న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: హైదరాబాద్ చుట్టుపక్కల చట్టవిరుద్ధంగా భూములను సంపాదించుకున్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు తమ ఆస్తుస్థులను కాపాడుకోవటానికే సమైక్యాంద్ర ఉద్యమం పేరిట సంఘ విద్రోహశక్తులతో చేతులు కలిపారని ఆంధ్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఆరోపించింది. కాంగ్రెస్ నాయకులు పాల్పడుతున్న ఈ చర్యవల్ల సామాన్య ప్రజానీకం పడరాని పాట్లు పడుతున్నాని కమిటీ అధ్యక్షుడు సుంకర కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడు పెళ్లకూరు సురేందర్‌రెడ్డి ఆంటోనీ కమిటీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై ఆంధ్ర ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌పై ఒక నిర్ణయాన్ని వెంటనే ప్రకటించాలని కోరారు. జలవనరుల పంపిణీ న్యాయబద్ధంగా జరిగేందుకు ఒక ఉన్నత స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఈప్రతినిధి వర్గం కోరింది. రాష్ట్ర విభజన జరిగితే ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయన్న అపోహలను తొలగించే ప్రయత్నాలు చేయటంతోపాటు, విభజన తరువాత సీమాంధ్రకు లభించే ఆదాయంపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసిన పక్షంలో సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని వీరు తెలియచేశారు.
కిరణ్ సర్కార్‌ను బర్తరఫ్ చేయండి
దిగ్విజయ్‌కు దిలీప్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: తెలంగాణను ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని ధిక్కరించే తీరులో వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌కు ఈ మేరకు ఒక వినతి పత్రం అందచేశారు. కిరణ్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి రాష్టప్రతి పాలన విధించాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర పట్ల మొగ్గుచూపుతూ పార్టీ నిర్ణయాన్ని సవాల్ చేయడం క్షమార్హం కాదని దిలీప్ అభిప్రాయపడ్డారు.