నూజివీడు, సెప్టెంబర్ 6: సమైక్యాంధ్ర సాధించే వరకు ఏమాత్రం విశ్రమించేది లేదని, పోరాటం చేస్తామని పలు కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. సంయుక్త కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో గృహ నిర్మాణ శాఖ ఉద్యోగులు, వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు విడివిడిగా నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుందని, దీనివల్ల ఆంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. నిరుద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాలతో నీటి ఇబ్బందులు ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ సమస్యలు ఇంకా పెరుగుతాయని చెప్పారు.
దీనివల్ల వ్యవసాయ రంగం బాగా కుంటుపడుతుందని, వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోతాయని అన్నారు. సమస్యలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ ఉపసంహరించుకోవాలని కోరారు. జిల్లాలోని గృహ నిర్మాణ శాఖలో పనిచేసే ఉద్యోగులు నూజివీడులో సమైక్యాంద్ర కోరుతూ ర్యాలీ చేశారు. అదేవిధంగా సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు పురవీధులలో నిరసన ప్రదర్శన నిర్వహించిన అనంతరం బస్టాండ్ వద్ద వంటవార్పు నిర్వహించి అన్నదానం చేశారు. వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు ర్యాలీ చేశారు. పురపాలక సంఘం ఉద్యోగులు పురపాలక సంఘం ఎదుట రిలే నిరాహారదీక్షలు చేశారు. సంయుక్త కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక చిన్న గాంధీబొమ్మ సెంటరులో ఏర్పాటు చేసిన రిలే నిరాహారదీక్ష శిబిరంలో ఉపాధ్యాయులు దీక్షలో కూర్చున్నారు. స్థానిక న్యాయస్థానాల ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన రిలే దీక్షల్లో ఉద్యోగులు వేణుగోపాలరావు, వెంకటేశ్వరరావు, రాంబాబు, మస్తాన్, బాబు కూర్చున్నారు. ఈ శిబిరాన్ని నూజివీడు బార్ అసోసియేషన్ కార్యదర్శి మురళీకృష్ణ ప్రారంభించారు. స్థానిక చిన్నగాంధీబొమ్మ సెంటరు వద్ద జెఎసీ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు జరిగాయి.
సమైక్యాంధ్రకు మద్దతుగా పుస్తకాలతో రోడ్లపై బైఠాయించిన విద్యార్థులు
మచిలీపట్నం , సెప్టెంబర్ 6: సమైక్యాంధ్రకు మద్దతుగా స్థానిక శివగంగ స్వాతీ హైస్కూల్ విద్యార్థులు చిన్నాపురం వెళ్ళే రహదారిపై పుస్తకాలతో బైఠాయించి శుక్రవారం నిరసన తెలిపారు. సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొని జై సమైక్యాంధ్ర, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ సమైక్యాంధ్ర సూపర్‌స్టార్, ఎబిసిడి-కెసిఆర్ కెడి, జై సమైక్యాంధ్రా విభజన వద్దువద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రోహిణి భవానీ, కరస్పాండెంట్ విఎన్ ప్రవీణ్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. హెచ్‌ఎం రవిబాబు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
మండల పరిషత్ స్కూల్‌లో వివాదాస్పదమైన ఆంధ్రప్రదేశ్ పటం
నందిగామ, సెప్టెంబర్ 6: ఒక పక్క సమైక్యాంధ్ర ఉద్యమం సీమాంధ్ర ప్రాంతంలో ఉద్ధృతంగా సాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర విభజన జరిగిపోయేనట్లుగా భావించి నందిగామలోని ఒక మండల పరిషత్ పాఠశాలలో వేసిన ఆంధ్రప్రదేశ్ పటం పెయింటింగ్ వివాదాస్పదమైంది. సేకరించిన సమాచారం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సమైక్యాంధ్ర మద్దతుగా ఉపాధ్యాయ జెఎసి, ఉద్యోగ సంఘాల జెఎసి ఇచ్చిన 48గంటల పాఠశాలల బంద్ పిలుపు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గానూ శుక్రవారం ఉద్యోగ, ఉపాధ్యాయ జెఎసి నేతలు నెహ్రూనగర్‌లోని మండల పరిషత్ పాఠశాలకు వెళ్లి అక్కడ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులతో తరగతులు నిలుపుదల చేసి బంద్‌కు సహకరించాలని, సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. అయితే పాఠశాల ఆవరణలో నూతనంగా వేసిన పెయింటింగ్‌లో ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌లో తెలంగాణాలోకి 10జిల్లాలకు గులాబి రంగు వేసి ప్రత్యేకంగా చూపుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా జిల్లాలుగా ముద్రించి ఉండటంతో జెఎసి నేతలు ఎవరు ఈ పెయింటింగ్ వేయించింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తోడు భారతదేశ మ్యాప్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను విభజన జరిగినట్లుగా గీత ఏర్పాటు చేసి ఉండటం జెఎసి నేతలకు మరింత ఆగ్రహం కల్గించింది. జెఎసి నేతలు అభ్యంతరకరంగా ఉన్న మ్యాప్‌ను చెరిపివేసేందుకు ప్రయత్నిస్తుండగా పాఠశాల ఉపాధ్యాయుడు జిలాని కల్పించుకొని హెచ్‌ఎం అమరనాయక్ 12 వేలు వెచ్చించి సొంత ఖర్చులతో పెయింటింగ్ వేయించారని, దాన్ని చెడగొట్టవద్దని, తర్వాత దాన్ని సరిచేయిస్తామని పేర్కొన్నారు. దీనిపై మాటామాటా పెరగడంతో సదరు ఉపాధ్యాయుడిపై సమైక్యాంధ్ర ఉద్యమకారుల్లో ఒకరిద్దరు చేయి చేసుకున్నారు. దీనిపై ఆ ఉపాధ్యాయుడు ఎంఇఒ కెజడ్‌ఎస్ కుమార్‌కు ఫిర్యాదు చేయగా రాష్ట్ర విభజన జరగకముందే నిబంధనలకు విరుద్దంగా తెలంగాణా జిల్లాలను వేరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ముద్రించిన హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలని, సదరు మ్యాప్‌ను చెరిపించాలని జెఎసి నేతలు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకొని స్కూల్ హెచ్‌ఎం అమరనాయక్ అక్కడకు చేరుకొని ఉపాధ్యాయుడిపై దాడి చేయడం ఏమిటంటూ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సిఐ భాస్కరరావు, నందిగామ, చందర్లపాడు ఎస్‌ఐలు రామకృష్ణ, చంద్రశేఖర్ సిబ్బందితో అక్కడకు చేరుకొని ఇటు జెఎసి నేతలతో, అటు పాఠశాల హెచ్‌ఎంతో మాట్లాడారు. ఇరువర్గాలు రాజీకి రావడంతో అభ్యంతరకరంగా ఉన్న మ్యాప్‌ను ఉపాధ్యాయులే చెరిపివేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది.
300 మందికి పైగా సేవ్ ఆంధ్రప్రదేశ్ మహాసభకు
కూచిపూడి, సెప్టెంబర్ 6: సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం హైదరాబాద్‌లో శనివారం జరగనున్న ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ మహాసభకు ఎపి ఎన్జీవోస్ మొవ్వ యూనిట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు మూడు బస్సుల్లో 200 మందికి పైగా శుక్రవారం రాత్రి తరలివెళ్ళారు. వీరితో పాటు ఘంటసాల, చల్లపల్లి మండలాలకు చెందిన 100 మందికి పైగా బస్సులు, కార్లు, రైళ్ళల్లో తరలివెళ్ళారు.
హైదరాబాద్ లాల్‌బహుదూర్ స్టేడియంలో జరిగే మహాసభకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా ఆమోదం తెలపటంతో దివిసీమ నుండి అత్యధిక సంఖ్యలో వివిధ శాఖల ఉద్యోగులు గుర్తింపు కార్డులతో సహా తరలివెళ్ళారు. గుర్తింపు కార్డులు లేనివారికి ఎండిఓ వై పిచ్చిరెడ్డి, తహశీల్దార్ భద్రు తాత్కాలిక గుర్తింపు కార్డులు అందించారు. స్థానిక జెఎసి నాయకులు వీడ్కోలు పలికారు.
గుడ్లవల్లేరులో కొనసాగుతున్న రిలే దీక్షలు
గుడివాడ, సెప్టెంబర్ 6: గుడ్లవల్లేరులో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం గాంధీ మండపంలో జరిగిన 5వ రోజు దీక్షలో ఎఎఎన్‌ఎం అండ్ వివిఆర్‌ఎస్‌ఆర్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు ఎవిఎన్‌ఎల్ సరోజిని, పి నాగజ్యోతి, టి శేషువాణి, కె కళ్యాణి, ఎస్ నీలిమ, కె పద్మజ, సిహెచ్ భవానీ, షర్మిళ, దీపిక, యామినిదుర్గ, సరస్వతి, స్వప్న, రేఖ తదితరులు కూర్చున్నారు. దీక్షలను మహిళా నేతలు వల్లూరుపల్లి జయలక్ష్మి, పి సత్యవతి, వి లక్ష్మీతులసీ, పొట్లూరి భానుమతి, ఎన్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కళాశాల కన్వీనర్ నారాయణం శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ సీమాంధ్రలోని ప్రభుత్వం, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల సిబ్బంది సమైక్యాంధ్ర కోసం చేస్తున్న నిరవధిక సమ్మెకు తమ కళాశాల మద్దతు ప్రకటించిందన్నారు. సీమాంధ్ర ఉద్యోగుల ప్రయోజనాలను తీవ్రంగా నష్టపర్చేలా జరిగిన రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు పాలిటెక్నిక్ ఐకాస ఉద్యమాన్ని బలపరుస్తామన్నారు. గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ అధ్యాపకులు చేస్తున్న రిలే దీక్షలు, నిరసన కార్యక్రమాలు సీమాంధ్ర పాలిటెక్నిక్ ఐకాసకు సంఘీభావంగా జరుగుతాయని శ్రీనివాసమూర్తి చెప్పారు.