గుంటూరు (కొత్తపేట), సెప్టెంబర్ 7: రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం తీసుకున్న విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న నిరసన కార్యక్రమాలు రోజురోజుకూ ఉద్ధృతరూపం దాల్చుతున్నాయి. విభజన నిరసిస్తూ చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా భాగస్వాములవుతూ ఉద్యమాన్ని వేడెక్కిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే సమ్మెలోకి వెళ్లగా రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు రాజకీయాలకు అతీతంగా చేస్తున్న దీక్షలు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, విద్యార్థి సంఘాలు ఇలా ఎవరికి వారు జెఎసిలుగా ఏర్పడి సమైక్య నినాదాన్ని బలపర్చుతున్నారు. సమైక్యాంధ్ర సాధన దిశగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శనివారానికి 25వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో టి మోహనరావు, డేవిడ్‌రాజు, రాయపాటి రాజ్‌కిషోర్ పాల్గొనగా రాష్ట్ర సంఘ ఉద్యోగుల కన్వీనర్ వి వెంకటరమణ ప్రారంభించారు. ఈ దీక్షకు సంఘ నాయకులు కె ఝాన్సీలక్ష్మి, కె శ్రీనివాసరావు, వై బ్రహ్మయ్య, నాగిరెడ్డి, సిహెచ్ శ్రీనివాసరావు, ఎవి రమణ, కె వెంకటేశ్వర్లు, గురవయ్య, నాగరాజు, శివకుమార్, వి రాజేశ్వరి తదితరులు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ హైదరాబాద్‌లో శాంతియుతంగా సభకు వెళ్తున్న ఎన్జీవోలపై రాళ్లు, చెప్పులు విసరడం ఆటవిక చర్య అని, సభ్య సమాజానికి తలవంపులని ఖండించారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా సమైక్యాంధ్ర సాధించే వరకూ విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. అలాగే సాంబశిపేటలో ఇంటర్ విద్య ఐకాస ఆధ్వర్యంలో
అధ్యాపకులు చేస్తున్న రిలే దీక్షలు రెండవ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వ బాలికల కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో దీక్షకు సంఘీభావం తెలియజేశారు. సమైక్యాంధ్ర కాంక్షిస్తూ న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది రిలే నిరాహారదీక్షను కొనసాగించి, హైదరాబాద్‌లో సీమాంధ్ర న్యాయవాదులపై దాడికి నిరసనగా వేర్పాటు వాద దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గుంటూరు బార్ అసోసియేషన్ హాలులో 13 జిల్లాలో సీమాంధ్ర న్యాయవాది గుమస్తాల సదస్సు కూడా జరిగింది.
ఎపి ఎన్జీవోలపై దాడిపై వై జెఎసి నిరసన...
సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో హైదరాబాద్‌లో సభను తలపెట్టిన ఎపి ఎన్జీవోలపై నిజాం కళాశాల విద్యార్థులు రాళ్లతో దాడి చేసి, బస్సుల అద్దాలు ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడడం హేయమైన చర్య అని యువజన ఐక్య కార్యాచరణ కమిటీ అధ్యక్షుడు రాయపూడి శ్రీనివాస్ ఖండించారు. తెలంగాణ విద్యార్థులు, కెసిఆర్, హరీష్‌రావు, కోదండరామ్‌లకు వ్యతిరేకంగా ఎన్జీవోలకు మద్దతుగా సమైక్యాంధ్ర వై జెఎసి ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎసి కళాశాల సెంటర్‌లో విద్యార్థులు, యువకులు, జెఎసి నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలికల కళాశాల విద్యార్థినులు, వై జెఎసి నాయకులు, కార్యకర్తలు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.