కామవరపుకోట, మార్చి 4 : కత్తితో బెదిరించి, దోపిడీకి ప్రయత్నించిన ఒక దొంగ ఊహించని విధంగా ఇంటివారి నుండి ప్రతిఘటన ఎదురవ్వడంతో తోకముడిచిన ఉదంతమిది. కామవరపుకోట శివార్లలోని యానాదుల కాలనీలో ఆదివారం తెల్లవారుజామున ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఇంటి యజమాని కొత్త సుబ్బారావు కథనం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ముఖానికి గుడ్డకట్టుకున్న ఒక అగంతకుడు ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంటి అలమారాలో ఉన్న తాళాలు తీసుకుని సొరుగులు, అలమరలు వెతికాడు. విలువైనవేమీ దొరకకపోవడంతో వేరే గదిలో పడుతున్న సుబ్బారావును తలుపుతట్టి మరీ లేపాడు. తలుపు తీయగానే బలవంతంగా ఆయనను కిందకు తోశాడు కత్తి చేతబూని ఉన్న ఆగంతకుడు ఆయనపై దాడికి దిగాడు. ఈ అలికిడికి మెలకువ వచ్చిన ఆయన అత్త ఈడ్పుగంటి విమల దాడిని గమనించి, అగంతుకుడిపై కుర్చీతో దాడికి దిగారు. వారిరువురు ఆగంతకుడిపై తిరగబడ్డారు. ఈలోగా సుబ్బారావు భార్య కూడా లేవడంతో ఆగంతకుడు పారిపోయాడు. పెనుగులాట సందర్భంగా తనకు, అగంతకుడికి కత్తి గాయాలయ్యాయని సుబ్బారావు చెప్పారు. తన ఇంటిలో వున్న కుక్క కూడా ఎవ్వరు వచ్చినా, ఏ మాత్రం శబ్దం చేసినా అల్లరి చేసే కుక్కకూడా మిన్నకుండిపోయిందని చెప్పారు. దీనిపై తడికలపూడి పోలీసులకు సమాచారం అందించినట్లు చెప్పారు. తడికలపూడి ఎస్సై కె నాగేంద్రప్రసాద్ మాట్లాడుతూ దొంగ కొత్త సుబ్బారావు ఇంటి బాత్‌రూమ్‌కు వున్న పైపుల ద్వారా పై అంతస్తులోకి ప్రవేశించాడని, ఇనుపరాడ్డును ఉపయోగించి కిటికీ అద్దాలు పగలకొట్టి కిటికీ గ్రిల్స్‌ను తొలగించి లోనికి ప్రవేశించాడని చెప్పారు. ఈ పెనుగులాటలో అగంతకునికి రెండు చేతుల పైనా గాయాలయ్యాయని, రక్తం మరకలు కూడా సేకరించనున్నట్లు చెప్పారు. తడికలపూడి పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
క్లూస్‌టీం రాక
ఏలూరు నుంచి వచ్చిన క్లూస్ టీమ్ బి రాధాకృష్ణ ఆధ్వర్యంలో కొత్త సుబ్బారావు ఇంటి వద్ద ఏర్పడిన రక్తపు మరకలను సేకరించామని, అదేకాకుండా కిటికీ అద్దాలు పగలకొట్టిన ప్రదేశంలోనూ, తలుపులపైన వున్నటువంటి వేలిముద్రలను సేకరించినట్లు చెప్పారు. వీటన్నింటినీ జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తామని టెక్నికల్ అసిస్టెంట్ బి రాధాకృష్ణ చెప్పారు. కేసును తడికలపూడి పోలీసుల ఆధ్వర్యంలో దర్యాప్తు చేయనున్నట్లు ఆయన చెప్పారు.
గృహస్థుల ప్రతిఘటనతో తోకముడిచిన దొంగ
english title:
dd
Date:
Monday, March 5, 2012