Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

9న స్విమ్స్ ఓపి, ఓటిలకు సెలవు

$
0
0

తిరుపతి, సెప్టెంబర్ 7: వినాయకచవితిని పురస్కరించుకుని స్విమ్స్ ఔట్‌పేషెంట్స్ విభాగం, ఆపరేషన్ థియేటర్లకు ఈనెల 9న సెలవు ప్రకటించినట్లు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ తెలిపారు. ఔట్ పేషెంట్స్ విభాగం, ఆపరేషన్ థియేటర్లకు మాత్రమే సెలవు ప్రకటించామని, అత్యవసర సేవలు యధావిధిగా కొనసాగుతాయని ఆమె తెలిపారు.
తెలుగుగంగ కాలువలో పడి బాలుడు మృతి
సత్యవేడు, సెప్టెంబర్ 7: సత్యవేడు వద్ద ఉన్న తెలుగుగంగ కాలువలో ఈతకు వెళ్లిన బాలుడు వంశీసాయి (10) శనివారం మృతి చెందిన సంఘటన పట్టణంలోని ప్రజలకు విషాదం మిగిల్చింది. తెలుగుగంగ కాలువల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున బాలుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్వాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రసాద్ చెప్పారు.
విద్యుత్‌షాక్‌తో కార్మికుడు మృతి
శ్రీకాళహస్తి, సెప్టెంబర్ 7: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయంలో విద్యుత్‌దీపాలంకరణ చేస్తున్న కార్మికుడు విద్యుత్ షాక్‌కు గురై మరణించిన సంఘటన శనివారం జరిగింది. విద్యుత్‌దీపాలంకరణ పనులను చేసేందుకు శ్రీకాళహస్తి దేవస్థానం మాధవయ్య అనే కాంట్రాక్టర్‌కు బాధ్యతలు అప్పగించింది. ఆయన పలువురు ఎలక్ట్రిషియన్లను పెట్టుకుని దీపాలంకరణ పనులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శనివారం ఆలయంలో దీపాలంకరణ పనులు చేస్తున్న శ్రీకాళహస్తిలోని ఎంఎం వాడకు చెందిన లోకేష్(21) విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఆయన్ను ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఇందుకు బాధ్యత వహించి కాంట్రాక్టర్ నష్టపరిహారం చెల్లించాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
విభజన ప్రకటనలో
మొదటి ముద్దాయి కాంగ్రెస్, రెండవ ముద్దాయి బాబు
* ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి
ఆంధ్రభూమిబ్యూరో
తిరుపతి, సెప్టెంబర్ 7: కలసిమెలసి జీవనం సాగిస్తున్న తెలుగుప్రజల గొంతుకోసే విభజన ప్రకటనలో మొదటి ముద్దాయి కాంగ్రెస్ అని, రెండవ ముద్దాయి టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అని నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం తిరుపతి రూరల్ తుమ్మల గుంటలో చంద్రగిరి నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సిపి ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి 40లక్షలు విలువ చేసే 620 వినాయకప్రతిమలను పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేకపాటి మాట్లాడుతూ 2007వ సంవత్సరంలోను, 2009వ సంవత్సరంలోను విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబునాయుడు ఆత్మగౌరవయాత్ర చేయడం హాస్యాస్పదం అన్నారు. ఓట్లకోసం, సీట్లకోసం బాబు ఎన్ని కుట్రలు, కుయుక్తులు, ఎత్తులుపై ఎత్తులు వేసినా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరన్నారు. తాను చెప్పేది ఒక్కటేనని బాబుకు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే విభజనకు మద్దతుగా ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకుని సమైక్యాంధ్రకు లేఖ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలుగుజాతి ప్రజల మధ్య చిచ్చుపెట్టడానికి ఏకపక్షంగా విభజన నిర్ణయం తీసుకుందని నిప్పులు చెరిగారు. ఇది ఎంతో దురదృష్టకరమైన నిర్ణయం అన్నారు. రెండు పర్యాయాలు కేంద్రం అధికారంలో ఉండడానికి తెలుగుజాతి ప్రజలు అవకాశం ఇచ్చారన్నారు. అలాంటి ప్రజల మధ్య చిచ్చుపెట్టి వారిని మనోవేదనకు గురిచేసి మూడవ పర్యాయం కూడా వారి ఓట్లతోనే అధికారంలోనికి రావడానికి సోనియా కలలు కంటోందని ఎద్దేవాచేశారు.
వినాయకవిగ్రహాల పంపిణీ ఒక ధార్మిక కార్యక్రమం - మేకపాటి
వినాయకచవితి పర్వదినాన విగ్రహాలు పంపిణీ చేయాలని వైఎస్‌ఆర్‌సిపి చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి చెవిరెడ్డి చేసిన యోచన ఒక అద్భుతమైన ధార్మిక కార్యక్రమం అని నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. చంద్రగిరి నియోజకవర్గపరిధిలో ఉన్న ప్రతి మండలానికి ఏడు నుండి 12అడుగుల ఎత్తు కలిగిన విగ్రహాలను చెవిరెడ్డి తయారు చేయించారు. ఇందుకోసం 40లక్షల రూపాయలు వ్యయం చేసి 620 విగ్రహాలను సిద్ధం చేశారు. ఈ విగ్రహాలను మేకపాటి, రోజా చేతులు మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేకపాటి, రోజా మాట్లాడుతూ వినాయకచవితి రోజున ప్రతి ఒక్కరు తమ గ్రామంలో వినాయకపూజలు గొప్పగా చేయాలని భావిస్తారన్నారు. అలాంటి వారి ఆశలను నిజం చేయాలని చెవిరెడ్డి గుర్తించి ఉచితంగా అతిపెద్ద విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. తద్వారా తమ గ్రామాల్లో పెద్ద విగ్రహాలను పెట్టుకుని గొప్పగా వినాయకచవితిని జరుపుకోవడమే కాకుండా ఆ గ్రామాల్లో భక్తిచైతన్యం తీసుకురావడానికి ఒక మార్గంగా ఈ కార్యక్రమం మిగులుతుందన్నారు.
మిగలబెట్టుకోవయ్యా...చెవిరెడ్డి
చెవిరెడ్డి అనేక మంచి కార్యక్రమాలకు తన పెద్దలు సంపాదించిన సొమ్మును విచ్చలవిడిగా ఖర్చుచేస్తున్నారని మిగిలబెట్టుకోవయ్యా, మున్ముందు డబ్బుతో ఎంతో అవసరం ఉంటుందని తాను చెప్పినా ఆయన శుభకార్యక్రమాలకు డబ్బులు విచ్చలవిడిగా వెచ్చిస్తున్నారని, ఇందుకు తాను అభినందిస్తున్నానని ఎంపి మేకపాటిఅన్నారు.
వైఎస్‌ఆర్‌సిపిలో ఉన్నది ఇద్దరే ఎంపిలే
* అందులోనూ ఒకరు జైలులోనే ఉన్నారు : ఎంపి శివప్రసాద్
చంద్రగిరి, సెప్టెంబర్ 7: వైఎస్‌ఆర్‌సిపిలో పార్లమెంట్ సభ్యులు ఇద్దరే ఉన్నారని, అందులో ఒక్కరు జైల్‌లోను, మరొకరు మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో తెలియడం లేదని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు శివప్రసాద్ అన్నారు. శనివారం చంద్రగరిలో తెలుగుదేశంపార్టీ నాయకులతో కలసి విలేకరులతో మాట్లాడారు. చంద్రగిరిలోని ఐక్యకార్యాచరణ సమితి ఇప్పటివరకు ఉద్యమాన్ని చెప్పుకోదగ్గ రీతిలో నిర్వహించిందని, ప్రజలతో పాటు రాజకీయ నాయకులను కలుపుకుని పోవడం ఎంతో మంచిదన్నారు. పార్లమెంట్ భవనాన్ని రాతికట్టడంతో నిర్మించారని, అయితే అక్కడున్న ప్రభుత్వ పాలకులు మాత్రం రాతిగుండెల వలె వ్యవహరిస్తున్నారన్నారు. తాను పార్లమెంట్‌లో ఇందిరాగాంధీ మాస్క్ ధరించి సోనియాగాంధీకి సూచన చేయడానికి వెళ్లానని, 1987వ సంవత్సరంలో ఎన్‌టిఆర్ ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ కూల్చివేయడం వలన అప్పడు ప్రజాగ్రహానికి గురై తిరిగి ప్రజాభిప్రాయం మేరకు టిడిపికి అధికారం అందించారన్నారు. ఇప్పుడు తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోపాగ్నికి గురికావద్దని సోనియాగాంధీకి సూచించడమే మాస్క్ ఉద్దేశ్యమన్నారు. కేంద్రప్రభుత్వం మన ఆర్తనాదాలు వినే పరిస్థితుల్లో లేదని, మన ఉద్యమాన్ని కేంద్రప్రభుత్వం తక్కువచేసి చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు హరినాయుడు, రమేష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాగా జిల్లా తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు మండల పార్టీ అధ్యక్షుడు హరినాథ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమైక్యాంధ్రకు మద్దతుగా మూడురోడ్ల కూడలి వద్ద మానవాహారం ఏర్పాటు చేశారు.
ఊపందుకున్న చవితి సంబరాలు
* సమైక్య ఉద్యమానికి తాత్కాలిక విరామం
ఆంధ్రభూమిబ్యూరో
తిరుపతి, సెప్టెంబర్ 7: గత 38రోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమంతో అట్టుడికిన తిరుపతి పుణ్యక్షేత్రం వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సమైక్యవాదులు దీక్షాశిబిరాలకు పరిమితం అయ్యారు. ఈ నేపధ్యంలో ప్రజలు పెద్దఎత్తున మార్కెట్‌కు తరలివెళ్లి వినాయచవితి ఘనంగా నిర్వహించడానికి అవసరమైన పూజాసామాగ్రిని కొనుగోలు చేయడానికి సిద్ధపడ్డారు. దీంతో మొన్నటివరకు ఉద్యమనినాదాలు చేసే జనంతో కిటకిటలాడిన నగరవీధులు నేడు పూజాసామాగ్రిని, వినాయక విగ్రహాలను కొనుగోలు చేయడానికి తరలిరావడంతో నగరవీధులు కిటకిటలాడాయి. అయితే ఉద్యమనేపథ్యంలో పూజాసామాగ్రి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ యేడాది వీధుల్లో పెట్టే విగ్రహాల సంఖ్య ఒక విధంగా తగ్గిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు వెళ్లిన సీమాంధ్రులపై తెలంగాణవాదులు రాళ్లతో దాడి చేయడాన్ని నిరసిస్తూ తిరుపతి జెఎసి కన్వీనర్ డాక్టర్ సుధారాణి ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీమాంధ్రులు శాంతికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలన్నారు. అయితే తెలంగాణవాదులు తమ స్వార్థం కోసం ఎలాంటి వాటినైనా అడ్డుకుంటామని తమ నైజాన్ని చాటుకుని సీమాంధ్రులపై రాళ్లు రువ్వారన్నారు. ఇది దుర్మార్గమైన చర్య అన్నారు. తమ శాంతి, సహనానికి పరీక్ష పెట్టవద్దని కోరారు. ఈ సందర్భంగా తెలుగుతల్లికి పాలాభిషేకం చేసి హారతులు ఇచ్చి, టెంకాయలు కొట్టారు. రాష్ట్రంలో సంక్షోభం తొలగిపోవాలని ప్రార్థనలు చేశారు. ఈకార్యక్రమంలో నర్సింగ్ విద్యార్థులు, శాప్స్ అధ్యక్షులు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ వాసు, శ్రీనివాసచౌదరి, హరినాథశర్మ, రాజేంద్రప్రసాద్, జోనల్ ఇన్‌చార్జి తుమ్మల విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న శిబిరంలో శ్రీగాయత్రి కళాశాల అధ్యాపకులు సతీష్, మధు, కోటేశ్వర్‌రావు, త్రిలోక్, శివప్రసాద్, వెంకటేశ్వర్లు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. వీరికి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ సంఘీభావం తెలిపారు. కాగా మున్సిపల్ ఉద్యోగులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. వీరికి నవీన్‌కుమార్‌రెడ్డి మద్దతు తెలపగా ఉద్యోగులు సేతుమాధవ్, చిట్టిబాబు, హరిమోహన్, నవీన్‌కుమార్, శ్రీనివాసులురెడ్డి, కందాటి గిరిబాబు, సూరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే వై ఎస్ ఆర్ సి పి దీక్షాశిబిరంలో రాయపునేని మురళి ఆధ్వర్యంలో యువత శివయ, గౌరీనాథ్, బాబు, శ్రావణ్, వినోద్, హరి, రమేష్ పాల్గొన్నారు. వీరితో పాటు వైఎస్‌ఆర్‌సిపి నాయకులు ఎంవిఎస్ మణి, ఆదికేశవరెడ్డి, ఎస్ కె బాబు, కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు. అలాగే కృష్ణాపురం ఠాణా వద్ద టిడిపి దీక్షాశిబిరంలో తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు పుష్పావతి, విజయలక్ష్మి, మస్తాన్‌నాయుడు, ఆర్‌సి మునికృష్ణ, మందలపు మోహన్‌రావ్, దంపూరి రాజ్యలక్ష్మి, కుమారమ్మ, సరోజమ్మ, సతీష్, రవి తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండు వద్ద జరుగుతున్న ఎపి ఎన్ జి ఓల దీక్షాశిబిరంలో డిప్యూటీ ఇఓ చంద్రయ్య, ఎం ఇ ఓ ఇందిరాదేవి ఆధ్వర్యంలో జె ఎసి కో కన్వీనర్ మంజునాథ్, ప్రధానోపాధ్యాయులు వాసుదేవరెడ్డి, హౌసింగ్ ఇఇ రూప్‌చంద్ర, డిఇ బాలకృష్ణారెడ్డిలతో పాటు ఉపాధ్యాయులు కృష్ణమనాయుడు, పలువురు ఉపాధ్యాయులు, పలు విభాగాల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఎస్వీయు గోల్డెన్‌జూబ్లీ ఆర్చి ముందు మానవాహారం ఏర్పాటు చేసి, రోడ్డుపై జెఎసి నాయకులు రాస్తారోకో చేశారు.

వినాయకచవితిని పురస్కరించుకుని స్విమ్స్ ఔట్‌పేషెంట్స్
english title: 
s

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>