హైదరాబాద్, సెప్టెంబర్ 3: భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ (దక్షిణాఫ్రికా) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఏడో ఎడిషన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అంతర్జాతీయ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత జట్టును గతంలో అగ్రస్థానానికి చేర్చిన కిర్‌స్టెన్ (45) ఆ తర్వాత 2011లో జరిగిన ప్రపంచ కప్ వనే్డ టోర్నమెంట్‌లో టీమిండియాను విజయ పథంలో నడిపిన విషయాన్ని భారత క్రికెట్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ఒకటిగా ఉన్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఈ ఏడాది జరిగిన ఆరో ఎడిషన్ ఐపిఎల్ టోర్నమెంట్‌లో ఘోరంగా విఫలమై ఎనిమిదో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి ఢిల్లీ డేర్‌డెవిల్స్ అదృష్టాన్ని మార్చేందుకు కిర్‌స్టెన్‌ను ప్రధాన కోచ్‌గా నియమించారు. అయితే ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు సహాయ సిబ్బంది మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా యథాతథంగా కొనసాగనున్నారు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు ప్రస్తుతం సహాయ కోచ్‌గా పనిచేస్తున్న ఎరిక్ సిమ్మన్స్, మెంటార్‌గా పనిచేస్తున్న టి.ఎ.శేఖర్ ఇకమీదట జట్టును తీర్చిదిద్దడంలో కిర్‌స్టెన్‌కు తోడ్పాటు అందించనున్నారు. వీరితో పాటు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ముస్తాక్ అహ్మద్ మరోసారి ‘డెవిల్స్’కు స్పిన్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహరించవచ్చని భావిస్తున్నారు. ఇంతకుముందు రెండు అంతర్జాతీయ (్భరత్, దక్షిణాఫ్రికా) జట్లకు సేవలు అందించిన తనకు ఇప్పుడు ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుతో కలసి పనిచేసే అవకాశం లభించడాన్ని గౌరవంగా భావిస్తున్నానని కిర్‌స్టెన్ పేర్కొన్నాడు. ఒక జట్టును నాణ్యమైనదిగా తీర్చిదిద్దడం సుదీర్ఘ ప్రక్రియ అని తాను ఎప్పుడూ చెబుతుంటానని, ఫ్రాంచైజ్ క్రికెట్‌లో కొత్త సవాలును స్వీకరించేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నానని మంగళవారం ఆయన హైదరాబాద్‌లో విలేఖర్లకు వివరించారు. పాత మిత్రుడు ఎరిక్ సిమ్మన్స్ ద్వారానే తనకు ఈ అవకాశం లభించిందని, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు తనను ప్రధాన కోచ్‌గా నియమించాల్సిందిగా ఆయనే సిఫారసు చేశాడని కిర్‌స్టెన్ అంగీకరించాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాళ్లను వారి సామర్ధ్యానికి తగ్గట్టు రాణించేలా తీర్చిదిద్దడమే తన కర్తవ్యమని కిర్‌స్టెన్ తెలిపాడు. (చిత్రం) హైదరాబాద్‌లో విలేఖర్లతో మాట్లాడుతున్న గ్యారీ కిర్‌స్టెన్
భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్
english title:
gary
Date:
Wednesday, September 4, 2013