మచిలీపట్నం , సెప్టెంబర్ 6: సమైక్యాంధ్ర కోరుతూ మచిలీపట్నంలో శుక్రవారం నిరసనలు హోరెత్తాయి. రాష్ట్ర విభజనను నిరసిస్తూ, సమైక్యాంధ్ర ఆకాంక్షిస్తూ, పలు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరిట శనివారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు పట్టణం నుండి సుమారు వెయ్యి మంది సమైక్యవాదులు తరలి వెళ్ళారు. తూర్పు కృష్ణా జెఎసి ఆధ్వర్యంలో 17 ప్రైవేట్ బస్సులను సమకూర్చగా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు సుమారు 500 మంది పైబడి హైదరాబాద్ వెళ్ళారు. ఈ బస్సులను ప్రభుత్వ మాజీ విప్ పేర్ని వెంకట్రామయ్య (నాని) జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తూర్పు కృష్ణా జెఎసి చైర్మన్ ఉల్లి కృష్ణ, దారపు శ్రీనివాస్, పి వెంకటేశ్వరరావు, రావి శ్రీనివాసరావు, సిహెచ్ చంద్రశేఖరరావు, రవీంద్ర, యాకుబు, శోభన్, ఆరేపు వెంకటేశ్వరరావు, పివి ఫణి కుమార్, యు రాజశేఖర్, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర కోరుతూ నెల రోజులుగా నిర్వహిస్తున్న ఆందోళనల పరంపర కొనసాగింది. కోనేరు సెంటరులో జెఎసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 24వ రోజుకు చేరాయి. బెల్ కంపెనీ ఉద్యోగులు పట్టణంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. డప్పుల వాయిద్యాల మధ్య కోనేరు సెంటరు వరకు ప్రదర్శన నిర్వహించి దీక్షాపరులకు సంఘీభావం తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ఉద్యోగులు నిర్వహిస్తున్న రిలే దీక్షలు 4వ రోజుకు చేరాయి. దీక్షలో పాల్గొన్న ఉద్యోగులు కోతి కొమ్మచ్చి ఆడి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఉద్యోగుల జెఎసి ఆధ్వర్యంలో ఆస్పత్రి ఎదుట మోకాళ్ళపై నిలబడి అర్ధనగ్న ప్రదర్శన చేశారు. జై సమైక్యాంధ్ర అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. న్యాయ శాఖ ఉద్యోగులు ఛలో హైదరాబాద్ ప్లే కార్డులు చేతబూని రిక్షా తొక్కి నిరసన తెలిపారు. అనంతరం ప్రత్యేక బస్సులో హైదరాబాద్ వెళ్ళారు.
సమైక్యాంధ్ర కోరుతూ మచిలీపట్నంలో శుక్రవారం నిరసనలు హోరెత్తాయి
english title:
hitham.. abhimatham
Date:
Saturday, September 7, 2013