న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: నరేంద్ర మోడీ ప్రభుత్వంపై సస్పెండయిన గుజరాత్ పోలీసు అధికారి వంజర తీవ్ర ఆరోపణలు చేసిన తర్వాత ఆయన నేరాంగీకార ప్రకటనను పొందడానికి చర్యలు తీసుకోవాలని సిబిఐని ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలయింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌కౌంటర్లను ఎలా జరిపించేదో వంజర రాసిన లేఖ స్పష్టంగా వివరించిందని ఇద్దరు అడ్వకేట్లు దాఖలు చేసిన ఈ పిటిషన్ పేర్కొంది. అందువల్ల నేర శిక్షాస్మృతి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లోని నిబంధనల ప్రకారం సోహ్రాబుద్దీన్ షేక్, తులసీరాం ప్రజాపతి ఎన్‌కౌంటర్ కేసుల్లో ప్రధాన నిందితుడయిన వంజర ఒక జ్యుడీషియల్ అధికారి ముందు తన నేరాన్ని అంగీకరిస్తూ స్టేట్‌మెంట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సిబిఐని ఆదేశించాలని, ఈ స్టేట్‌మెంట్‌ను చట్టప్రకారం న్యాయస్థానాలు విచారణకు స్వీకరించవచ్చని, అంతేకాకుండా భవిష్యత్తుల్లో విచారణల సందర్భంగా ఆయన ఎదురుతిరగకుండా చూడవచ్చని ఆ పిటిషన్ పేర్కొంది. వంజర స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి తీరాలని, ఎందుకంటే కేసులపై దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని పిటిషనర్లు సతీశ్ గల్లా, ఎస్ ఉదయ్‌కుమార్ వాదించారు. గుజరాత్‌లో డిఐజి ర్యాంక్ అధికారి అయిన 59 ఏళ్ల వంజరను పలు బూటకపు ఎన్‌కౌంటర్లతో సంబంధం ఉందన్న ఆరోపణలపై సస్పెండ్ చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. అయితే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై పోరాటం జరిపి జైలు పాలయిన పోలీసు అధికారులను కాపాడడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైందని ఈ నెల 1న తన పదవికి రాజీనామా చేసిన వంజర ఆరోపించారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వంపై సస్పెండయిన
english title:
pil
Date:
Friday, September 6, 2013