న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కొత్త గవర్నర్‌గా దువ్వూరి సుబ్బారావు స్థానంలో రఘురామ్ రాజన్ వచ్చారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) ముఖ్య ఆర్థికవేత్తగా పనిచేసిన 50 ఏళ్ల రాజన్.. బుధవారం ఆర్‌బిఐ 23వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడిన ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌బిఐ గవర్నర్ బాధ్యతలు అంత సులువైనవేమీ కాదని వ్యాఖ్యానించారు.
అలాగే ప్రస్తుతం దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని అంగీకరించారు. అయినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు ఇంకా పటిష్టంగానే ఉన్నాయన్నారు. స్థిరమైన ద్రవ్యవిధానం ఒక్కటే ఆర్‌బిఐపై ఉన్న బాధ్యత కాదన్న ఆయన వృద్ధి, అభివృద్ధి, ఆర్థిక సుస్థిరత కూడా ఆర్‌బిఐ కర్తవ్యాల్లో భాగమేనన్నారు. ఈ బాధ్యతలు మావి కావు అని ఆర్‌బిఐ ఎప్పుడు చెప్పదని ఈ సందర్భంగా రాజన్ స్పష్టం చేశారు. కాగా, దేశీయంగా అనిశ్చితి నెలకొందన్న రాజన్.. ఫైనాన్షియల్ మార్కెట్లు ఒడిదుడుకుల్లో కొనసాగుతున్నాయన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆర్‌బిఐ తగిన చర్యలు తీసుకుంటుందన్న భరోసాను కల్పించారు. ఇక ఆర్‌బిఐ ద్రవ్యవిధానంలో పారదర్శకత, ఊహాశక్తి అవసరమని నొక్కిచెప్పారు. నేటి పరిస్థితుల్లో దేశానికి వేగవంతమైన వృద్ధి అవసరమన్నారు. పారిశ్రామిక రంగంలో నెలకొన్న మందగమనంతో వృద్ధి క్షీణిస్తోందన్న ఆయన గ్రామీణ ప్రాంతాల నుంచి ఆర్థిక వ్యవస్థకు అందుతున్న వాటా ఎంతో ఉందని గుర్తుచేశారు. ఇదిలావుంటే దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రస్తుతం ఉన్న భయాలను చాలా ఎక్కువ చేసి చూపించే ప్రయత్నం జరుగుతోందని విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. మరోవైపు నూతన బ్యాంకుల లెసెన్సులపై స్పందిస్తూ బీమల్ జలాన్ నేతృత్వంలోని ఓ కమిటీ బ్యాంక్ లెసెన్సులను పరిశీలిస్తోందన్నారు. వచ్చే ఏడాది జనవరిలో కొత్త బ్యాంకులకు లెసెన్సులు ప్రకటించగలమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇక రాజన్ ఆర్‌బిఐ గవర్నర్‌గా ఈ నెల 20న తొలి ద్రవ్యవిధాన పరపతి సమీక్షను నిర్వహించనున్నారు.
ఇంతకంటే సమర్థుడు దొరకరు
ఇదిలావుంటే ఆర్‌బిఐ గవర్నర్ పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత దువ్వూరి సుబ్బారావు మాట్లాడుతూ ‘పది నిమిషాల క్రితం, నేను నా బాధ్యతలను రఘురామ్ రాజన్‌కు అప్పగించాను. ప్రస్తుత ఈ విపత్కర పరిస్థితుల్లో ఆర్‌బిఐ సారథిగా రాజన్ కంటే సమర్థులు దొరకరు.’ అని వ్యాఖ్యానించారు.
బ్యాంకర్ల విశ్వాసం
ముంబయి: ఆర్‌బిఐ గవర్నర్‌గా రాజన్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో దేశంలోని ప్రముఖ బ్యాంకర్లు ఆయనపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత కష్టకాలంలో ఆయన విజయవంతగా ముందుకెళ్లాలని కోరుకున్నారు. బుధవారం ఆర్‌బిఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎస్‌బిఐ చైర్మన్ ప్రతీప్ చౌధురితోపాటు మరికొన్ని ప్రధాన బ్యాంకుల అధిపతులు రాజన్‌కు శుభాకాంక్షలు అందజేశారు.
ఆర్‌బిఐ నూతన గవర్నర్ రఘురామ్ రాజన్‌తో దువ్వూరి సుబ్బారావు కరచాలనం