గాంధీనగర్, సెప్టెంబర్ 5: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు నరేంద్ర మోడీని పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించే విషయంపై భారతీయ జనతా పార్టీ మల్లగుల్లాలు పడుతూ ఉంటే ఆయన మాత్రం ప్రధాని పదవిని చేపట్టాలని తాను కలలు కనడం లేదని, 2017 దాకా గుజరాత్‌కు సేవ చేయడానికి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తానని గురువారం స్పష్టం చేసారు. ‘నేను ఎప్పుడూ అలాంటి కలలు కనలేదు. అంతేకాదు భవిష్యత్తులో కూడా కనబోను. 2017దాకా తమకు సేవ చేయడానికి గుజరాత్ ప్రజలు నాకు తీర్పు ఇచ్చారు. నేను ఆ పనిని పూర్తి శక్తి సామర్థ్యాలతో నెరవేరుస్తాను’ అని మోడీ అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీయే బిజెపి ప్రధాని అభ్యర్థి అవుతారని, త్వరలో పార్టీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తుందని అందరూ అనుకుంటున్న తరుణంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. బిజెపి ప్రధాని అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించడంలో జాప్యం జరుగుతూ ఉండడంపై అసంతృప్తితోనే మోడీ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు. ‘ఏదో కావాలని కలులు కనేవారు చివరికి తమ భవిష్యత్తునే నాశనం చేసుకుంటారు. ఏదో అయిపోవాలని ఎవరు కూడా కలలు కనరాదు. దానికి బదులు ఏదో సాధించాలని కలలు కనడం మంచిది’ అని బిజెపి ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడయిన మోడీ గురువారం ఇక్కడ విద్యార్థులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ అన్నారు. 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా మీరు ఇక్కడికి వచ్చి మాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతారా అని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ మోడీ ఈ వ్యాఖ్యలు చేసారు.
పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై వివాదం ఉండకూడదని, అది క్రికెట్‌లో ‘హిట్ వికెట్’ లాంటిదవుతుందని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ పార్టీ ఓడిపోతే అదే కారణం కావచ్చని బిజెపి సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ బుధవారం వ్యాఖ్యానించిన ఒక రోజు తర్వాత మోడీ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ‘పార్లమెంటు ఎన్నికలు ఒక్కోసారి రాష్టప్రతి ఎన్నికలలాగా అవుతుంటాయి. ముఖ్యంగా నాయకుడికి తిరుగులేని పాపులారిటీ ఉన్నప్పుడు అలా జరుగుతుంది. గతంలో అటల్ బిహారీ వాజపేయి, ఇందిరాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ విషయంలో ఇలాగే జరిగింది’ అని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడైన జైట్లీ అంటూ, ఎంత త్వరగా బిజెపి తన నాయకుడ్ని ప్రకటిస్తే పార్టీకి అంత మంచిదని నొక్కి చెప్పారు. మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని జైట్లీ తరచూ గట్టిగా కోరుతూ ఉండడం తెలిసిందే. అయితే మోడీని సమాజంలో చీలికలు తెచ్చే వ్యక్తిగా చూస్తున్న ఎల్‌కె అద్వానీ లాంటి పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు మాత్రం ఈ ఆలోచనను వ్యతిరేకిస్తున్నారు.
నెల రోజుల క్రితం స్వాతంత్య్ర దినోత్సవం నాడు పరిపాలన విషయంలో ప్రధాని మన్మోహన్ సింగ్‌నే సవాలు చేయడం ద్వారా బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థిగా తన అవకాశాలను పదిలం చేసుకున్న మోడీ ఇప్పుడు ఇలా వ్యాఖ్యానించడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించి ఉంటుంది. వివాదాస్పద లోకాయుక్త బిల్లును అసెంబ్లీకి తిప్పి పంపిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర గవర్నర్ కమలా బేణీవాల్‌తో కలిసి వేదికను పంచుకున్న మోడీ తన యోగ విద్య మొదలుకొని 1852 మీటర్ల ఎత్తయిన సర్దార్ పటేల్ ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దాకా అనేక అంశాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ రూపాయి పతనంపై కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘రూపాయి తన విలువను కోల్పోయినందున ఉపాధ్యాయులకు ఇచ్చే అవార్డు మొత్తాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుకుంటోంది. రూపాయిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చారు. అందుకే టీచర్లు నిరాశచెందకుండా ఉండడానికి అవార్డు మొత్తాన్ని పెంచాలనుకుంటున్నాం’ అని ఆయన అన్నారు.
ప్రధాని పదవిపై కలలు కనడం లేదు * నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు
english title:
gujarat
Date:
Friday, September 6, 2013