హైదరాబాద్, సెప్టెంబర్ 3: సమాజ సేవ చేస్తున్న మానవతావాది ప్రముఖ డాక్టర్ లక్కిరెడ్డి అనిమీరెడ్డికి ఈ నెల 7న అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో ‘ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ అవార్డు’ను ప్రదానం చేయనున్నట్లు ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్టు కన్వీనర్, ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి తెలిపారు. ఇటీవల తాను అమెరికా వెళ్ళినప్పుడు తెలుగు అసోసియేషన్ సదరన్ కాలిఫొర్నియా (టిఎఎస్‌సి) ప్రతినిధులతో అవార్డు ప్రదానం చేసేందుకు ఉత్తమ వ్యక్తిని ఎంపిక చేసే విషయమై చర్చించానని ఆమె మంగళవారం విలేఖరుల సమావేశంలో చెప్పారు.
కృష్ణా జిల్లా, మైలవరంలోని, వెల్వడ గ్రామానికి చెందిన డాక్టర్ లక్కిరెడ్డి సుమారు 15 సంవత్సరాలుగా అమెరికాలో తాను సంపాదిస్తున్నదంతా కుటుంబం కోసం ఒక్క డాలర్ కూడా ఖర్చు చేయకుండా, మొత్తం పేదల అభ్యున్నతి కోసం వ్యయం చేస్తున్నారని లక్ష్మీపార్వతి వివరించారు. మైలవరంలో కోటి రూపాయలతో పాఠశాల, రెండు కోట్లతో మైదానం (పార్కు), ఏడు కోట్ల రూపాయలతో డిగ్రీ కళాశాల నిర్మించారని ఆమె తెలిపారు. వరంగల్‌లో విద్యార్థినుల కోసం 39 గదులతో వసతి గృహం నిర్మించారని, తన స్వగ్రామంలో ప్రతి పేద కుటుంబానికి నెలకు సరిపడేంత భోజన వస్తువులను సమకూరుస్తున్నారని ఆమె చెప్పారు. అటువంటి మహోన్నతమైన డాక్టర్ లక్కిరెడ్డి అనిమిరెడ్డిని ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ అవార్డుకు ఎంపిక చేయడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.
7న లాస్‌ఏంజిల్స్‌లో ప్రదానం * లక్ష్మీపార్వతి వెల్లడి
english title:
lakkireddy
Date:
Wednesday, September 4, 2013