చీరాల, సెప్టెంబర్ 6: కేంద్రమంత్రి, సినీనటుడు చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ నటించిన తుఫాన్ సినిమాకు చీరాలలో సమైక్య సెగ తగలింది. శుక్రవారం సమైక్యాంధ్ర జెఎసి ఆధ్వర్యంలో తుపాన్ సినిమా బ్యానర్లతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తుపాన్ ప్రదర్శిస్తున్న సినిమా థియేటర్ వద్దకు వెళ్లి పోస్టర్లను దగ్ధం చేశారు. థియేటర్‌లోకి చొచ్చుకెళ్ళేందుకు ప్రయత్నించగా వన్‌టౌన్ సిఐ బీమానాయక్ సమైక్యవాదులను అడ్డుకోవటంతో కొంతసేపు ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని థియేటర్ యాజమాన్యానికి సూచించారు. జెఎసి నాయకులు గుంటూరు మాధవరావు, శేషసాయి, కర్నేటి రవి తదితరులు మాట్లాడుతూ గత 38రోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమంలో కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు పాల్గొని ఉద్యమాలు ఉవ్వెత్తున చేస్తుంటే సీమాంధ్ర కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేయకుండా ఢిల్లీలో ఎసి రూముల్లో కూర్చొని కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. చిరంజీవి కుటుంబసభ్యులు పవన్‌కల్యాణ్, రాంచరణ్, అల్లుఅర్జున్ తను నటించిన సినిమాలను విడుదల చేసుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చిరంజీవి తన పదవికి రాజీనామా చేయకుంటే పవన్ కల్యాణ్ కొత్త చిత్రం అత్తారింటికి దారేది, అల్లు అర్జున్ నటించిన కొత్త సినిమాను సీమాంధ్రలో ప్రదర్శించకుండా అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
సమైక్యాంధ్ర కోసం గర్జించిన దర్శి
దర్శి, సెప్టెంబర్ 6 : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ దర్శి జె ఏసి ఆధ్వర్యంలో చేపట్టిన సమైక్యాంధ్ర గర్జనకు మంచి స్పందన లభించింది. ఉదయం 9 గంటల నుండి ప్రధాన రోడ్లన్నీ విద్యార్థులు దిగ్భంధించారు. పట్టణంలోని అన్నీ వ్యాపార వర్గాలు స్వచ్చంధంగా బంద్ పాటించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా దర్శి పట్టణంలో ఈ బంద్ జరిగింది. సుమారు పది వేల మంది విద్యార్థులు రోడ్ల పై బైఠాయించి సమైక్య నినాదాన్ని మారు మ్రోగించారు. వివిధ కుల సంఘాలు సమైక్యాంధ్రాకు మద్దతుగా ప్రదర్శన నిర్వహించారు. నారుూ బ్రాహ్మాణ సంఘం ఆధ్వర్యంలో గంట పాటు నాదస్వర కచ్చేరి ఏర్పాటు చేశారు. టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గడియార స్థంభం సెంటర్‌లో ఏర్పాటు చేసిన వేదిక పై కుట్టు మిషన్లు ఏర్పాటు చేసి బట్టలు కుట్టారు. వివిధ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులు తమ ఆటా, పాటలతో అలరించారు. జె ఏసి చైర్మన్ రాజకేశవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేయడం ఆంధ్ర రాష్ట్రం ముక్తకంఠంతో వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. గత 38 రోజుల నుండి సీమాంధ్రలోని 13 జిల్లాల్లో లక్షలాది మంది ప్రజలు రోడ్ల పైకి వచ్చి తెలంగాణా ప్రకటనను వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇంతటి తీవ్ర పరిణామాలు రాష్ట్రంలో జరుగుతున్న యుపి ఏ ప్రభుత్వం స్పందించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. 7న జరిగే సమైక్య సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభను అందరూ జయప్రదం చేయాలని ఎన్జీవో సంఘం నాయకుడు గొల్లపూడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. హాస్టల్ వార్డెన్ అరగుండు కొట్టించుకొని తెలంగాణా ప్రకటన పట్ల నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులు చేతులెత్తి సమైక్యాంధ్ర వర్థిల్లాలని భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఎటు చూసినా సమైక్యాంధ్ర నినాదాలతో దర్శి పట్టణం మారుమ్రోగింది. వస్త్ర వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో 150 అడుగుల జాతీయ జెండా తయారు చేసి ప్రదర్శించారు. ఈ గర్జనలో పట్టణంలోని ఎన్జీవో సంఘం , ఉపాధ్యాయ సంఘం , అన్నీ వ్యాపార సంఘాలు, టైలర్స్ అసోసియేషన్, గూడ్స్ మర్చంట్ అసోసియేషన్, సప్లయర్స్ అసోసియేషన్, ఎలక్ట్రికల్ అసోసియేషన్ లతో పాటు అన్నీ రంగాలు మద్దతు పలికారు.