంతలో నిరసనల హోరు
అనంతపురం: అనంతపురం జిల్లాలో సమైక్య ఉద్యమం నిరసనలు మిన్నంటాయి. గత 34 రోజులుగా జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. ర్యాలీలు, నిరాహారదీక్షలు, వంటావార్పు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నగరంలో మంగళవారం లక్ష జన గర్జన నిర్వహించనున్నారు.
ధర్మవరంలో లక్ష గళ ఘోష
ధర్మవరం రూరల్:సమైక్యాంధ్రకు మద్దతుగా అనంతపురం జల్లా ధర్మవరం పట్టణంలో ఉద్యోగుల ఐకాసా ఆధ్వర్యంలో సోమవారం లక్ష గళ ఘోష నిర్వహించారు. స్థానిక పొట్టి శ్రీరాములు కూడలిలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, కార్మికులు, కర్షకులు గళమెత్తి జై సమైక్యాంధ్ర, జైజై సమైక్యాంధ్ర అంటూ నినదించారు. ధర్మవరం ఉద్యోగుల జెఎసి కన్వీనర్, తహసీల్దార్ రామచంద్రారెడ్డి, ఎంపిడిఓ భాస్కర్‌రెడ్డి, ఎన్‌జిఓ అధ్యక్షులు డాక్టర్ ఉరుకుందప్ప, కార్యదర్శి రామ్మోహన్‌నాయుడు, సిడిపిఓ పార్వతమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఉద్ధృతంగా సమైక్య ఉద్యమం.. విశాఖ మన్యంలో రెండో రోజూ బంద్
english title:
seemandhra
Date:
Tuesday, September 3, 2013