డెహ్రాడూన్, సెప్టెంబర్ 5: వాతావరణం అనుకూలించడంతో ఉత్తరాఖండ్‌లో సహాయ పనులు వేగం పుంజుకున్నాయి. కేదార్‌నాథ్‌లో మరో 64 మృతదేహాలు కనుగొన్నారు. కేదార్ లోయ పరిసర ప్రాంతాల్లో వాటిని స్వాధీనం చేసుకున్నట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. జూన్‌లో సంభవించిన వరదలకు భయపడి ఎత్తయన దిబ్బలపైకి ఎక్కిన భక్తులు వాటి కిందే ప్రాణాలు వదిలారు. విపరీతమైన మంచు కురవడం, రోజుల తరబడి వాతావరణం అలానే ఉండడంతో పర్వత పంక్తుల్లోనే శవాలుగా మారిపోయారు. రంబాడ, కేదార్‌నాథ్ ప్రాంతాల్లో మృతదేహాలకు దహన సంస్కారాలు పూర్తిచేసినట్టు ఐజి ఆర్‌ఎస్ మీనా తెలిపారు. పర్వత ప్రాంతాల్లో చిక్కుకున్న భక్తుల కోసం శతవిధాల ప్రయత్నించినా వాతావరణం అనుకూలించకపోవడంతో వీలుపడలేదని ఆయన చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితి ఇలానే ఉంటే జంగిల్‌ఛట్టీ, రంబాడ గౌరీగావ్‌లో సహాయ పనులు ముమ్మరం చేస్తామని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 11న కేదార్‌నాథ్‌లో ప్రత్యేక పూజలు జరపడానికి ఏర్పాట్లు పర్యవేక్షణకు డిజిపి సత్యవర్త్ బన్సల్‌తో కలిసి ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. 30 మంది పోలీసులు, జాతీయ విపత్తుల సంస్థ సిబ్బంది ప్రస్తుతం అక్కడి పనుల్లో నిమగ్నమై ఉన్నారని మీనా వెల్లడించారు.
వాతావరణం అనుకూలించడంతో ఉత్తరాఖండ్‌లో సహాయ పనులు వేగం
english title:
dead bodies
Date:
Friday, September 6, 2013