శ్రీకాకుళం, సెప్టెంబర్ 6: రాష్ట్ర విభజనను నిరసిస్తూ జిల్లాలో సమైక్య వేడి రగులుతోంది. గత 38 రోజులుగా వివిధ రూపాల్లో నిర్వహిస్తున్న సమైక్య ఉద్యమాలు రోజురోజుకు వినూత్న సంతరించుకుంటున్నాయి. ఆంధ్రుల సాంప్రదాయాలు, పురాతన విద్యలను మేళవిస్తూ సమైక్య వాదులు తెలుగుజాతి గొప్పదనాన్ని చాటుకుంటున్నారు. జిల్లాకేంద్రంలో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు వంటా వార్పు కార్యక్రమం నిర్వహించి 500 మందికి అన్నదానం చేశారు. ఏడురోడ్ల కూడలి వద్ద సాముగరిడీలు ప్రదర్శించి పలు సమైక్య వాదులను ఆకట్టుకున్నారు. జిల్లా పట్టుశాలి సంక్షేమ సంఘం నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి పొట్టి శ్రీరాములు కూడలి వద్ద రాస్తారోకో చేపట్టి నిరసన తెలియజేశారు. సమైక్య ఉపాధ్యాయ జెఎసి ఆధ్వర్యంలో ఉపాద్యాయులు చేపట్టిన రిలే దీక్షలు నాలుగవ రోజుకు చేరుకున్నాయి. జిల్లా పిఇటిల సంఘం ఆధ్వర్యంలో ఏడురోడ్ల కూడలి వద్ద సమైక్య మాక్ డ్రిల్ నిర్వహించి వినూత్న నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఉపాధ్యాయులు దీక్షలు కొనసాగిస్తున్నారు. ఎన్జీవో హోం వద్ద స్టేట్ ఆడిట్ ఉద్యోగులు దీక్షలు చేపట్టారు. జిల్లా పరిషత్ కార్యాలయ ఉద్యోగులు చేపట్టిన దీక్షలు కొనసాగిస్తూ కొంత మంది సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు హైదరాబాద్‌కు బస్సులో బయలుదేరి వెళ్లారు. కలక్టరేట్ వద్ద హౌసింగ్ సిబ్బంది దీక్షలు ప్రారంభించారు. జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు జిల్లా కోర్టు సముదాయం వద్ద దీక్షలు చేపట్టారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఆమదాలవలసలో టైలర్ల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర విభజనను నిరసిస్తూ ర్యాలీ సాగించారు. అలాగే ఉపాధ్యాయ జేఏసి ఆధ్వర్యంలో మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. నరసన్నపేటలో విశ్వబ్రాహ్మణ సంఘం సమైక్యాంధ్ర జేఏసి సాగిస్తున్న రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపి పాల్గొన్నారు. జలుమూరు మండలం చల్లవానిపేట జంక్షన్‌లో ఉపాధ్యాయ జేఏసి దీక్షలు కొనసాగుతున్నాయి. సారవకోట మండలం బుడితి జంక్షన్‌లో ఆటోయూనియన్లు ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. పొందూరు మండలం తండ్యాం ప్రధాన రహదారిపై సమైక్యవాదులు వంటావార్పు నిర్వహించి భోజనాలు ఆరంగించి వాహనాలను అడ్డుకున్నారు. పొందూరు, జి.సిగడాం మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. పలాసలో క్రిష్టియన్ సోదరులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ప్రార్ధనలు చేశారు. మందసలో నారుూబ్రాహ్మణులు ప్రధాన రహదారిపై బైఠాయించారు. ముగ్గురు నారుూబ్రాహ్మణులు శిరోముండనం చేయించుకుని నిరసన వ్యక్తంచేశారు. ఇచ్ఛాపురం, సోంపేట, టెక్కలి, కోటబొమ్మాళి తదితర ప్రాంతాల్లో సమైక్యాంధ్ర సెగలు మిన్నంటుతున్నాయి. పాలకొండలో సమైక్యాంధ్ర జేఏసి ఆధ్వర్యంలో సాగుతున్న రిలే దీక్షల్లో ఎ.ఎం.సి చైర్మన్ దామోదరరావు ఆధ్వర్యంలో సర్పంచ్‌లు పాల్గొని సంఘీభావం తెలిపారు. ప్రధాన రహదారిపై సీతంపేట ఉన్నతపాఠశాల విద్యార్థులు బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. ఎన్.కె.రాజపురం వద్ద సమైక్యవాదులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతు తెలిపారు. రాజాం, వంగర, భామిని, కొత్తూరు, బత్తిలి తదితర ప్రాంతాల్లో దీక్షలు కొనసాగించి వినూత్న నిరసనలు వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్ర విభజనను నిరసిస్తూ జిల్లాలో సమైక్య వేడి రగులుతోంది
english title:
division
Date:
Saturday, September 7, 2013