న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: జమ్మూ-కాశ్మీర్ నుంచి భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్న తొలి ఆటగాడిగా ఎదిగిన యువ ఆల్-రౌండర్ పర్వెజ్ రసూల్ తదనంతరం చోటుచేసుకున్న రాజకీయాలపై ఆవేదనతో ప్రతిస్పందించాడు. తనను పూర్తిగా ఒక క్రికెటర్‌గానే చూడాలని రసూల్ విజ్ఞప్తి చేశాడు. ఇటీవల జింబాబ్వేలో పర్యటించిన భారత జట్టులోకి రసూల్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో భారత జట్టు యాజమాన్య రసూల్‌ను ఒక్క మ్యాచ్‌లోనూ బరిలోకి దించలేదు. జింబాబ్వేతో జరిగిన ఐదు వనే్డ మ్యాచ్‌లకు గాను కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా రసూల్‌కు ఆడే అవకాశం కల్పించకపోవడంతో జమ్మూ-కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ఇది వివాదానికి దారితీసింది. అయితే ఇటువంటి రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని రసూల్ నిశ్చయించుకున్నాడు. తనను కేవలం ఒక క్రికెటర్‌గా మాత్రమే చూడాలని ఆయన అందరికీ విజ్ఞప్తి చేశాడు. ‘గతంలో నేను ఎలా ఆడినప్పటికీ, ఇప్పుడు నా ప్రదర్శన ఎలా ఉన్నప్పటికీ నన్ను కేవలం ఒక క్రికెటర్‌గా మాత్రమే చూడాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా’ అని రసూల్ మంగళవారం న్యూఢిల్లీలో విలేఖర్లతో అన్నాడు. అయితే జాతీయ జట్టులో తనకు చోటు కల్పించడం వల్ల జమ్మూ-కాశ్మీర్‌లో క్రికెట్‌కు సంబంధించి చాలా సానుకూల మార్పులు చోటుచేసుకున్నాయని రసూల్ అంగీకరించాడు. ‘జాతీయ జట్టుకు నన్ను ఎంపిక చేసిన తర్వాత రాష్ట్రంలో చాలా మంది యువ క్రీడాకారులు క్రికెట్‌ను ఎంచుకుంటున్నారు. జమ్మూ-కాశ్మీర్ కార్పొరేట్ ప్రీమియర్ లీగ్ సహా పలు కొత్త క్రికెట్ లీగ్‌లు ప్రారంభమయ్యాయి. చాలా మంది తల్లిదండ్రులు నా వద్దకు వచ్చి క్రికెట్‌లో తమ పిల్లల భవితవ్యం గురించి మాట్లాడుతున్నారు. యువ క్రికెటర్లు కూడా కఠోర సాధన చేయడం ప్రారంభించారు’ అని రసూల్ అన్నాడు. భారత తుది జట్టులో చోటు సంపాదించేందుకు తాను ఇంకా చాలా దూరం పయనించాల్సి ఉంటుందని రసూల్ (24) అంగీకరించాడు. ‘దేశవాళీ క్రికెట్‌కు, అంతర్జాతీయ క్రికెట్‌కు చాలా తేడా ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ ఆటగాడైనా మరింత కష్టపడాల్సి ఉంటుంది. కనుక భారత జట్టులో ఆడేందుకు అనువుగా నా ఆటతీరును మరింత మెరుగుపర్చుకోవాలని చూస్తున్నా’ అని రసూల్ పేర్కొన్నాడు.
కేవలం క్రికెటర్‌లానే చూడండి : పర్వెజ్ రసూల్
english title:
no politics
Date:
Wednesday, September 4, 2013