రాంచి, సెప్టెంబర్ 5: రూపాయి విలువ పడిపోవడం, ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించేందుకు త్వరలో లౌకికవాద థర్డ్‌ఫ్రంట్ ఏర్పడుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ప్రజలంతా సమాజ్‌వాది పార్టీపై ఆశతో ఉన్నారని, అలాగే లౌకిక భావజాలం కలిగిన నాయకుల వైపు చూస్తున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్, బిజెపిలను దీటుగా ఎదుర్కొనేందుకు త్వరలోనే మూడోఫ్రంట్ ఏర్పడుతుందనే ఆశాభావంతో ఉన్నామన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఈ ఫ్రంట్ కృషి చేస్తుందని తెలిపారు. సమాజ్‌వాది పార్టీ జార్ఖండ్ శాఖ సదస్సులో అఖిలేష్ ప్రసంగిస్తూ తన ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఏకరువు పెట్టారు. లాప్‌టాప్‌లు, సైకిళ్లు, కిషన్ బీమా, పేద బాలికలకు ఉచిత విద్య వంటి వాటిని ఉత్తర్‌ప్రదేశ్‌లో అమలుపరుస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణాన్ని కల్పించినట్లు వెల్లడించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో జార్ఖండ్‌లో సమాజ్‌వాది పార్టీ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి ద్వారాలు తెరిచిందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆరోపించారు. ఆహార భద్రత అమలుకు అవసరమైన యంత్రాంగం దేశంలో ఉందా అని అఖిలేష్ ప్రశ్నించారు.
రూపాయి విలువ పడిపోవడం, ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలను
english title:
akhilesh
Date:
Friday, September 6, 2013