న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: అక్షరాస్యత విషయంలో స్ర్తి, పురుషుల మధ్య ఉన్న అంతరాన్ని తొలగించాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. బాలికలకు విద్య నేర్పించడానికి నిరాకరించడమంత విచారకరమైన విషయం మరోటి లేదని ఆయన పేర్కొన్నారు. స్ర్తి, పురుషుల మధ్య అక్షరాస్యత స్థాయిలో ఉన్న అంతరాలను పూడ్చకుండా అభివృద్ధి లక్ష్యాలను, కీలకమైన ధ్యేయాలను సాధించడం క్లిష్టమని ఆయన అన్నారు. ‘విజ్ఞానం కోసం అందరూ-అందరికీ విజ్ఞానం’ అనే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన గురువారం ఇక్కడ నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఉద్బోధించారు. అర్థవంతమైన, సమర్థవంతమైన విద్యాబోధనకు మంచి పాఠ్యాంశాలతో పాటు ప్రస్తుత కాలానికి వర్తించే బోధనా పద్ధతులు, పరిశోధనా పద్ధతులు అవసరమని ఆయన పేర్కొన్నారు. నాణ్యమైన విద్యను ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి అవసరమైన వ్యవస్థలను అభివృద్ధి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు భాగస్వాములు కావడం తప్పనిసరని, అప్పుడే కోరుకున్న ఫలితాలను భాగస్వాములంతా అందుకోగలుగుతారని వివరించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో గల సిబిఎస్‌ఇ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, మొదలగు వాటిల్లో పనిచేస్తున్న 355 మంది ఉపాధ్యాయులకు ఆయన జాతీయ స్థాయి పురస్కారాలను ప్రదానం చేశారు. 177 మంది ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, 140 మంది మాధ్యమిక పాఠశాలల ఉపాధ్యాయులను ఆయన సత్కరించారు. ఆరుగురు సంస్కృతం ఉపాధ్యాయులు, నలుగురు మదరసాలకు చెందిన ఉపాధ్యాయులను కూడా ఆయన సత్కరించారు. ఈ అవార్డుల కింద ఒక్కొక్కరికి రూ.25వేల నగదు, ప్రశంసా పత్రం, రజత పతకాలను ఆయన అందించారు. ఉన్నతమైన సమాజానికి మంచి, పటిష్ఠమైన విద్య పునాది వంటిదని పేర్కొన్నారు. పౌరుల్లో విలువలు, తమ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వం పట్ల విశ్వాసం పెంపొందకుండా ఏ సమాజం ఉన్నతమైనదిగా అభివృద్ధి చెందజాలదని అన్నారు. నైతిక విలువలు పెంపొందించడంలో ఉపాధ్యాయులది కీలకపాత్ర అని రాష్టప్రతి పేర్కొన్నారు. యువతలో అవసరమైన నాగరిక విలువలను పెంపొందించడానికి, వారు తమ మాతృభూమిని ప్రేమించడానికి, తమ విధులను సక్రమంగా నిర్వర్తించడానికి, ఇతరుల పట్ల జాలిని, మహిళల పట్ల గౌరవ భావాన్ని, జీవితంలో నిజాయితీని కలిగి ఉండటానికి ఉపాధ్యాయులు సహాయపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. (చిత్రం) ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేస్తున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ
స్ర్తి విద్యను నిరాకరించడం విచారకరం * ఉపాధ్యాయ దినోత్సవంలో రాష్టప్రతి ప్రణబ్
english title:
pranab
Date:
Friday, September 6, 2013