గార, సెప్టెంబరు 6: మండలం శ్రీకూర్మంలో వెలసియున్న కూర్మథునికి సహస్ర ఘటాభిషేకం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారిణి శ్యామలాదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వర్షాలు అనుకూలించక తలెత్తిన నీటి సమస్యలుతో సతమతం అవుతున్న రైతుల ఇక్కట్లను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కార్యనిర్వహణాధికారిణి శ్యామలాదేవి తెలిపారు. ఆలయ ప్రధానార్చకుడు చామర్ల సీతారామనృసింహాచార్యులు నేతృత్వంలో అర్చక స్వాములు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ పాలకమండలి సభ్యులు, ఆలయ పరిరక్షణ కమిటి సభ్యులుతో పాటు భుక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
విక్రయానికి వినాయక విగ్రహాలు సిద్ధం
పొందూరు, సెప్టెంబర్ 6: తెలుగుజాతివారి తొలిపండుగ అయిన వరసిద్ధివినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు మండల ప్రజానీకం సమాయత్తవౌతుంది. పండుగ ద్వారా ప్రజలు సొమ్ము చేసుకోవాలన్న తలంపుతో ఇతర జిల్లాల నుంచి వ్యాపారులు గత కొద్దినెలలుగా మకాం వేసి వినాయకుని విగ్రహాలను అత్యంత ఆకర్షణీయంగా తయారుచేశారు. గతంలో మట్టివిగ్రహాలను అతికష్టం మీద తయారుచేసేవారు. వాటికి ధీటుగా తేలిగ్గా అందంగా తయారు చేసిన తాజా వినాయకుని విగ్రహాల పట్ల జనాలు అమితంగా ఆకర్షితులవుతున్నారు. పల్లెపల్లెల్లో జరుగుతున్న ఈ వేడుకల్లో విగ్రహాలకు గిరాకీ పెరిగింది. పొందూరు, సిగడాం,లావేరు, సంతకవిటి మండలాలకు చెందిన ప్రజలు ఈ తేలికపాటి విగ్రహాలను కొనుగోలు చేయడంతో వ్యాపారుల ఆనందానికి అవధుల్లేవు.
సాగునీరు అందక రైతుల కష్టాలు
నరసన్నపేట, సెప్టెంబర్ 6: మండలంలో పంట పొలాలకు సాగునీరందకపోవడంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రతీ ఖరీఫ్ సీజన్‌లో డిసెంబర్ నాటికే అన్నిచోట్ల నాట్లు వేసేవారు. ఈ ఏడాది పూర్తిస్థాయిలో ఎదలు కూడా జరుగని పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. మాకివలస గ్రామం వద్ద దేవాది ఆర్.్ఛనల్ గుండా సాగునీరు వచ్చినప్పటికీ గుర్రపుడెక్క కాలువలో పేరుకుపోవడంతో వచ్చిన నీటికి అడ్డుగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు పలుమార్లు వంశధార ఇంజనీరింగ్ అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండాపోయిందన్నారు. అయితే రావులవలస గ్రామ రైతులు మాత్రం శ్రమదానంతో కాలువలోని గుర్రపుడెక్కలను తొలగించారు. అధికారులను నమ్ముకుంటే ఏ పనీ జరుగదని, తామే స్వంతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వారు పేర్కొన్నారు.
వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి
* డిఎస్పీ శ్రీనివాసరావు
శ్రీకాకుళం , సెప్టెంబర్ 6: సబ్‌డివిజన్ పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లో వినాయక మండపాలు పెట్టదలచుకున్న వారు ముందుగా పోలీసు అనుమతి పొందాలని శ్రీకాకుళం డిఎస్పీ పి.శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. మున్సిపాల్టీ పరిధిలోని వారు మున్సిపల్ కమిషనర్, గ్రామ పంచాయతీ పరిధిలోని వారు సదరు పంచాయతీ కార్యదర్శి నుండి అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. లిఖిత పూర్వక అనుమతి పొందిన వారు మైక్ పెట్టుకోవడానికి పోలీసులు అనుమతి మంజూరు చేస్తారని తెలిపారు. అదేవిధంగా రోజువారీ కార్యక్రమాలతో పాటు నిమజ్జనం తేదీని ముందుగా సంబంధిత పోలీసు స్టేషన్‌లో తెలియజేయాల్సి ఉంటుందన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జ్వరాలతో మంచంపట్టిన కొంగరాం
ఎచ్చెర్ల, సెప్టెంబర్ 6: జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మండలంలోని పెద్దకొంగరాంలో జ్వరాలు ప్రబలడంతో అనేక మంది మంచాలపై మూలుగుతున్నారు. ఇదే గ్రామానికి చెందిన రావాడ శ్రీను అనే యువకుడు జ్వరంతో బాధపడుతూ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే శ్రీనుకు డెంగ్యూ జ్వరమని, అక్కడ వైద్యులు నిర్ధారించినట్టు గ్రామంలో ప్రచారం జరుగుతున్నది. . మరో 20 మంది వరకు జ్వరాలతో బాధపడుతున్నట్టు స్థానికులు పేర్కొంటున్నారు. పారిశుద్ధ్య లోపానికి వైద్య సేవలు అంతంత మాత్రంగా ఉండటమే దీనికి కారణమని తక్షణమే ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని సర్పంచ్ నక్క లక్ష్మణరావు కోరుతున్నారు. ఇదే మాదిరిగా ముద్దాడ గ్రామంలో కూడా జ్వరాల తీవ్రత అధికంగా ఉంది.
రిమ్స్ వైద్యులపై కలెక్టర్‌కు ఫిర్యాదు
శ్రీకాకుళం , సెప్టెంబర్ 6: జిల్లా కేంద్రానికే తలమానికమైన పేదల వైద్య విద్యాకళాశాల (రిమ్స్) వైద్యులు సమయపాలన పాటించడం లేదని, స్థానికంగా నివాసం ఉండటం లేదని పౌరసంఘాల సమాఖ్య(్ఫకస్) నాయకులు పంచాది పాపారావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ప్రతిష్ఠాత్మకమైన రిమ్స్ వైద్య కళాశాలలో సుమారు 130 మంది వైద్యులు విధులు నిర్వహిస్తుండగా, వీరిలో సుమారు వంద మంది విశాఖపట్నం నుండి రాకపోకలు సాగిస్తున్నట్లు తెలిపారు. వారు ఉదయం 11 గంటలకు విధులకు వచ్చి మధ్యాహ్నం మూడు గంటలకే తిరిగి వెళ్లిపోతున్నారని, జిల్లా నలుమూలల నుండి వచ్చే రోగులు వైద్యులు లేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా వైద్యులు విధి నిర్వహణలో చాలా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
వివిధ రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలకు తిరిగి వైద్యులను కలవాలంటే రెండు మూడు రోజులు పడుతుందని, దీంతో రోగులు ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకుని రిమ్స్ వైద్యులు స్థానికంగా నివాసముండి సమయపాలన పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు అందజేసిన వారిలో సిటు నాయకులు ఎన్.బలరాం, బి.సత్యంనాయుడు, డి.గణేష్, టి.తిరుపతిరావు, కె.నారాయణ రావు, పి.ప్రభావతి, ఆర్.చిన్నమ్మడు, ఎం. ఆదినారాయణమూర్తి, ఎస్.సూరమ్మ తదితరులు ఉన్నారు.
నైతిక విలువలతో కూడిన విద్యనందించండి
* వైస్ ఛాన్సలర్ లజపతిరాయ్
ఎచ్చెర్ల, సెప్టెంబర్ 6: జిల్లాలో ఉన్న డిగ్రీ కళాశాలలన్నీ నైతిక విలువలతో కూడిన విద్యనందించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ హెచ్.లజపతిరాయ్ సూచించారు. శుక్రవారం అంబేద్కర్ విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, కరస్పాండెంట్లతో బోర్డు ఆఫ్ స్టడీస్ సమావేశాన్ని సిడిసి డీన్ తులసీరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యతోపాటు నైతిక విలువలకు సంబంధించిన నిపుణులతో పునశ్చరణ తరగతులు కూడా నిర్వహించాలని సూచించారు. సమాజమే సిలబస్‌గా వర్శిటీ విద్యార్థులకు కీలక బాధ్యతలను అప్పగించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. అదేమాదిరిగా డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులను సమాజంలోకి వెళ్లేలా వివిధ విస్తరణ కార్యక్రమాలను రూపొందించాలన్నారు. ఇందుకు గాను మూడేళ్లపాటు 50 మార్కులు నిర్ధేశించి వాటిని మరింత ప్రోత్సహించాలన్నారు. బోధనాంశాలతోపాటు ఫీల్డు వర్క్ కూడా ఎంతో అవసరమని చెప్పారు. ప్రతీ కళాశాలలో కూడా లేబ్ ఏర్పాటు చేసి సోషల్‌సైనె్సస్ సబ్జెక్టులపై మరిన్ని ప్రాజెక్టులు రూపొందించాలని సూచించారు. సిడిసి డీన్ ప్రొఫెసర్ తులసీరావు మాట్లాడుతూ అకడమిక్ క్యాలెండర్ మేరకే క్లాస్‌వర్క్ జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కృష్ణమోహన్, ప్రిన్సిపాల్ ఎం.చంద్రయ్య, ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ పి.చిరంజీవులు, ఆచార్యులు టి.కామరాజు, బి.అడ్డయ్య, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్లు బి.పోలీసు, మైథిలి తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయులకు కృపారాణి అభినందన
శ్రీకాకుళం , సెప్టెంబర్ 6: రాష్టప్రతి అవార్డుకు ఎంపికైన జిల్లాకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను కేంద్ర ఐటి, కమ్యూనికేషన్లు శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి అభినందించారు. ఈ మేరకు ఉపాధ్యాయులు శుక్రవారం కేంద్ర మంత్రిని తన క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. జిల్లాకు చెందిన ఉప్పాడ సూర్యనారాయణ, కె.త్రినాధరావు, బి.ఎ స్టాలిన్, ఎస్.పి.కూర్మాచార్యులు గురువారం సర్వేపల్లి రాధాకృష్ణ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని రాష్టప్రతి భవన్‌లో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు రాష్టప్రతి అవార్డుకు ఎంపికకావడం అభినందనీయమని ఈ మేరకు కేంద్రమంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు.
* రమాదేవిని అభినందించిన కలెక్టర్ సౌరభ్‌గౌర్
స్థానిక వివేకానంద విద్యా నిలయంనకు చెందిన జి.రమాదేవి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక కాగా కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఆమెను అభినందించారు. జిల్లాలో హిందీ భాషను అత్యున్నత స్థాయికి తీసుకువచ్చినందుకు ఈ అవార్డు ఆమెను వరించింది. ఈమె హిందీ మంచ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు.
విభజనపై విద్యార్థుల ఆగ్రహం
ఎచ్చెర్ల, సెప్టెంబర్ 6: ప్రజల మనోభావాలను పక్కనపెట్టి యుపిఏ పెద్దలు తీసుకున్న విభజన నిర్ణయంపై అంబేద్కర్ విశ్వవిద్యాలయం విద్యార్థులు అలుపెరుగని ఉద్యమాన్ని గత 37 రోజులుగా సాగిస్తున్నారు. వివిధ రూపాల్లో నిరసన వ్యక్తంచేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వాణి వినిపిస్తున్నారు. జిల్లాలో సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి మరింత స్పూర్తినిచ్చేవిధంగా ఇక్కడ విద్యార్థులు సాగిస్తున్న నిరసనలు మిన్నంటుతున్నాయి. శుక్రవారం వారంతా తరగతులు బహిష్కరించి మానవహారం, ర్యాలీ చేపట్టారు. జై సమైక్యాంధ్ర..జైజై సమైక్యాంధ్ర అంటూ నినదించారు. రాజీడ్రామాలు ఆపి సీమాంధ్ర నేతలంతా ఉద్యమంలో భాగస్వాములు కాకుంటే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. హైదరాబాద్ ఎవడబ్బ సొమ్మురా అంటూ స్వరం పెంచారు. అలాగే అంబేద్కర్ విగ్రహం పైకెక్కి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ దిక్కులు పెక్కటిల్లేలా నినదించారు. అక్కడ నుంచి జాతీయ రహదారిపైకి చేరుకుని మోకాళ్లతో నిరసన సాగిస్తూ రాస్తారోకో నిర్వహించారు. సుమారు అర్ధగంటసేపు ఈ నిరసన కొనసాగడంతో హైవేపై ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. వర్శిటీ విద్యార్థిజేఏసి ప్రతినిధులు ధనరాజ్, బడే రామారావు, ప్రసాద్, వశిష్ట తదితరులు నేతృత్వంలో వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు కూడా తాము సైతమంటూ రాస్తారోకోలో పాల్గొన్నారు. చిలకపాలెం కూడలి నుంచి ఆర్చి వరకు వాహనాలన్నీ బారులు తీరాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్సై ఉదయ్‌కుమార్ బందోబస్తు నిర్వహించి వాహన రాకపోకలను క్రమబద్ధీకరించారు.
ప్రేమజంట వివాహానికి పెద్దల సమ్మతి
జి.సిగడాం, సెప్టెంబర్ 6: మండలం పెనసాం గ్రామానికి చెందిన మేజర్లు అయిన పోకతోట నాగార్జున, కె.మంజులల ప్రేమవివాహానికి పోలీసుల చొరవతో పెద్దలు అంగీకరించారు. నాగార్జున రాజమండ్రిలో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మంజుల జి.సిగడాంలోని జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేసింది. వీరిద్దరూ ఒకేసామాజిక వర్గానికి చెందినా పెళ్లికి నాగార్జున తల్లి, అన్నదమ్ములు అంగీకరించకపోవడంతో ప్రేమికులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు శుక్రవారం ప్రేమికుల కుటుంబాలను పిలిచి పోలీసులు విచారించారు. క్రిష్టియన్ కావడంతో చర్చిలో వివాహం జరిపించేందుకు మంజుల తల్లిదండ్రులు అంగీకరించారు. ఆదివారం మండల కేంద్రంలోని మరనాధ విశ్వాసం చర్చిలో వివాహం చేసేందుకు ఎస్సై తులసీరావు సమక్షంలో నిశ్చయించారు.
రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
పొందూరు, సెప్టెంబర్ 6: ఇక్కడి రైల్వేస్టేషన్‌లో శుక్రవారం వేకువఝామున విశాఖ నుంచి తాల్చేరు వెళ్తున్న గూడ్స్‌రైలు కింద పడి గుర్తుతెలియని 40 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు నిక్కరు, గళ్లచొక్కా ధరించి ఉన్నాడు. మృతుడు యాచకుడని తెలుస్తోంది. ఈ సంఘటన వివరాలను శ్రీకాకుళం రోడ్ రైల్వేపోలీసులకు తెలియజేశామని స్టేషన్‌మాస్టర్ శ్రీనివాసరావు తెలిపారు. రైల్వేపోలీసులు శవపంచనామా జరిపించిన అనంతరం పోస్టుమార్టంకై శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.
200 లీటర్ల సారా పట్టివేత
*900 లీటర్ల బెల్లంఊట ధ్వంసం
పాతపట్నం, సెప్టెంబర్ 6: మండలంతోపాటు మెళియాపుట్టి పరిధిలో 900 లీటర్ల బెల్లంఊటలను ధ్వంసం చేసినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఇన్‌స్పెక్టర్లు కుమార్, నాగేశ్వరరావులు తెలిపారు. మెళియాపుట్టి మండలంలో సవరముకుందపురం గ్రామంలో 500 లీటర్లు, అక్కోజిపేట గ్రామంలో 400 లీటర్ల బెల్లంఊటలను ధ్వంసం చేశారు. గుగ్గిలి సమీపాన రంపసాన బ్రిడ్జి వద్ద రూట్ పరిశీలన చేస్తూ ఒడిశా ప్రాంతం నుండి ఆంధ్ర ప్రాంతానికి 200 లీటర్ల సారాయి రవాణాను అధికారులు అడ్డుకుని పట్టుకున్నారు. ఈమేరకు మదనాపురం గ్రామానికి గణపతిపండా, సోమనాధపురం గ్రామానికి చెందిన కె.గిరిరాజారావు, ఒడిశాకు చెందిన సవర అర్జునలను అరెస్టు చేసి టెక్కలి కోర్టులో హాజరుపరిచారు. జంటా భాస్కరరావు పరారీలో ఉన్నాడని, వీరి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
వినాయకచవితి తర్వాత లక్ష గళార్చన
* పిడి రజనీకాంతరావు
ఎచ్చెర్ల, సెప్టెంబర్ 6: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లాలో ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులంతా లక్ష గళార్చనకు సిద్ధం కావాలని డి.ఆర్.డి.ఏ, ఐకెపి ప్రాజెక్టు డైరెక్టర్ పి.రజనీకాంతరావు పిలుపునిచ్చారు. స్థానిక టి.టి.డి.సి.లో శుక్రవారం జిల్లా మహిళా సమాఖ్య సమావేశాన్ని నిర్వహించి మాట్లాడుతూ వినాయక చవితి అనంతరం లక్షగళార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, వీటిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. అదేవిధంగా ఆరుబయటే మండల మహిళా సమావేశాలు నిర్వహించి నిరసన వ్యక్తంచేయాలని నిర్ణయించారు. మానవహారాలు, ర్యాలీలు, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వివిధ నిరసన కార్యక్రమాలు ముందుకు నడిపించాలన్నరు. ఈయనతోపాటు జెడ్‌ఎస్ అధ్యక్షురాలు గున్నమ్మ, ఎ.పి.డి ధర్మారావు సిబ్బంది పాల్గొన్నారు.
సేవ్ ఆంధ్రప్రదేశ్‌కు మద్దతుగా రాస్తారోకో
* టిడిపి జిల్లా అధ్యక్షుడు బాబ్జీ
ఎచ్చెర్ల, సెప్టెంబర్ 6: రాజధానిలో నిర్వహిస్తున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు మద్దతుగా మండలంలో కుశాలపురం ఆర్చి వద్ద రాస్తారోకోను శనివారం నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి(బాబ్జీ) ఒక ప్రకటనలో తెలిపారు. ఎపిఎన్జీఒ నేతలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ జరుపతలపెట్టిన సభను అడ్డుకోవాలన్న వేర్పాటువాదులు తెలంగాణ బంద్‌కు పిలుపునివ్వడం అప్రజాస్వామికమని ఆయన ఖండించారు. తెలంగాణ బంద్‌ను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో మానవహారం, ర్యాలీ, రాస్తారోకో వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నామన్నారు.
ఆగిన ‘తుఫాన్’
శ్రీకాకుళం, సెప్టెంబర్ 6: విడుదల రోజే కేంద్ర మంత్రి చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌తేజ్ నటించిన తుఫాన్ సినిమాకు సమైక్యవాదుల నుండి శుక్రవారం ఆటంకం ఎదురైంది. చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్ల వద్ద సమైక్యవాదులు ఆందోళన చేయడంతో జిల్లాలో చాలా థియేటర్లలో సినిమా మొదటి ఆటను నిలుపుదల చేశారు. సినిమా ప్రదర్శనకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని హైకోర్టు నుంచి నిర్మాతలు అనుమతి తెచ్చుకున్నప్పటికీ సమైక్యవాదుల ముందస్తు హెచ్చరికలకు భయపడి థియేటర్ యాజమాన్యాలు మొదటి ఆటను ఆడించేందుకు వెనకడుగు వేశాయి. జిల్లా వ్యాప్తంగా 30 థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించాల్సి ఉండగా, జిల్లా కేంద్రంలో కినె్నర, సూర్యమహల్, మారుతి, ఎస్.వి.సి రామలక్ష్మణ, సరస్వతీమహల్ థియేటర్లతోపాటు రణస్థలం, పాతపట్నం, పలాస, సోంపేట, రాజాం, పాలకొండ, సారవకోట మండలం అవలింగి, టెక్కలిలోని సినిమా థియేటర్ల వద్ద ఉద్యమకారులు ఆందోళనలు చేయడంతో మొదటి ఆటను నిలుపుదల చేశారు. దీంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సమైక్య సెగలతో సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ముఖం చాటేయడంతో నష్టాలు చవిచూస్తున్నామని థియేటర్ యాజమాన్యాలు వాపోతున్నాయి. అయితే మధ్యాహ్నం నుంచి ప్రదర్శనలు జరిపారు.