మచిలీపట్నం , సెప్టెంబర్ 6: మండల పరిధిలోని సుల్తానగరంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన అగ్ని ప్రమాదంలో 14 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సేకరించిన వివరాల ప్రకారం సుల్తానగరం రైస్ మిల్లు సమీపంలో ఇతర జిల్లాల నుండి వ్యవసాయ కూలీ పనుల నిమిత్తం వచ్చిన హమాలీలు పూరి పాకలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ప్రమాదంలో ఐదు ఎకరాల గడ్డివామితో పాటు హమాలీలు కొక్కు నాగేశ్వరరావు, కోమరపు చల్లయ్య, ఎడ్ల వెంకట్రావు, దేవర ధనుంజయరావు, కర్ణం నీలం, భాస్కరరావు, మునంద, అప్పారావు, బూర ఆనందరావు, అప్పన్న, గోశాలరావు, పోలినాయుడు, రామారావుకు చెందిన పూరిపాకలు దగ్ధమయ్యాయి. బాధిత కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న బందరు అగ్నిమాపక అధికారి సూర్య ప్రకాశరావు సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్ళి మంటలను అదుపు చేశారు.
మొక్కలు నాటడం సామాజిక బాధ్యత
మచిలీపట్నం , సెప్టెంబర్ 6: మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా గుర్తించాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జె ప్రభాకరరావు అన్నారు. స్థానిక ఆర్మ్డ్ రిజర్వు మైదానంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సాధ్యమైనన్ని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలన్నారు. మనం నాటే మొక్కలు భావి తరాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్టేషన్లలో సిబ్బంది మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్‌పి డా. షెయుషీ బాజ్‌పాయ్, జిల్లా పోలీసు కార్యాలయం సూపరింటెండెంట్ రాజభాస్కర్, ఎఆర్ డిఎస్‌పి చంద్రశేఖర్, ఆర్‌ఐలు నాగిరెడ్డి, కృష్ణంరాజు, మైలవరం ఎస్‌ఐ సిహెచ్ నాగ ప్రసాద్, ఎస్‌బి సిఐలు మురళీధర్, ప్రసన్న వీరయ్య గౌడ్, పోలీసు వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు యండి మస్తాన్ ఖాన్, ఎన్‌ఎస్‌ఎస్ కుమార్, బెనర్జి బాబు పాల్గొన్నారు.
పండిత పామరులను అలరిస్తున్న తెలుగు పద్య నాటకం
మచిలీపట్నం , సెప్టెంబర్ 6: తెలుగు పద్య నాటకం పండిత పామరులను అలరిస్తుందని ఆంధ్ర సారస్వత సమితి అధ్యక్షులు కొట్టి రామారావు అన్నారు. స్థానిక బచ్చుపేట మహతి లలిత కళా వేదికపై రామకృష్ణ నాట్య మండలి, ఆంధ్ర సారస్వత సమితి సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు భాష-పద్య నాటకం అనే అంశంపై ప్రసంగం, పౌరాణిక పద్య నాటక అంశాలు చోటు చేసుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. ధన్వంతరి ఆచార్య మాట్లాడుతూ అవధాన ప్రక్రియ తెలుగు భాష సొత్తు అన్నారు. హావ, భావ, సంగీత సమ్మేళనంగా తెలుగు పద్య నాటకం బాసిల్లుతోందన్నారు. సిటీ కేబుల్ మేనేజరు బి పుల్లారావు మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకుంటూ కొత్త ఒరవడిలో తెలుగు పద్య నాటకాన్ని ప్రదర్శిస్తే నాటకం అజరామరమవుతుందన్నారు. జీవిత బీమా లలిత కళా సమితి అధ్యక్షులు విడియాల చక్రవర్తి మాట్లాడుతూ కాలానుగుణంగా మారితే నాటకం నవరస భరితంగా ఉండి జనాకర్షణగా నిలుస్తుందన్నారు. ఇంటాక్ పట్టణ శాఖ కన్వీనర్ తిక్కిశెట్టి రామ్మోహనరావు మాట్లాడుతూ యువ కళాకారులను ప్రోత్సహిస్తూ నాటక రంగ పటిష్ఠతకు కృషి చేయాలన్నారు. ప్రముఖ హరికథా గాయకులు కొత్తపల్లి వేణు మాధవ్ భాగవతార్, రంగస్థల నటుడు బొమ్మిడి బసవయ్యలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జాషువా రచించిన పద్యాలను ప్రముఖ సంస్కృత పండితులు కెవైఎల్ నరసింహం శ్రావ్యంగా ఆలపించారు. అనంతరం ప్రదర్శించిన కర్ణ సందేశం, హరేరామ.. హరేకృష్ణ.. పౌరాణిక పద్య నాటకాల్లోని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.