న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో ఆటోరంగ అమ్మకాలు అంతకంతకూ పడిపోతుండటంతో ఆటో పరిశ్రమకు ఉద్దీపనలను ఇవ్వడంలో ఉన్న అవకాశాలపై చర్చించేందుకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం వద్దకు ఆటోమొబైల్ పరిశ్రమకు చెందిన ఓ బృందంతో వెళ్లనున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ ప్రఫుల్ పటేల్ బుధవారం తెలిపారు. గతకొన్ని నెలలుగా ఆటో సంస్థల విక్రయాలు పడిపోయాయన్న ఆయన ఆటో రంగానికి ఈ పరిస్థితుల్లో ఓ ఉద్దీపన ప్యాకేజీ అవసరమని అభిప్రాయపడ్డారు. ‘ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రి చిదంబరంలతో సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (ఎస్‌ఐఎఎమ్), ఇతర పరిశ్రమ వర్గాలకు సమావేశం ఏర్పాటు చేస్తాను.’ అన్నారు. ఈ సందర్భంగా తమ ఆందోళనలను వ్యక్తం చేసే అవకాశం దొరుకుంతుందన్న ఆయన తప్పక వారు ఆశించిన సత్ఫలితాన్ని పొందగలుగుతారనే విశ్వాసాన్ని వెలిబుచ్చారు. వాస్తవానికి ప్రస్తుతం నెలకొన్న మందగమన పరిస్థితులు పారిశ్రామిక రంగంలో కొత్త ఉద్యోగాలను సృష్టించకపోగా, ఉన్న ఉద్యోగాలను కోల్పోయేందుకు దారితీస్తున్నాయని ఇక్కడ జరిగిన ఎస్‌ఐఎఎమ్ వార్షిక సమావేశంలో పాల్గొన్న ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక మందగమనానికితోడు మన దేశంలో ఎప్పుడూ అధికంగా ఉండే వడ్డీరేట్ల కారణంగా వినియోగదారుల కొనుగోళ్ల శక్తి దెబ్బతింటుందన్న ఆయన ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ సహకారంతో ఇఎమ్‌ఐల ద్వారా కొనుగోళ్లు జరిపే మధ్య తరగతి ప్రజానీకం మార్కెట్‌లోకి రాని పరిస్థితి ఉంటోందన్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్దకు తీసుకెళ్లామన్నారు. కాగా, ఆగస్టు నెలలో మారుతీ సుజుకీ, హోండా, హ్యూందాయ్ సంస్థల అమ్మకాలు గతంతో పోల్చితే పెరగగా, మహింద్ర, టొయోటా, టాటా మోటార్స్ అమ్మకాలు పడిపోయాయి. అలాగే ద్విచక్ర వాహన విభాగంలో హీరో మోటోకార్ప్, హోండా అమ్మకాలు వృద్ధిని నమోదు చేశాయి. అయితే దేశంలో కార్ల అమ్మకాలు జూలైలో తొమ్మిది నెలల కనిష్ట స్థాయికి దిగజారాయని ఎస్‌ఐఎఎమ్ చెబుతోంది. ఈ ఏడాది జూలైలో మొత్తం ఆటో అమ్మకాలు 14,15,102 యూనిట్లుగా ఉండగా, గత ఏడాది జూలైలో 14,45,112 యూనిట్లుగా ఉన్నాయి. దేశంలో అత్యధిక మందికి ఉద్యోగాలిస్తున్న రంగాల్లో ఆటో పరిశ్రమ కూడా ఒకటి. జిడిపిలోని తయారీ రంగంలో 25 శాతం వాటా ఆటో రంగానిదే కావడం గమనార్హం.
బజాజ్ అలియాంజ్ ఎండీగా
అనుజ్ అగర్వాల్ నియామకం
ముంబయి, సెప్టెంబర్ 4: ప్రైవేట్‌రంగ బీమా సంస్థ బజాజ్ అలియాంజ్ మేనేజింగ్ డైరెక్టర్, అఫీషియేటింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా అనుజ్ అగర్వాల్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంస్థ బుధవారం ప్రకటించింది. ఇంతకుముందు ఆ స్థానంలో ఉన్న వి ఫిలిప్ నుంచి అగర్వాల్ ఈ బాధ్యతలు అందుకుంటున్నట్లు తెలిపిన సంస్థ.. ఈ నియామకానికి బీమారంగ రెగ్యులేటర్ ఐఆర్‌డిఎ ఆమోదం కూడా లభించిందని స్పష్టం చేసింది. కాగా, 2001 నుంచి 2004 వరకు బజాజ్ అలియాంజ్‌తో పనిచేసిన అనుజ్ అగర్వాల్ ఆ తర్వాత ఇండోనేషియాలోని పిటి అసురన్సి అలియంజ్‌లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, చీఫ్ రిస్క్ ఆఫీసర్‌గా పనిచేశారు. కాగా, అంతర్జాతీయ అనుభవం కలిగిన అనుజ్ తమ సంస్థలోకి మళ్లీ రావడం ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో మాకు లాభాదాయకమని బజాజ్ అలియంజ్ చైర్మన్ సంజీవ్ బజాజ్ తెలిపారు.
ఈసారి వరి దిగుబడి
107 మిలియన్ టన్నులు
* 2013-14కు ఐజిసి అంచనా
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: ఈ ఏడాది పంట సీజన్ 2013 జూలై నుంచి 2014 జూన్ వరకు దేశీయంగా వరి దిగుబడి రికార్డు స్థాయిలో 107 మిలియన్ టన్నులు ఉండవచ్చని, ఇదే సమయంలో బియ్యం ఎగుమతులు గత పంట సీజన్ 2012-13తో పోల్చితే 10 శాతం తగ్గి 8.5 శాతంగా ఉండవచ్చని అంతర్జాతీయ ధాన్య మండలి (ఐజిసి) తెలిపింది. ప్రపంచంలో వరి ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్న భారత్ గత ఏడాది 104.4 మిలియన్ టన్నుల దిగుబడిని సాధించింది. అంతకుముందు సంవత్సరం 105.30 మిలియన్ టన్నులను సాధించింది. ఈ క్రమంలో ఈ పంట సీజన్‌లో 107 మిలియన్ టన్నుల ఉత్పత్తి అవుతుందని ఐజిసి అంచనా వేసింది. అలాగే ఈసారి 97.9 మిలియన్ టన్నుల డిమాండ్ ఉండవచ్చని పేర్కొంది. ఇక బియ్యం ఎగుమతుల విషయానికొస్తే ఈసారి 8.5 మిలియన్ టన్నులు ఎగుమతి కావచ్చని వివరించింది. గత ఏడాది 9.4 మిలియన్ టన్నుల ఎగుమతులుండగా, ఈసారి 10 శాతం తగ్గే వీలుందని చెప్పింది.