మార్కాపురం , సెప్టెంబర్ 6: సమైక్యత కోసం సీమాంధ్రులు పూరించిన విప్లవశంఖంతో ఢిల్లీకోట నెర్రలుబారిందని, ఉద్యమాలతో ఖంగుతిన్న అధిష్ఠానం ప్రతిప్రకటన చేసేందుకు పిల్లిమొగ్గలు వేస్తుందని ఉద్యోగ సంఘాల జెఎసి నాయకులు బివి శ్రీనివాసశాస్ర్తీ అన్నారు. జర్నలిస్టుల ఫోరం, ఉద్యోగుల జెఎసి ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో జరిగిన సమైక్యాంధ్ర మద్దతుర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్న సభను అడ్డుకుంటామని తెలంగాణవాదులు చేస్తున్న ప్రకటన నీటి బుడగలాంటిదని అన్నారు. హైదరాబాద్ నగరంలో సగానికిపైగా ఉద్యోగులు సమైక్యాంధ్రను కోరి సభకు హాజరవుతారని, తెలంగాణలోని జనం, సమైక్యాంధ్రను కోరుతూ సభకు హాజరైతే ఎక్కడ విభజన వాదన వీగిపోతుందోనని టిఆర్‌ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. జర్నలిస్టు ఫోరం నాయకులు ఎన్‌వి రమణ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలు ఈనెల 7న హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మహాసభను విజయవంతంగా నిర్వహించాలని కోరుతూ ఫోరం తరుపున సంఘీభావం తెలిపారు. కొత్తకొత్త నిబంధనలను తెరపైకి తెచ్చి 6వతేదీ అర్ధరాత్రి నుంచే బస్సులను నిలిపి సీమాంధ్రుల సభను విఫలం చేసేందుకు విభజనవాదుల నేతృత్వంలో కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ఎన్ని కుట్రలు జరిగిన సీమాంధ్రలో సమైక్యసభను నిర్వహించి సమైక్యతవాదాన్ని వినిపించాలని అన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ జెఎసి నాయకులు యోగేంద్రనాథ్, ఉద్యోగ సంఘనాయకులు అబ్దుల్‌ఖాదర్, రవిచంద్ర తదితర నాయకులు పాల్గొని మాట్లాడారు. ప్రింట్‌మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పాల్గొన్నారు. ఈసందర్భంగా పెద్దదోర్నాల బస్టాండ్ సెంటర్‌లో మానవహారం ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు.
* ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో..
రాష్ట్ర విభజనకు నిరసనగా ఉపాధ్యాయ, ప్రధానోపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం పట్టణంలో భారీర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఉపాధ్యాయ బృందం చిడతలు, చెక్క్భజనలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రీడింగ్‌రూం సెంటర్‌లో మానవహారం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
టిడిపి ఆధ్వర్యంలో ర్యాలీ
యర్రగొండపాలెం : సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా యర్రగొండపాలెంలో శుక్రవారం టిడిపి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈర్యాలీ స్థానిక టిడిపి కార్యాలయం నుంచి ప్రారంభమై పుల్లలచెరువుసెంటర్, ప్రధానరహదారుల, కాలేజీ గుండా వైఎస్‌ఆర్ సెంటర్‌కు చేరింది. ఈర్యాలీలో గిరిజనచెంచులు తమ సాంప్రదాయమైన దుస్తులతో బాణాలు పట్టుకొని సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. డప్పు వాయిద్యాలతో ఉద్యమానికి మద్దతుపలికారు. ఈకార్యక్రమంలో టిడిపి నాయకులతోపాటు మండల కన్వీనర్ చేకూరి ఆంజనేయులు పాల్గొన్నారు. వైపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి బూదాల అజితరావు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమెవెంట వైపాలెం గ్రామసర్పంచ్ సొరకాయల మంగమ్మతోపాటు మహిళనాయకురాళ్ళు హాజరయ్యారు. వైఎస్‌ఆర్ సెంటర్‌లోని పొట్టిశ్రీరాములు, గాంధీ విగ్రహాలకు అజితరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్‌పార్టీ కుట్రలోభాగంగా తెలంగాణ విభజనకు పూనుకుందని, విభజన వలన సీమాంధ్రకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ భారతదేశంలో ఐటిరంగంలో ముందంజలో ఉందని, అలాంటి పట్టణాన్ని నిర్మించాలంటే 50ఏళ్లు పడుతుందని అన్నారు. అందుకే హైదరాబాద్‌ను యుటిగా ప్రకటించాలని, రెండు రాష్ట్రాలకు వేరువేరు రాజధానులు ఉంటే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం టిడిపి ఆధ్వర్యంలో రోడ్డుపైనే వంట వార్పు నిర్వహించి భోజనాలు చేశారు. ఈకార్యక్రమంలో జిల్లాటిడిపి కౌన్సిల్ సభ్యులు షేక్ జిలానీ, సీనియర్ టిడిపి నాయకులు కామేపల్లి వెంకటేశ్వర్లు, అడుసుమల్లి రామచంద్రయ్య, గోళ్ళ సుబ్బారావు, కొత్తమాసు సుబ్రహ్మణ్యం, తోట మహేష్, మాజీసర్పంచ్ కంచర్ల సత్యనారాయణగౌడ్, ఇతర టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కంఠసర్పి లక్షణాలతో బాలుడు మృతి
కందుకూరు, సెప్టెంబర్ 6: మండల పరిధిలోని పలుకూరు గ్రామానికి చెందిన వేల్పుల గోపి (6)అనే బాలుడు కంఠసర్పి లక్షణాలతో బాధపడుతూ ఒంగోలు వైద్యశాలలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. బాలుడి బందువులు తెలిపిన వివరాల ప్రకారం పొన్నలూరు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన వేల్పుల గోపి తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లి పలుకూరు గ్రామంలోని బాలుడి అమ్మమ్మ ఇంటిదగ్గర వదిలి వెళ్లారు. ఈనెల 3న బాలుడికి కంఠసర్పి లక్షణాలతో అస్వస్థత ఏర్పడగా ఒంగోలుకు చికిత్స నిమిత్తం తరలించారు. అయితే వ్యాధి ముదరడంతో గుంటూరు తరలించి చికిత్స చేయించారు. అయితే చికిత్స పొందుతూ గురువారం బాలుడు మృతి చెందాడు.
ట్రాక్టర్ బోల్తాపడి యువకుడు మృతి
సిఎస్‌పురం, సెప్టెంబర్ 6: ఇసుక ట్రాక్టర్ బోల్తాపడి యువకుడు దుర్మరణం పాలైన సంఘటన తుంగూడు సమీపంలో గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగింది. కొమరోలు మండలం శింగరపల్లి గ్రామానికి చెందిన నారు బ్రహ్మయ్య అనే వ్యక్తి తన ట్రాక్టర్‌తో సిఎస్‌పురం నుండి శింగరపల్లికి ఇసుక తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలోని తుంగూడు సమీపంలోని ఘాట్‌రోడ్డులో గురువారం అర్థరాత్రి 12గంటలు దాటిన తర్వాత ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న శింగరపల్లి గ్రామానికి చెందిన తుమ్మేటి నరేష్ (20) మృతి చెందాడు. మర్రి రవికుమార్, ఆర్ వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలయ్యాయి. రవికుమార్‌ను మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లగా, వెంకటేశ్వర్లును ఒంగోలు ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అలాగే మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడు నరేష్ కంభంలోని ఓ డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎస్సై ఎస్‌కె లాల్‌అహ్మద్ కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.