రాజమండ్రి, సెప్టెంబరు 7: రాష్ట్ర విభజన వ్యవసాయ రంగానికి పెను ప్రమాదాన్ని కలిగిస్తుందని మాజీ మంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. శనివారం రాజమండ్రిలో విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ విభజన వల్ల అన్ని వర్గాల కన్నా ఎక్కువ నష్టపోయేది సీమాంధ్ర జిల్లాల్లోని రైతులేనన్నారు. అయితే తాను నమ్ముకున్న భూమిలో రోజంతా కష్టపడటం తప్ప, ఇతర విషయాల పట్ల పెద్దగా అవగాహన ఉండని రైతులకు, విభజన వల్ల కలిగే నష్టం తీవ్రత తెలియటం లేదన్నారు. రైతుల్లో అవగాహన కలిగించటం ద్వారా సమైక్యాంధ్ర ఉద్యమంలో రైతులు అగ్రభాగాన నిలబడేలా కృషిచేస్తామని, రైతులతో భారీ సభను నిర్వహించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని వడ్డే చెప్పారు. గోదావరి నీళ్లను ఆంధ్ర ప్రజలు దోచుకుంటున్నారని తెలంగాణ వాదులు కొంత మంది చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదన్నారు. గోదావరికి ఎగువన తెలంగాణ ప్రాంతం ఉంటే, నదికి చివరిన ఉన్న ఆంధ్ర ప్రాంతం ఎలా దోచుకుంటుందని ప్రశ్నించారు. అయినా సరే ఎగువ తెలంగాణ ప్రాంతాల్లో ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా ఆంధ్ర ప్రజలు ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని, కానీ సముద్రంలో వృథాగా కలిసే నీళ్లను వినియోగించుకోవాలన్న ఉద్దేశ్యంతో నిర్మించనున్న పోలవరం ప్రాజెక్టుకు మాత్రం అడ్డుతగులుతున్నారన్నారు. పైగా ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు కూడా తెలంగాణవాదులే సమాచారం అందించి, పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నపుడే ఆంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే, రాష్ట్ర విభజన జరిగిన తరువాత జరిగే అన్యాయాన్ని ఆపగలమా? అని వడ్డే ప్రశ్నించారు. సమైక్యాంధ్ర కోసం 37రోజులుగా అన్ని వర్గాల ప్రజలు రాజీలేని పోరాటం చేస్తుంటే, ఇప్పటికీ సిడబ్ల్యుసిగానీ, కేంద్ర ప్రభుత్వం గానీ కనీసం ఆలోచించే పరిస్థితుల్లో కనిపించటం లేదన్నారు. ఇది తెలుగుజాతిని అవమానించటమేనన్నారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ప్రజలు ఘోరంగా నష్టపోయే పరిస్థితి ఉన్నప్పటికీ, ఏ మాత్రం పట్టించుకోకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ చిత్రపటాన్ని టేబుల్ వేసుకుని, తేలికగా కత్తిరించినట్టు, రాష్ట్రాన్ని విభజించాలనుకోవటం దారుణమన్నారు. రాష్ట్రంలోని 8.5కోట్ల ప్రజల భవిష్యత్తును ఈ నిర్ణయం ప్రశ్నార్ధకంగా మారుస్తోందన్నారు. ఒక వ్యక్తిని ప్రధానమంత్రిని చేసేందుకు, రాజకీయ లబ్ధికోసం రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని సిడబ్ల్యుసిలో నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ప్రకటించిన వెంటనే, కాంగ్రెస్‌లో తెరాస విలీనమవుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయలబ్ధినే చూసుకుందన్నారు. మంత్రి పదవి రాలేదని కెసిఆర్ తెలంగాణ ఉద్యమం చేపడితే, తెలంగాణ ప్రాంత తెలుగుదేశం నాయకుల ఒత్తిడితో ఆ పార్టీ రాష్ట్ర విభజనకు అనుకూలంగా ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చిందన్నారు. ఇలాంటి పరిణామాల వల్లే రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం దెబ్బతిందన్నారు.
శ్రీకృష్ణ కమిటీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై అద్భుతమైన నివేదికను కేంద్రానికి సమర్పించిందని, అన్ని కోణాల్లోను అధ్యయనం చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికను చదివిన తరువాతయినా సరే రాజకీయ పార్టీలు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలను చూసిన తరువాతయినా సరే కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని వడ్డే డిమాండ్ చేసారు.
13, 14 తేదీల్లో జిల్లాలో షర్మిల బస్సు యాత్ర
కాకినాడ, సెప్టెంబరు 7: ఈ నెల 13, 14 తేదీల్లో వైఎస్‌ఆర్ సిపి నాయకురాలు షర్మిల బస్సు యాత్ర జిల్లాకు వస్తుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి చెప్పారు. ఈ యాత్రకు సంబంధించిన వివరాలను శనివారం విలేఖర్లకు వెల్లడించారు. ఈ నెల 13న సమైక్య శంఖారావం పేరుతో షర్మిల బస్సుయాత్ర ఉదయం 11 గంటలకు రావులపాలెం చేరుతుందని అక్కడ కొంత సేపు ప్రసంగించి సాయంత్రం అమలాపురంలో బహిరంగ సభ జరుగుతుందని చెప్పారు. రాత్రికి అమలాపురంలో షర్మిల బస చేస్తుందని తెలిపారు. 14వ తేదీ ఉదయం 11గంటలకు కాకినాడ చేరుకుని స్థానిక మసీదు సెంటరులో షర్మిల ధర్నా నిర్వహిస్తారని కుడుపూడి తెలిపారు. ఆ తరువాత పిఠాపురం, గొల్లప్రోలు, కత్తిపూడి, తుని మీదుగా విశాఖకు చేరుకుంటుందని చెప్పారు. ఈ యాత్ర విజయవంతం చేసేందుకు 10వ తేదీన అమలాపురంలో సన్నాహక సమావేశం జరుగుతుందని తెలిపారు. అంతకు ముందు షర్మిల యాత్ర విజయవంతం చేసేందుకు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్ సిపి కేంద్ర నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్, జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కర రామారావు, ఆదిరెడ్డి అప్పారావు, నాయకులు ఎబిజెవి బుచ్చి మహేశ్వరరావు, కొల్లి నిర్మలకుమారి, రొంగలి లక్ష్మి, రెడ్డి రాధాకృష్ణ, చిర్ల జగ్గిరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, సిహెచ్ శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, గుత్తుల రమణ, ఫ్రూటీకుమార్, కర్రి పాపారాయుడు, పంపన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సమైక్య పోరులో మేము సైతం
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, సెప్టెంబరు 7: సమైక్యాంధ్ర ఉద్యమంలో మేము సైతం అంటూ అత్యవసర సర్వీసులకు చెందిన ఉద్యోగులు, అధికారులు నిరవధిక సమ్మెకు దిగేందుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటి వరకు ఎన్‌జిఓలు, మున్సిపల్ ఉద్యోగులు, న్యాయశాఖ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మాత్రమే నిరవధిక సమ్మె చేస్తున్న సంగతి విదితమే. విద్యార్ధులు, న్యాయవాదులు, వర్తకులు, రాజకీయపార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు గత 38రోజులుగా సమైక్య ఉద్యమం సాగిస్తూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఏ మాత్రం పునరాలోచించుకోకపోగా, సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టే విధంగా పదే పదే రాష్ట్ర విభజనకు సంబంధించిన ప్రకటనలను చేయటంతో వివిధ శాఖల్లోని అత్యవసర సర్వీసులకు చెందిన అధికారులు, ఉద్యోగులు సమైక్య పోరాటానికి సన్నద్ధమవుతున్నారు. మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్‌శాఖల్లోని మినిస్టీరియల్ సిబ్బంది, అధికారులు మాత్రమే ప్రస్తుతం సమ్మెలో కొనసాగుతుండగా, ఇక నుండి తాగునీటి సరఫరా, పారిశుధ్య విభాగాలకు చెందిన సిబ్బంది సమ్మెబాట పట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న నాన్‌టెక్నికల్ సిబ్బంది నుండి డిప్యుటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వరకు నిరవధి సమ్మెలో కొనసాగుతున్నారు. అయితే నీటి సరఫరాలో కీలకమైన సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. రానున్న రోజుల్లో వీరు కూడా సమ్మె బాట పట్టాలని భావిస్తున్నారు. మరోపక్క ఈనెల 9న అర్ధరాత్రి నుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు కూడా సమ్మెలోకి వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. పట్టణాలు, నగరాల్లో ప్రజారోగ్యాన్ని కాపాడటంలో కీలక బాధ్యతలు నిర్వహించే పారిశుధ్య సిబ్బంది, అధికారులు ఈనెల 10నుండి నిరవధిక సమ్మె చేయాలని భావిస్తున్నారు. ఈనెల 3,4 తేదీల్లో రెండు రోజుల పాటు సామూహిక సెలవులు పెడితేనే నగరాలు, పట్టణాలు అపారిశుధ్యంతో అల్లాడిపోయాయి. అలాంటిది పారిశుధ్య కార్మికులు, సిబ్బంది సమ్మె బాట పడితే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికాక తప్పదు. విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు, ఇంజనీర్లు ఈనెల 12 నుండి నిరవధిక సమ్మెకు దిగాలని నిర్ణయించారు. అదే జరిగితే సీమాంధ్ర జిల్లాలు అంధకారంలోకి వెళతాయి. తాగునీటి సరఫరా నిలిచిపోవటంతో పాటు, జన జీవనం అతలాకుతలమవుతుంది. ఇరిగేషన్ ఇంజనీర్లు కూడా సమైక్య ఆందోళనలు చేపట్టాలని భావిస్తున్నారు. అయితే ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఖరీఫ్ పంట ప్రస్తుతం కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో నిరవధిక సమ్మెకు దిగటం ఎంత వరకు సమంజసమోనన్న సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తోంది.
కొనసాగుతున్న సమైక్య దీక్షలు
కాకినాడ: సమైక్య ఆంధ్ర పరిరక్షణ సమితి, ఉద్యోగ జెఎసి ఆధ్వర్యంలో సమైక్య ఆందోళనలు కాకినాడ నగరంలో కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ సమైక్యవాదులు చేస్తున్న సమ్మెకు సానుకూల స్పందన వస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఈ సమ్మె 39వ రోజుకు చేరింది. శనివారం కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమాలు అదే హోరుతో కొనసాగాయి. మత్యశాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట దీక్షలు నిర్వహించారు. ఈ దీక్షలకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ నాయకుడు వనమాడి కొండబాబు హజరై సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయ జెఎసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. వైద్యులు, వైద్య ఉద్యోగుల ఆధ్వర్యంలో ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి వద్ద వైద్యులు, సిబ్బంది గంట పాటు నిరసన కార్యక్రమాన్ని చేపట్టి సమైక్యాంధ్ర కోరుతూ నినాదాలు చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం కావడం పట్ల జెఎన్‌టియుకె హర్షం ప్రకటించింది. భానుగుడి సెంటర్‌లో రామ్‌గోపాల్ షిప్పింగ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించి పేదలకు అన్నదానం చేశారు. విద్యా, పశుసంవర్ధక, వైద్యారోగ్య, ఇందిరాక్రాంతి పథకం, జిల్లా పరిషత్, దేవాదాయ, ఎస్సీ, బిసి కార్పొరేషన్, న్యాయవాదుల సంఘం, న్యాయవాదుల గుమస్తాల సంఘం, న్యాయశాఖ ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో యధావిధిగా నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి.
బొప్పాయి గణపతి2
ఆలమూరు, సెప్టెంబరు 7: ఆలమూరు మండలం మడికి దేవునిమాన్యం సమీపంలో గల కొత్తపల్లి వెంకట్రావు రైతు బొప్పాయి తోటలో వినాయకుని రూపంలో గల రెండు బొప్పాయి కాయలు దర్శనమిచ్చాయి. శనివారం బొప్పాయి కాయలను వెంకట్రావు కొస్తుండగా పక్కపక్కనే గల రెండు చెట్లకు వినాయకుని రూపంలో గల రెండు కాయలను రైతు గుర్తించారు. వినాయకచవితి మరో రెండు రోజుల్లో ఉండగా ఇలా వినాయక రూపంలో గల బొప్పాయి కాయలను గుర్తించడంతో సమీపంలో గల రైతులు వీటిని చూడడానికి ఆసక్తి కనబరిచారు. ఈ విషయం సమీప గ్రామాలైన చిలకలపాడు, గాంధీనగరం గ్రామ ప్రజలకు తెలియడంతో ఈ కాయలను చూడడానికి తరలి వచ్చారు. రైతు కాయలు కోసి అదే చెట్టుకింద పూజలు నిర్వహించగా తోటి రైతలు పాల్గొన్నారు. వీటిని సోమవారం నవరాత్రి ఉత్సవాల్లో ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. దీనిపై రాజమండ్రి డివిజన్ హార్టీకల్చర్ హెచ్‌ఒ టి శ్రీనివాసుకు వివరించగా పోషక విలువలు ఎక్కువైనా, జన్యులోపం వల్ల ఇటువంటి లక్షణాలు గల కాయలు రూపాంతరం చెందుతాయని తెలిపారు.
దోపిడీ దొంగలుగా ఇంజనీరింగ్ విద్యార్థులు
రాజమండ్రి, సెప్టెంబర్ 7: ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న ఇద్దరు విద్యార్థులు చెడు వ్యసనాలకు లోనై దోపిడీకి పాల్పడి, పోలీసులకు చిక్కారు. రాజమండ్రిలోని తిలక్‌రోడ్డుకు చెందిన కంటిపూడి సురేంద్ర, కంబాలచెరువు ప్రాంతానికి చెందిన ర్యాలి రత్నసాయిచరణ్ అనే బిటెక్ విద్యార్థులను అరెస్టు చేసినట్లు తూర్పుమండలం డిఎస్పీ ఆర్ సత్యానందం వెల్లడించారు. వారి నుంచి దోపిడీ చేసిన 40 కాసుల బరువైన వడ్డాణం, 2 గాజులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. శనివారం ఆయన ప్రకాష్‌నగర్ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ గతనెల 28న మధ్యాహ్నం కఠారినగర్ రామాలయంసెంటర్ సోమాలమ్మగుడి రోడ్డులో స్వామి అపార్ట్‌మెంట్స్‌లో నివసించే ఎల్‌ఐసి అధికారి ఉన్నవ సూర్యనారాయణ ఇంట్లో వీరు దోపిడీకి పాల్పడ్డారన్నారు. ముసుగులు ధరించి ఇంటి తలుపు తట్టగా ఆయన కుమార్తె తలుపులు తెరిచిందన్నారు. ఆమెను కత్తితో బెదిరించి, బంధించి బీరువాలోని సొత్తును అపహరించుకుపోయారన్నారు. నిందితులు ఇంజనీరింగ్ కళాశాలల్లో బిటెక్ చదువుతున్నారన్నారు. వ్యసనాలకు బానిసైన ఇంజనీరింగ్ విద్యార్థులు సులువుగా డబ్బు సంపాదించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. విలేఖర్ల సమావేశంలో సిఐ సుబ్బారావు, ఎస్‌ఐలు కిషోర్‌కుమార్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఆందోళన: ఉద్రిక్తత
సామర్లకోట, సెప్టెంబరు 7: సేవ్ ఆంధ్రప్రధేశ్ సభకు వెళుతున్న సమైక్యవాదుల బస్‌లపై రాళ్ళదాడులను తీవ్రంగా ఖండిస్తూ శనివారం మధ్యాహ్నం సామర్లకోట రైల్వే ఓవర్‌బ్రిడ్జిపై సమైక్యవాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణవాదుల వైఖరిని నిరసిస్తూ, దాడులను ఖండిస్తూ జెఎసి నాయకులు, ఉద్యోగులు, పలు పార్టీల నాయకులు చొక్కాలు విప్పి అర్ధనగ్నంగా మోకాళ్ళపై రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణా వాదుల వైఖరిని ఖండిస్తూ జెఎసి కోకన్వీనర్, విఆర్వో నండూరి ప్రసాదరావు బెల్టుతో ఒంటిపై కొట్టుకుని తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. తొలుత సమైక్యవాదులు స్థానిక స్టేషన్‌సెంటర్‌లో, తదుపరి ఆర్వోబిపై గంటన్నరపాటు రాస్తారోకో, ఆందోళనలు చేశారు. రక్తాన్నైనా చిందిస్తాం, సమైక్యాంధ్ర సాధిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, రాష్ట్ర విభజన ఆపుతాం అని పెద్దఎత్తున నినాదాలు చేశారు. సుమారు గంటన్నరపాటు ఆర్వోబిపై ట్రాఫిక్ స్తంభించి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారులు మద్దతుగా నినాదాలు చేయాలని కోరగా, తెలంగాణాకు చెందిన డ్రైవర్ బరికపల్లి సైదులు అభ్యంతరం చెప్పాడు. సమైక్యానికి జై కొట్టకుంటే వాహనాలు వదలబోమని ఆందోళనకారులు వాగ్వివాదానికి దిగారు. దాంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఎట్టకేలకు తెలంగాణా డ్రైవర్ సైదులు సమైక్యానికి జై కొట్టడంతో వివాదం సద్దుమణిగింది. దీంతో ఇరువైపులా రెండు కిలోమీటర్లమేర ట్రాఫిక్‌లో వాహనాలు చిక్కుకుపోయాయి. ఈ ఆందోళనలో వేదిక నాయకులు దవులూరి సుబ్బారావు, గుణ్ణం రాజబ్బాయి, సేపేని సురేష్, ఇరుసుమళ్ళ విష్ణు, నూతలపాటి అప్పలకొండ, ఎస్‌కె జిలానీ, సుంకవిల్లి బాపిరాజు, పోలిశెట్టి రాజేష్, తోటకూర సాయిరామకృష్ణ, అడబాల కుమారస్వామి, సంగినీడు భావన్నారాయణ, బత్తుల భరత్, బంగారు అప్పారావు, ఇవోపిఆర్‌డి జె రాంబాబు, మేకా నాగేశ్వరరావు, నేతల హరిబాబు, పిట్టా జానకిరామారావు, దవులూరి ప్రభాకర వెంకట రాజారావు, నండూరి ప్రసాదరావు, నూతలపాటి లోవరాజు, ఐపి శ్రీనివాస్, ఉపాధ్యాయులు, మెడికల్, రెవిన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు, వేదిక నాయకులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.