రావులపాలెం, సెప్టెంబరు 7: హైదరాబాద్‌లో సమైక్యాంధ్రకు మద్దతుగా ఎపి ఎన్జీవోలు తలపెట్టిన సేవ్ ఆంధ్రప్రదేశ్‌కు హాజరై బస్సులో తిరిగి వస్తున్న రావులపాలెం మండలానికి చెందిన ఎన్జీవోల బస్సుపై తెలంగాణావాదులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలను ఎన్జీవోలు స్థానిక విలేఖరులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..సభ ముగిసిన వెంటనే సుమారు 50మంది రావులపాలెం మండల ఉద్యోగులు బస్సులో శనివారం సాయంత్రం బయల్దేరారు. మలక్‌పేట వద్దకు వచ్చేసరికి సుమారు అయిదు మోటార్ సైకిళ్లపై వచ్చిన తెలంగాణావాదులు బస్సుపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో బస్సులో ఉన్న మండల పశువైద్యాధికారి ఎల్ విజయారెడ్డి, కొమరాజులంక గ్రామ కార్యదర్శి ఎల్ దుర్గాప్రసాద్, బస్సులోనే ఉన్న రావులపాలెం మండల పాత్రికేయుడు గండ్రోతు సతీష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో దిగ్భ్రాంతికి లోనైన ఉద్యోగులు బస్సు దిగి రహదారిపై ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ డిఎస్పీ సోమేశ్వరరావు సిబ్బందితో అక్కడకు చేరుకునే సరికే తెలంగాణావాదులు పరారయ్యారు. ఉద్యోగులు ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయపడిన ఉద్యోగులను స్థానికంగా గల ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే దాడి సమాచారం తెలియటంతో రావులపాలెంలో సమైక్యవాదులలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జెఎసి ఆధ్వర్యంలో శనివారం రాత్రి 7గంటల నుండి కళా వెంకట్రావు సెంటర్లో 16వ నెంబరు జాతీయ రహదారిని దిగ్బింధించి, ఆందోళన కొనసాగించారు. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకూ తమ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేయటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో రావులపాలెంలో తీవ్ర ఉద్రిక్తతచోటుచేసుకుంది. చివరకు రాత్రి 9.30 గంటలకు ఆందోళన విరమించారు.ఈ ఆందోళనలో జెఎసి ఛైర్మన్ కర్రి శ్యామసుందర్‌రెడ్డి, కన్వీనర్ పివిఎస్ సూర్యకుమార్, పోతంశెట్టి కనికిరెడ్డి, పడాల పాపిరెడ్డి, తాడి శ్రీనివాసరెడ్డి, మన్యం సుబ్రహ్మణ్యం, రావులపాలెం ఉప సర్పంచ్ కొవ్వూరి జగన్నాధరెడ్డి, ఎస్ జ్యోతిబసు, వైడిఎస్‌ఎన్ బాలాజీ, వందలాది మంది సమైక్యవాదులు పాల్గొన్నారు.
చవితి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
రాజమండ్రి, సెప్టెంబరు 7: రాజమండ్రి పోలీసు అర్బన్‌జిల్లాలో వినాయకచవితి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఎస్పీ టి రవికుమార్‌మూర్తి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉత్సవాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేందుకు తాము సూచించిన 25 నిబంధనలు పాటించాలని ఉత్సవ సమితి నిర్వాహకులకు పిలుపునిచ్చారు. పోలీసు, నగరపాలక సంస్థ, విద్యుత్‌శాఖల అనుమతి లేనిదే పందిళ్లు ఏర్పాటు చేయరాదని, మైకులకు ఆయా పరిధిలోని డిఎస్పీల అనుమతి తీసుకోవాలన్నారు.
మట్టి వినాయకుని ప్రతిమలనే ఉపయోగించాలి
కాకినాడ సిటీ, సెప్టెంబరు 7: వినాయకచవితి పర్వదినాన్ని పురష్కరించుకుని పూజా కార్యక్రమాలకు మట్టితో తయారు చేసిన వినాయకుని ప్రతిమలనే ఉపయోగించాలని జిల్లా కలక్టర్ నీతూప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ నెల 9వ తేదీన జరిగే వినాయక చవతి సందర్భంగా కాకినాడ ధరిత్రి రక్షణ సమితి వ్యవస్థాపకురాలు సీమకుర్తి సురేఖ ఆధ్వర్యంలో శనివారం నగరంలో పది వేల మట్టి వినాయకుని ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. స్థానిక భానుగుడి ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ నీతూప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రజలకు మట్టి వినాయకుని ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యవరణ పరిరక్షణకు ధరిత్రి రక్షిత సమితి చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు. వినాయకచవితికి ప్రకృతి సిద్ధమైన మట్టితో తయారైన విఘ్న నాయకుని తయారు చేసుకుని ఆరాధిస్తే ప్రకృతిని ఆరాధించి మానవ మనగడను కాపాడినట్లేనని పేర్కొన్నారు. నిమజ్జనం సమయంలో ప్రతిమలకు అలంకరించిన వస్త్రాలు, ప్లాస్టిక్ వస్తువులు ఇతర సామాగ్రిని తొలగించి నిమజ్జనం చేయడం ద్వారా జల కాలుష్యాన్ని నివారించవచ్చునని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. విషపూరిత పదర్థాలతో తయారు చేసిన వస్తువులను మనం వినియోగించడం ద్వారా వినాసానికి చేటు తెచ్చుకోవడం జరుగుతోందన్నారు. మన ప్రాచీన కాలం నుండి ప్రకృతి సిద్ధమైన వాటితో తయారు చేసిన దేవుని ప్రతిమలను వినియోగిస్తూ ఆరాధించడం సంప్రదాయంగా వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ధరిత్రి రక్షణ సమితి వ్యవస్థాపకురాలు సురేఖ మాట్లాడుతూ విషపూరితమైన రసాయనాలతో తయారైన విగ్రహాలను చెరువులు, కాలువలు, బావులు, సముద్రాల్లో నిమజ్జనం చేయడం ద్వారా జల కాలుష్యానికి కారణమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాన్ని నివారించి ప్రజల్లో పర్యావరణ పరిరక్షణకు తాము కృషి చేస్తున్నామని దీనిలో భాగంగా పెద్ద ఎత్తున వినాయక ప్రతిమలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షుడు పి ఈశ్వరరావు, కార్యదర్శి నరసింగరావు, ఎ శ్రీనివాసరావు, మురళీకృష్ణ, డిపిఆర్‌ఓ వి రామాంజనేయులు, జయ్‌దేవ్, బాబి, శ్రీనివాసరావు, వీరారాఘవరెడ్డి, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.