ఆకివీడు, మార్చి 4: కొల్లేటికోట శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు ఆదివారం భక్తులు పోటెత్తారు. భక్తజన సందోహంతో ఈ ప్రాంతమంతా జనసంద్రంలా మారింది. అమ్మవారి ఉత్సవాలకు ఆదివారం నాడు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. దీనిలో భాగంగా ఆదివారం తెల్లవారుఝాము నుంచే ఈ ప్రాంతంగుండా వెళ్ళే వాహనాలన్నీ భక్తుల రద్దీతో నిండాయి. సర్కారు కాలువ వద్దకు వివిధ వాహనాల ద్వారా చేరుకున్న భక్తులు అక్కడి నుంచి లాంచీల ద్వారా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి మొక్కుబడులు సమర్పించుకున్నారు. మొక్కుబడులు చెల్లించుకున్న తరువాత భక్తులు తమ స్నేహితులకు కొల్లేటికోటలో భోజన సదుపాయాలు ఏర్పాటుచేయడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఆదివారం ఈ ప్రాంతంలో భక్తులు పెద్దఎత్తున అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుని భోజన కార్యక్రమాలను ఏర్పాటుచేసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం, పోలీసుశాఖ ప్రత్యేక ఏర్పాట్లుచేసింది. ఆకివీడు లయన్స్‌క్లబ్ భక్తులకు వాటర్ ప్యాకెట్లు పంపిణీచేసింది. సోమవారం రాత్రి అమ్మవారి కల్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడానికి దేవస్థానం మేనేజర్ ఆకుల కొండలరావు ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లుచేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనుంది. అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడకు తరలివస్తుంటారు. వీరికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లుచేస్తోంది.
నేటి రాత్రి కల్యాణ మహోత్సవం
english title:
ghg
Date:
Monday, March 5, 2012