హైదరాబాద్, సెప్టెంబర్ 3: రాష్ట్ర విభజన జరిగితే నీటి యుద్ధాలు జరుగుతాయంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యతరాహిత్యంగా మాట్లాడుతున్నారని టిఆర్‌ఎస్ పార్టీ మండిపడింది. దేశాల మధ్యనే నదీ జలాల పంపిణీ జరుగుతున్న తరుణంలో, రెండు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొనడం, ఆయనకు నీటి కేటాయింపుల పట్ల అవగాహన లేదని అర్థమవుతోందని టిఆర్‌ఎస్ దుయ్యబట్టింది. తెలంగాణ భవన్‌లో మంగళవారం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బి వినోద్‌కుమార్, శాసనసభా పక్షం ఉప నాయకుడు టి హరీశ్‌రావు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విభజన జరిగితేనే నీటి యుద్ధాలు జరుగుతాయా? విభజన జరగకపోతే నీటి యుద్ధాలు ఉండవా? అని వినోద్‌కుమార్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు, వైఎస్‌ఆర్‌సిపి నాయకురాలు షర్మిల ముగ్గురూ తెలంగాణను గత 60 ఏళ్లుగా దోపిడీ చేసినట్టు చెప్పకనే చెబుతున్నారని ఆయన విమర్శించారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై ఆంధ్ర ప్రాంతానికి నీటి కేటాయింపులు జరిగిన విషయం ముఖ్యమంత్రికి తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో రాయలసీమ లేదని కృష్ణ ట్రిబ్యునల్ చెప్పిన సంగతి ముఖ్యమంత్రి కిరణ్‌కు తెలియదా అని వినోద్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రితో సహా సీమాంధ్ర నేతలకు నీటి కేటాయింపులపై అవగాహన లేదన్నారు.
మత గ్రంథం చేత పట్టుకొని మాట మార్చితే దేవుడు క్షమించడు: హరీశ్‌రావు
రాష్ట్ర విభజనకు తాము అడ్డంకాదు, నిలువుకాదు, కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట మార్చడాన్ని తెలంగాణ ప్రజలు సహించరని టిఆర్‌ఎస్ శాసనసభా పక్షం ఉప నాయకుడు టి హరీశ్‌రావు హెచ్చరించారు. వైఎస్‌ఆర్‌సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మత గ్రంధాన్ని చేతపట్టుకొని మాటమార్చితే, ఆ దేవుడు కూడా క్షమించడని దుయ్యబట్టారు. అవినీతి పునాదుల వైఎస్‌ఆర్‌సిపి పుట్టిందని, వైసిపి చరిత్ర ఏమిటో ప్రజలందరికీ తెలుసునని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజనపై మాట మార్చిన కిరణ్, చంద్రబాబు, షర్మిలను ప్రజలు గాడిదలపై ఊరేగించే రోజు దగ్గరలోనే ఉందని విమర్శించారు. సొంత పార్టీ నేతలపైనే చెప్పులు వేయించిన చరిత్ర వైఎస్‌ది అని హరీశ్ గుర్తు చేసారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా సీమాంధ్రులు హైదరాబాద్‌లో ఉండవచ్చనీ, వైఎస్ జగన్ బెంగళూరులో స్థిరపడి వ్యాపారాలు చేసుకుంటే ఎవరైనా అభ్యంతరం చెప్పారా? విభజన జరిగిన తర్వాత కూడా హైదరాబాద్‌లో ఎవరైనా ఉండవచ్చు అని హరీశ్‌రావు అన్నారు.
యుద్ధాలు జరుగుతాయని సిఎం రెచ్చగొట్టడం తగదు * సిఎంపై మండిపడిన టిఆర్‌ఎస్ నేతలు
english title:
trs
Date:
Wednesday, September 4, 2013