న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయం మూలంగా సీమాంధ్రలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను లోక్‌సభ దృష్టికి తెచ్చేందుకు ఉండవల్లి అరుణ్‌కుమార్ చేసిన ప్రయత్నాన్ని టి.ఎంపీలు అడ్డుకున్నారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్, తెలుగుదేశం ఎంపీలు మూకుమ్మడిగా దాడి చేయటంతో అరుణ్‌కుమార్ తమ వాదన వినిపించలేకపోయారు. ఉండవల్లికి, టి.ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, మందా జగన్నాథం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు కూడా పోడియం వద్దకు వచ్చి ఉండవల్లి ప్రసంగానికి నిరసనగా గొడవ చేశారు. దీంతో లోక్‌సభలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. స్పీకర్ మీరాకుమార్ అనుమతి మేరకు ఉండవల్లి సీమాంధ్రలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను సభ దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నించారు. గత ముప్ఫై రోజుల నుండి సీమాంధ్ర పూర్తిగా స్తంభించిపోయిందని ఆయన చెప్పారు. ఏ కార్యాలయం పని చేయటం లేదు, ఒక్క దుకాణం కూడా తెరుచుకోవటం లేదు, పాఠశాలలు, కాలేజీలు పని చేయటం లేదని ఆయన వివరించారు. సీమాంధ్రలో పరిస్థితి భయంకరంగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 1972లో తాము ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తే ఇవ్వని వారిప్పుడు రాష్ట్ర విభజన కోరటం విచిత్రంగా ఉన్నదని అరుణ్‌కుమార్ విమర్శించారు. నలభై సంవత్సరాల క్రితం తాము ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తే అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఇదే లోక్‌సభలో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సాధ్యం కాదన్నారు, హైదరాబాద్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు చెందుతుందని స్పష్టం చేశారని అరుణ్‌కుమార్ వాదించారు. ఈ దశలో నామా నాగేశ్వరరావు పోడియం వద్దకు దూసుకు వచ్చి అప్పుడు ఇందిరా గాంధీ రాష్ట్ర విభజన సాధ్యం కాదంటే ఇప్పుడు సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించాలనే నిర్ణయం తీసుకున్నారు, ఇది మీ ద్వంద్వనీతికి నిదర్శనమని దుయ్యబట్టారు. అప్పటికే ముందుకు వచ్చిన పలువురు టి.ఎంపీలు ఉండవల్లి వాదనను ఖండిస్తూ పెద్ద ఎత్తున గొడవ చేశారు. గతంలో ఇందిరా గాంధీ చెప్పినదాన్ని ఇప్పుడు ప్రస్తావించవలసిన అవసరం ఏమిటంటూ నిలదీశారు. పోడియం వద్ద నామా నాగేశ్వరరావు, ముందు వరుసలో ఉన్న టి.ఎంపీలు ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. దీంతో సభలో పెద్ద ఎత్తున గొడవ చెలరేగటంతో స్పీకర్ మీరాకుమార్ తదుపరి కార్యక్రమాన్ని చేపట్టటం ద్వారా సభను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.
నా గొంతు నొక్కారు
సీమాంధ్రలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం గురించి సభకు వివరించకుండా టి.ఎంపీలు తన గొంతు నొక్కేశారని అరుణ్‌కుమార్ ఆరోపించారు. అన్నదమ్ముల మాదిరిగా విడిపోతామని చిలకపలుకులు పలికే టి.ఎంపీలు తాను మాట్లాడేందుకు కూడా అంగీకరించకపోవటం సిగ్గుచేటని అన్నారు. లోక్‌సభలో సీమాంధ్ర గొంతు వినపడకుండా చేస్తున్న టి.ఎంపీలు తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణకు వ్యతిరేకంగా తాను ఏమీ అనకముందే అడ్డుతగలటం ఏమిటని నిలదీశారు. టి.ఎంపీలు ఇలాగా వ్యవహరిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు బిల్లు పాస్ కాకుండా చూస్తామని హెచ్చరించారు.
నెల రోజులుగా స్తంభించిన సీమాంధ్ర: ఉండవల్లి * అడ్డుతగిలిన టి.కాంగ్రెస్ ఎంపీలు * గొంతు కలిపిన టిడిపి నామా
english title:
telangana
Date:
Friday, September 6, 2013