ముంబయి, సెప్టెంబర్ 4: మంగళవారం నాటి భారీ నష్టాల నుంచి దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం కోలుకున్నాయి. డాలర్ విలువతో పోల్చితే రూపాయి విలువ తిరిగి బలపడటం మదుపర్లలో కొనుగోళ్ల శక్తిని పెంచింది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ 332.89 పాయింట్లు పుంజుకుని 18,567.55 వద్ద, జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజ్ 106.65 పాయింట్లు పెరిగి 5,448.10 వద్ద స్థిరపడ్డాయి. మెటల్, హెల్త్‌కేర్, ఆటో రంగాల షేర్లు లాభాలు అందుకోగా, గృహ రుణాలపై బ్యాంకులకు ఆర్‌బిఐ చేసిన సూచనతో నిర్మాణ రంగ షేర్లు నష్టపోయాయి. కాగా, మంగళవారం సిరియాపై యుద్ధ భయాలతో సెనె్సక్స్ 650 పాయింట్లకుపైగా నష్టపోగా, నిఫ్టీ 210 పాయింట్ల మేర క్షీణించింది. ఈ క్రమంలో బుధవారం మార్కెట్ సెంటిమెంట్ బలపడటానికి ఆర్‌బిఐ నూతన గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా దోహదపడ్డారు. బుధవారం ఆయన దువ్వూరి సుబ్బారావు నుంచి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో కొత్త గవర్నర్ కీలక వడ్డీరేట్లను తగ్గిస్తారని, అలా కాని పక్షంలో కనీసం వడ్డీరేట్లను పెంచకుండానైనా ఉంటారనే అంచనాలు మదుపర్లలో తీవ్రంగా నెలకొన్నాయి. అటు ఆసియా మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయి. హాంగ్‌కాంగ్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు నష్టాల్లో ముగియగా, చైనా, జపాన్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఇదిలావుంటే మంగళవారం దేశీయ స్టాక్‌మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐ) 716.16 కోట్ల రూపాయల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ బుధవారం నాటి ట్రేడింగ్‌లో 56 పైసలు లాభపడింది. దీంతో 67.07కు రూపాయ విలువ చేరింది. మంగళవారం రూపాయ విలువ 163 పైసలు క్షీణించిన విషయం తెలిసిందే.