హైదరాబాద్, సెప్టెంబర్ 4: హైదరాబాద్ హెచ్‌ఐసిసి వేదికగా అక్టోబర్ 27, 28 తేదీల్లో పెగా డెవలపర్స్ అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు పెగా సిస్టమ్స్ ఇండియా వైస్ చైర్మన్, ఎండి సుమన్‌రెడ్డి తెలిపారు. ఈ సదస్సు వివరాలను తెలిపేందుకు బుధవారం ఆయనిక్కడ కంపెనీ ప్రతినిధి పంకజ్ గ్రోవర్‌తో కలిసి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుమన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ సదస్సులో టెక్నాలజీ నాలెడ్జ్ షేరింగ్, బిజినెస్ ట్రాన్స్‌ఫర్ సర్వీసెస్ వంటి అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. ఇందులో ఫార్చూన్ 500 కంపెనీలకు చెందిన ప్రతినిధులు, డెవలప్‌మెంట్ లీడర్స్, వ్యాపార విశే్లషకులు తమ తమ అభిప్రాయాలను పంచుకుంటారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద బ్యాంకులు, బీమా, క్రెడిట్ కార్డు, సాఫ్ట్‌వేర్ తదితర రంగాలకు చెందిన దాదాపు 2వేల మంది ప్రముఖులు సదస్సులో భాగస్వాములు కానున్నట్లు ఆయన తెలిపారు. అమెరికా తర్వాత ఇండియాలో పెగా డెవలపర్స్ నిర్వహిస్తున్న మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సు ఇదేనన్నారు. ఇందులో అన్ని రంగాల ప్రముఖులు పెగా డెవలపర్స్ కంపెనీ అందిస్తున్న మెరుగైన బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (బిపిఎం), కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ (సిఆర్‌ఎం) సర్వీసులపై మాట్లాడుతారని చెప్పారు.
డొకొమో నుంచి ‘ఖుషియోంకా రీచార్జ్’ పోటీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 4: వరుస పండుగ సీజన్లను ఉద్దేశించి తమ వినియోగదారుల కోసం టాటా డొకొమో ‘ఖుషియోంకా రీచార్జ్’ పోటీని బుధవారమిక్కడ ప్రకటించింది. ఈ పోటీ సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 14 వరకు ఉంటుందని కంపెనీ ఎపి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎస్ రామకృష్ణ తెలిపారు. పోటీలో పాల్గొనాలనుకునే డొకొమో వినియోగదారులు 89, 159, 248 వోచర్లతో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ వోచర్లు ఫుల్ టాక్ టైంతో పాటు పోటీలో బంగారు ఆభరణాలు, హోండా నియో బైకులు, చెవ్రోలెట్ బీట్ కార్లు వంటి ఆకర్షణీయమైన బహుమతులను గెల్చుకునే అవకాశాన్ని కల్పిస్తుందని ఆయన తెలిపారు. ఆఫర్ జిఎస్‌ఎం, సిడిఎంఎ సర్వీసులకు వర్తిస్తుందనగా, పోటీలో పాల్గొన్న వారిలో విజేతలను లక్కీ డ్రా ద్వారా ప్రకటిస్తామని చెప్పారు.
ధరలు పెంచే యోచనలో
టొయోటా, ఫోర్డ్ సంస్థలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: ప్రముఖ విదేశీ ఆటోరంగ సంస్థలు టొయో టా, ఫోర్డ్ తమ ఉత్పత్తుల ధరలను పెంచే యోచనలో ఉన్నాయి. డాలర్ విలువతో పోల్చితే భారీగా పడిపోతున్న రూపాయి విలువ కారణంగా భారమవుతున్న దిగుమతులు, పెరుగుతున్న వ్యయం దృష్ట్యా కార్ల ధరలు పెంచడంపై ఆలోచిస్తున్నాయి. ఈ క్రమంలోనే రూపాయి పతనం ఇలాగే కొనసాగితే అక్టోబర్ నుంచి ధరలు పెంచాలని భావిస్తున్నట్లు టొయో టా కిర్లోస్కర్ మోటార్ (టికెఎమ్) మార్కెటింగ్ అండ్ కమర్షియల్ విభాగం డిప్యూ టి మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ సింగ్ విలేఖరులకు తెలిపారు. పరిస్థితిని గమనిస్తున్నామని, తీవ్రతనుబట్టి ధరలను పెంచుతా మని ఫోర్డ్ ఇండియా అధ్యక్షుడు, జోగిందర్ సింగ్ చెప్పారు.
సివిసి విచారణలో వెలుగులోకి
రూ.7వేల కోట్ల స్కామ్‌లు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: పార్లమెంట్‌ను కుదిపేసిన కోల్‌గేట్‌తోసహా 7,000 కోట్ల రూపాయల విలువైన పోంజీ పథకాల మోసాలను గత ఏడాది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ బట్టబయలు చేసింది. ఇందులో బీహార్‌కు చెందిన టెలివిజన్ గ్రూప్ పాల్పడిన 2,700 కోట్ల రూపాయల అక్రమాలు, ముంబయిలోని స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎస్‌టిసి)కు ప్రమేయం ఉన్న 725 కోట్ల రూపాయల అక్రమాలూ ఉన్నట్లు ఇటీవలే పార్లమెంట్‌కు వచ్చిన సివిసి 2012 వార్షిక నివేదిక ద్వారా తెలుస్తోంది.
శీతాకాల సమావేశాల్లో
ఇన్సూరెన్స్ బిల్లు: చిదంబరం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఇన్సూరెన్స్ బిల్లును తీసుకొస్తామని ఆర్థిక మంత్రి చిదంబరం బుధవారం తెలిపారు. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను పెంచుకునేలా ఈ బిల్లులో సవరణలు చేయనుండ గా, ప్రస్తుత సమావేశాల్లో పెన్షన్ బిల్లుకు ఆమోదం లభించినందున వచ్చే సమావేశాల్లో ఇన్సూరెన్స్ బిల్లును ప్రవేశపెట్టాలన్న ప్రతిపక్షాల సూచనను ప్రభుత్వం ఆమోదించినట్లు చిదంబరం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు.