అద్దంకి, సెప్టెంబర్ 6: కేంద్ర-రాష్ట్ర మంత్రులందరికి తెలంగాణా ప్రకటన చేస్తున్నారని తెలిసీ కూడా సీమాంధ్ర ప్రజలను మోసం చేశారని రాష్ట్ర తెలుగురైతు అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి ధ్వజమెత్తారు. గత మూడు రోజులుగా సమైక్యాంధ్ర కోసం ఆమరణదీక్ష చేస్తున్న తనయుడు వెంకటేష్‌ను శుక్రవారం బలరాం పరామర్శించారు. జిల్లాలోని పలు ప్రాంతాలనుండి వేలాదిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు ఉద్యోగుల జెఎసి నాయకులు వెంకటేష్‌ను పరామర్శించి అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా బలరాం మాట్లాడుతూ ఏలూరు ఎంపి కావూరి సాంబశివరావుకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చినప్పుడే తెలంగాణా ప్రక్రియ మొదలెట్టాలన్నారు. కేంద్ర-రాష్ట్ర మంత్రులందరికి ముందస్తుగా తెలంగాణా ప్రకటన చేస్తున్నారని తెలిసీ కూడా సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టారన్నారు. అధికారం కోసం నమ్ముకున్న ప్రజలను మోసం చేశారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఎమ్మెల్యేలను ఢిల్లీ పంపి తెలంగాణాకు అనుకూలంగా సంతకాలు పెట్టించినప్పుడే తెలంగాణాకు అనుకూలమని చెప్పినట్లయిందని, నేడు పిల్లకాంగ్రెస్ నాయకులు మాత్రం సీమాంధ్ర ప్రజల్లోకి వచ్చి సమైక్యవాదులమంటూ బూటకపు మాటలు చెబుతున్నారన్నారు. తెలంగాణా ఇస్తే నీటియుద్ధాలు జరుగుతాయన్నారు. నీటి సమస్య, హైదరాబాద్, ఆదాయం, రాజధాని తదితర సమస్యలు పరిష్కరించుకుండా ఏకపక్షంగా సోనియా నిర్ణయం తీసుకుంటే దానికి గంగిరెద్దుల్లా సీమాంధ్ర మంత్రులంతా తలలూపి ఇక్కడికొచ్చి సమైక్యాంధ్రకు పాటుపడుతున్నామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని దుయ్యబట్టారు. కొద్దినెలలుండే అధికారంకోసం సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. కరణం వెంకటేష్ చేస్తున్న ఆమరణ దీక్షకు జిల్లాలోని పలు ప్రాంతాలనుండి వేలాదిగా సమైక్యవాదులు తరలివచ్చి మద్దతు ప్రకటించడం హర్షణీయమన్నారు.
పొదిలిలో వాహనాల ప్రదర్శన
పొదిలి, సెప్టెంబర్ 6 : పొదిలి పట్టణంలో శుక్రవారం వాహనాలతో సమైక్యాంధ్రాను కోరుతూ భారీ ప్రదర్శన నిర్వహించారు. కార్ల స్టాండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రదర్శన విశ్వనాధ పురం నుండి ప్రారంభమై పట్టణ పుర వీధుల గుండా చిన బస్టాండ్ వరకు సాగింది. బాణ సంచా పేల్చుతూ తప్పెట్లు, తాళాలతో సాగిన ర్యాలీ అందరిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కెసి ఆర్ , సోనియా దిష్టి బొమ్మలను పాత బస్టాండ్ సెంటర్ లో దగ్థం చేసి ఆందోళన కారులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ నాయకులతో పాటు వైయస్ ఆర్ సిపి, టిడిపి, కాంగ్రెస్ నాయకులు, ఆర్టీసీ, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సమైక్యాంధ్ర నినాదాలతో మారుమోగిన ముండ్లమూరు
ముండ్లమూరు, సెప్టెంబర్ 6 : మండల కేంద్రమైన ముండ్లమూరులో సమైక్యంతో మారుమ్రోగింది. ఉపాధ్యాయ జె ఏసి ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీగా బస్టాండ్ సెంటర్‌కు చేరుకొని మానవహారం నిర్వహించారు. సమైక్యాంధ్రాకు మద్దతుగా కబాడ్డీ ఆడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముండ్లమూరు జె ఏసి అధ్యక్షులు మస్తాన్‌వలి మాట్లాడుతూ సమైక్యాంధ్రా కోసం శక్తి వంచన లేకుండా పోరాడాలని పిలుపునిచ్చారు. రాజకీయ నాయకులు రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలన్నారు. భవిష్యత్తులో వచ్చే విపత్తులను దైర్ఘ్యం ఎదుర్కోవాలన్నారు. హైదరాబాద్‌లో ఉండే సీమాంధ్రులను వెళ్ళి పోమ్మంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ సమైక్య రాష్ట్రం కోసం పోరాడాలన్నారు. స్వార్థ రాజకీయ నాయకుల కారణంగా స్కూల్ విద్యార్థులు రోడ్ల పైకి రావాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సమైక్యాంధ్రా కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో కనకం వెంకట్రావు, కోశాధికారి వినాయక్, ఈదర హెచ్‌యం సుబ్బయ్య, మారెళ్ళ హెచ్‌యం శివరాం ప్రసాద్, యు.యం పురం హెచ్‌యం వెంకటేశ్వర్లు, వి జనార్థన్‌రెడ్డి, రఘు రామయ్య, సుమతి, రజని, నిర్మల , సుజాత తదితరులు పాల్గొని ప్రసంగించారు.
ఎడ్లబండ్లతో రైతుల ప్రదర్శన
అద్దంకి, సెప్టెంబర్ 6: సమైక్యాంధ్రకు మద్దతుగా శుక్రవారం మండలంలోని రైతాంగం ఎడ్లబండ్లతో, ట్రాక్టర్లతో అద్దంకి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. రామ్‌నగర్ నుండి భవాని సెంటరు, గాంధీబొమ్మ సెంటరు మీదగా బస్టాండ్ వద్దకు చేరుకొని ఎడ్లబండ్లతో మానవహారం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు చేస్తే రైతాంగం పరిస్థితేమిటని కాంగ్రెస్‌పార్టీని ప్రశ్నించారు. సీమాంధ్ర రైతాంగంమంతా తెలంగాణాలో కూలీలుగా మారాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాంల్లోని తెలంగాణా వాదులు క్రింద ఉన్న సీమాంధ్రులకు పంపిస్తారన్న నమ్మకమేమిటని ప్రశ్నించారు. నీటి సమస్య, విద్యుత్, ఆదాయ వనరులు, రాజధాని సమస్యలు ముందస్తుగా అసెంబ్లీలో చర్చించకుండా, సీమాంధ్రుల మనోభావాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని సమైక్యాంధ్ర కొనసాగించే ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రెండవ రోజుకు చేరిన ఉపాధ్యాయ రిలే దీక్షలు
మార్టూరు, సెప్టెంబర్ 6: సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా మండల ఉపాధ్యాయ సంఘం జెఎసి ఆధ్వర్యంలో సమ్మె చేపట్టిన ఉపాధ్యాయులు శుక్రవారం రెండవ రోజుకు చేరుకున్నాయి. బుధవారం నుంచి పాఠశాలల విధులు బహిష్కరించారు. సాయి శిల్ప స్కూల్ వద్ద చేపట్టిన దీక్షలో పలువురు ప్రసంగించారు. సీమాంధ్ర ప్రజలు తీరని ఇబ్బందులు పడతారని అన్నారు. దీక్షలో పి వెంకటరావు, ఎన్ వెంకటరావు, ఎన్ నాగేశ్వరరావు, బి వి నాయక్, కెసిహెచ్ సుబ్బారావు, ఎస్‌కె కాలేషాలు పాల్గొన్నారు. వీరికి పలువురు సంఘీభావం తెలిపారు.