ఒంగోలు, సెప్టెంబర్ 6: ఎపి ఎన్‌జివోలు హైదరాబాదులో శనివారం చేపట్టిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు జిల్లానుండి భారీగా శుక్రవారం రాత్రి తరలివెళ్ళారు. జిల్లాలోని అన్నిప్రాంతాలనుండి అన్నితరగతులకు చెందిన ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతూ హైదరాబాదు బాట పట్టారు. తెలంగాణావాదులు ముందుగానే బంద్‌కు పిలుపునివ్వటంతో కొంతమంది ఉద్యోగులు హైదరాబాదుకు తరలివెళ్ళారు. తెలంగాణావాదులు రోడ్లను దిగ్భంధనం చేస్తే వెళ్ళటం కష్టమన్న ఉద్దేశ్యంతో వారంతా ముందుగానే వెళ్ళినట్లు సమాచారం. ప్రైవేటుబస్సులు, జీపులు, సుమోలు, రైళ్ళు, తదితర వాహనాల ద్వారా ఉద్యోగులు రాజధానికి పయనమయ్యారు. ఎట్టిపరిస్థితుల్లోను రాష్ట్రం సమైక్యాంగా ఉండాలని ఉద్యోగులు గత కొన్నిరోజులుగా జిల్లావ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. జిల్లా నుండి సుమారు ఐదువేలమందికి పైగానే హైదరాబాదుకు వెళ్ళినట్లు తెలుస్తొంది. ఇదిఇలాఉండగా జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. మానవహారాలు, ర్యాలీలు, రాస్తారాకోలాంటివి జిల్లాలో నిత్యం జరుగుతూనే ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలాఉండగా జిల్లాకాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన అమరణ నిరాహారదీక్షలు రెండవరోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకుకొండెపిశాసనసభ్యుడు జివి శేషు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా జివి శేషు మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించటంవలన సీమాంధ్రప్రజలు నష్టపోయే ప్రమాదం ఉందని అందువలన రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలని కోరారు. సమైక్యాంధ్రకోసం తాను ఇప్పటికే రాజీనామా చేశానని తెలిపారు. సమైక్యాంధ్రకోసం నిరవధిక నిరాహారదీక్షలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఇదిఇలాఉండగా జిల్లాకలెక్టరేట్ వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా చేస్తున్న ఉపాధ్యాయులు చేస్తున్న రిలేనిరాహార దీక్షలకు పలువురు ఎన్‌జివో నాయకులు మద్దతు తెలిపారు. అదేవిధంగా న్యాయవాదులు చేస్తున్న దీక్షలు కూడా కొనసాగుతున్నాయి.
కాగా సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో కవితాగోష్ఠి జరిగింది. కవులు సమైక్యాంధ్రకు మద్దతు పలికారు. కాగా ఒంగోలులోని ఎన్‌టిఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశంపార్టీ నేతలు సమైక్యాంధ్రకు మద్దతుగా చేపట్టిన రిలేనిరాహరదీక్షలు కొనసాగుతున్నాయి. కాగా సమైక్యాంధ్ర ఉద్యమంతో అన్నిరకాల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మొత్తంమీద జిల్లావ్యాప్తంగా చేపట్టిన సమైక్యాంధ్ర ఉద్యమాలకు అనూహ్యస్పందన లభిస్తుంది.
జిల్లాలో కొనసాగుతున్న ఉద్యమాలు * సమైక్యాంధ్రకు మద్దతుగా కవుల కవితాగోష్ఠి
english title:
employees
Date:
Saturday, September 7, 2013