న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: తెలంగాణపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని తెలుగుదేశం సభ్యుడు సిఎం రమేష్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. తెలంగాణను ఏర్పాటు చేయాలన్న నిర్ణయం వెలువడినప్పటి నుంచి సీమాంధ్రలో ఉవ్వెత్తున జరుగుతున్న ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన రాజ్యసభలో జీరోఅవర్‌లో దుయ్యబట్టారు. సీమాంధ్రలో ప్రజలు రోడ్లపైకి వచ్చి తమకు అన్యాయం చేయవద్దని ప్రాధేయ పడుతున్నారని చెప్పారు. తెలంగాణపై ప్రభుత్వ కమిటీని వేస్తామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రకటించారని చెబుతూ అఖిలపక్ష కమిటీ వేయటం వల్ల ఆశించిన ఫలితాలు లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తరువాత అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఒక్కసారి సీమాంధ్రలో పర్యటించి క్షేత్రస్థాయిలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను స్వయంగా చూసి న్యాయం చేయాలని రమేష్ విజ్ఞప్తి చేశారు.
తీవ్రవాదాన్ని అణచివేయాలి
దేశాన్ని అతులాకుతలం చేస్తున్న తీవ్రవాదాన్ని, తీవ్రవాదులను ఉక్కుపాదంతో అణిచివేయాలని బిజెపి సభ్యుడు ఎం వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. రాజ్యసభ జీరోఅవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. లష్కరే ఉగ్రవాదులు టుండా, భత్కల్ అరెస్టులను ఆయన హర్షించారు. దేశంలో తీవ్రవాదాన్ని రెచ్చకొట్టేందుకు ఇరుగు పొరుగు దేశాలు కుట్ర చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లకు బాధ్యుడైన భత్కల్ అరెస్టుతో సీమాంతర ఉగ్రవాదాన్ని రెచ్చకొట్టటానికి పాక్ చేస్తున్న ప్రయత్నాలు బయట పడగలవన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. తీవ్రవాదులను పట్టుకోవటంలో కీలకపాత్ర వహించిన అధికారులను వేధించటం మానుకోవాలని ఆయన ప్రభుత్వానికి సలహా ఇచ్చారు.
* రాష్ట్ర పరిస్థితులపై కేంద్రానికి టిడిపి సలహా
english title:
tdp
Date:
Friday, September 6, 2013