కడప, సెప్టెంబర్ 7:రాష్ట్ర ప్రజలకు సమన్యాయం చేయడం ఒక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని వైకాపా నేత షర్మిల పేర్కొన్నారు. సీట్ల కోసం కుటిల రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు కాలం చెల్లిందన్నారు. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా శనివారం ఆమె మైదుకూరు, బద్వేలుల్లో జరిగిన సభల్లో ఆమె మాట్లాడుతూ ఆ రెండు పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. రాజకీయంగా మూల్యం చెల్లించుకోక తప్పదని ఆమె హెచ్చరించారు. సమైక్యాంధ్ర కోసం తమ పార్టీతో పాటు సిపిఎం, ఎంఐఎం పార్టీలు మాత్రమే కేంద్రానికి లేఖలు ఇచ్చాయన్నారు. చిత్తశుద్ధిలేని కాంగ్రెస్, టిడిపిలు ప్రజలను రెచ్చకొట్టి రాష్ట్రంలో అశాంతిని రేపుతున్నాయని ఆమె ఆరోపించారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు విభజన ప్రకటన వెలువడిన మరుక్షణమే పదవులకు రాజీనామా చేశారన్నారు. ఆ రెండు పార్టీలకు చెందిన ఎంపిలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా కల్లిబొల్లి మాటలతో చౌరబారు ప్రకటనలు చేస్తున్నారన్నారు. దివంగత నేత వైఎస్ ఆకస్మిక మరణానంతరం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకొని పదవులు అధికారమే పరమావధిగా రాష్ట్రాన్ని దివాలా తీయించాయన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చేయడానికి రాష్ట్రాన్ని ముక్కలు చేసి తెలుగుజాతిని నిట్టనిలువునా చీల్చి సీట్ల కోసం, ఓట్ల కోసం తపన పడుతున్నారని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధిష్ఠానం చేతిలో కీలుబొమ్మగా మారి ఢిల్లీ, హైదరాబాద్‌ల మధ్య చక్కర్లు కొడుతూ చేతగాని పాలకుడిగా పేరు తెచ్చుకున్నారన్నారు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన వెంటనే కేంద్ర, రాష్ట్ర మంత్రులు సామూహిక రాజీనామాలు చేసి ఉంటే విభజన ప్రక్రియ ప్రారంభం అయ్యేది కాదని గుర్తు చేశారు. అంతకుముందు అవిశ్వాసం తీర్మానం పెట్టినప్పుడు చంద్రబాబునాయుడు లోపాయికారీ ఒప్పందంతోనే ప్రభుత్వాన్ని గట్టేక్కించారని ఆమె గుర్తుచేశారు. 600ల సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్‌ను చంద్రబాబునాయుడు తానే అభివృద్ధి చేశానని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబునాయుడు హయాంలో తెలుగు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆమె ఆరోపించారు. ఆమె వెంట మాజీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ కేంద్ర కమిటీ ఛైర్మెన్, సభ్యుడు ఎస్. రఘురామిరెడ్డి, డి.సి. గోవిందరెడ్డి, ఎమ్మెల్యేలు జి. శ్రీకాంత్‌రెడ్డి, ఎ. అమర్‌నాథ్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆ పార్టీ జిల్లా కన్వీనర్, జడ్పీ మాజీ ఛైర్మెన్ కె. సురేష్‌బాబు, కడప మాజీ మేయర్ పి. రవీంద్రనాథ్‌రెడ్డి, యువ పారిశ్రామిక వేత్త ఎల్. లాజరస్ తదితరులు ఉన్నారు.
సమైక్యహోరులో ఆధిపత్యపోరు
ఆంధ్రభూమి బ్యూరో
కడప, సెప్టెంబర్ 7: ఉధృతమవుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంపై పట్టు సాధించే లక్ష్యంతో ప్రధాన పార్టీలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. కేంద్రం విభజన ప్రకటన చేసిన అనంతరం సమైక్యాంధ్ర ఉద్యమం స్వచ్ఛందంగా ప్రజలలో ప్రారంభమై బలపడి ఢిల్లీకి తాకింది. అయినా సీమాంధ్ర జనం ఆవేదన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో అరణ్యరోదనగా మారుతోంది. దీంతో అధికార పార్టీ నేతలు అయోమయంలో పడి తమ భవిష్యత్‌పై ఆందోళనకు గురవుతున్నారు. దీనితో ఉనికిని కాపాడుకోవడానికి పక్క పార్టీలపై దృష్టి సారిస్తున్నారు. కమలాపురం ఎమ్మెల్యే వంటి నేతలు అడుగుముందుకేసి కొత్త పార్టీ ఏర్పాటు ఆలోచనను తెరపైకి తెస్తున్నారు. గడిచిన అసెంబ్లీ, పార్లమెంట్ ఉప ఎన్నికలతో పాటు డిసిసి, డిసిఎంఎస్, గ్రామ పంచాయతీల ఎన్నికలలో కూడా పార్టీ ప్రభావం ఏ మాత్రం పనిచేయక పోవడంతో గత రెండు సంవత్సరాలుగా దిక్కుతోచని స్థితికి చేరిన అధికార పార్టీ నాయకుల పరిస్థితి సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా మరింత దిగజారిపోయింది. ఈ పరిస్థితుల్లో జిల్లా అధికార పార్టీలో ఏ ఒక్క నాయకునికి కూడా తమ రాజకీయ భవిష్యత్‌పై నమ్మకం కలగడం లేదు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో జిల్లాకు చెందిన సీనియర్ నేతలకు కార్పొరేషన్ పదవులు దక్క లేదు. పదవుల కోసం నిరీక్షిస్తున్న నేతలకు సమైక్యాంధ్ర సెగ చుట్టుముట్టింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో అధికార పార్టీ నేతలకు 2014 సాధారణ ఎన్నికలలో రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీ అగ్రనేత ఎన్ చంద్రబాబునాయుడు జిల్లాపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. వైకాపా అధినేత సొంత జిల్లా అయినందున తెలుగుతమ్ముళ్లకు కూడా అనైక్యత కారణంగా వారి మధ్య ఉన్న కుమ్ములాటలే ఆ పార్టీ నేతల కొంప ముంచుతున్నది. ఆ పార్టీలో ఆదిపత్యపోరు కారణంగా జిల్లాలోనే అగ్రనేతలలో ఆ పార్టీపై తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన జిల్లాలో తెలుగుతమ్ముళ్లు అసంతృప్తి జ్వలలు ఎగసిపడుతున్నాయి. సమైక్యాంధ్ర ప్రకటన ప్రభావాన్ని ఆ పార్టీకి అనుకూలంగా మలుచుకునే పరిస్థితులు లేవు. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత రెండుకళ్ల సిద్దాంతమే ఆ పార్టీ శ్రేణులలో నిరుత్సాహం నింపింది. ప్రస్తుతం బాబు చేస్తున్న యాత్రలు ఏ మాత్రం ఆ పార్టీకి అనుకూలం చేకూరుస్తుందోనని తెలుగుతమ్ముళ్లు అనుమానాలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా జిల్లాలో వైఎస్ మరణానంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం తీవ్రంగా ఉండడంతో పాటు అన్ని ఎన్నికలలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న ఆ పార్టీ నాయకులు ప్రస్తుతం తమ రాజకీయ భవిష్యత్ పట్ల ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు తమ పార్టీ వెంటే ఉన్నారన్న నమ్మకం నాయకులతో పాటు సామాన్య కార్యకర్తల్లో కూడా నెలకొని ఉంది. అంతేకాకుండా ఇప్పటికే ఆ పార్టీ హైకమాండ్ 2014 ఎన్నికలలో బరిలో దించే నేతల ఎంపిక ఓ కొలిక్కి రావడం జరిగింది. సమైక్యాంధ్ర ఉద్యమం కూడా తమకు అనుకూలంగా మలుచుకోవడానికి వారు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఏది ఏమైనా సమైక్యాంధ్ర విభజనతో ఇటు కాంగ్రెస్, అటు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ప్రకంపనలు మొదలయ్యాయి.
ఆర్టీపిపికి సమైక్యసెగ
ఎర్రగుంట్ల, సెప్టెంబర్ 7: రాయలసీమకు ప్రతిష్టాత్మకంగా మనగలుగుతున్న రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపిపి)కు సమైక్యాంధ్ర ఉద్యమ సెగ తగిలింది. దీంతో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 600ల మెగా వాట్ల 6వ యూనిట్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. యుపి ఎ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు శ్రీకారం చుట్టినప్పటి నుండి ఉద్యోగులు ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని భుజాన ఎత్తుకున్నారు. అప్పటి నుండి గత 38 రోజులుగా రిలే నిరాహార దీక్షలు, బంద్‌లు, మోటర్ సైకిళ్ల ర్యాలీలు తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఉద్యోగులతో పాటు ఉన్నతాధికారులు కూడా ఉద్యమానికి సానుకూలంగా స్పందించడంతో ఆర్టీపిపిలో ప్రస్తుతం ఉద్యమ సెగలు రాజుకుంటున్నాయి. జెఎసిగా ఏర్పడి రిలే దీక్షలతో పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే ఈనెల 5వ తేదీన సామూహిక సెలవులు ప్రకటించి విధులకు గైర్హాజరయ్యారు. 6, 7, 8 తేదీలలో సహాయ నిరాకరణ చేపట్టుతున్నారు. అలాగే శనివారం సహాయ నిరాకరణ కార్యక్రమాలతో పాటు దాదాపు 4 బస్సులలో ఇతర వాహనాలలో వందలాది మంది ఉద్యోగులు హైదరాబాద్‌లో జరిగే సేవ్ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమానికి తరలివెళ్లారు. అలాగే 10వ తేదీ సహాయ నిరాకరణ, 11వ తేదీన టూల్‌రూమ్‌ను అధికారులకు అప్పగించడం, 12వ తేదీ నుండి మెరుపు సమ్మెలో పాల్గొనడం లాంటి కార్యక్రమాలను చేపట్టారు. ప్రతి రోజు విధులను నిర్వహిస్తూనే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తీవ్రం చేసేందుకు ప్రతి కార్మికుడు తన వంతు కృషిచేయడం గమనార్హం. ఇక 600 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మాణ పనులు గత నెల రోజులుగా నత్తనడకన సాగుతున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలోతాము సైతం పాల్గొంటామని దినసరి కూలీలు కూడా ఆందోళనలను చేపట్టారు. దీంతో ఆయా నిర్మాణపు కంపెనీల అధికారులు కూడా ఏమిచేయలేని పరిస్థితిలో ఉన్నారు. 2014 ఆగస్టు నాటికి 6వ యూనిట్ పనులు పూర్తికావాల్సి ఉండగా దాదాపు నెల రోజుల పనులు నిలిచిపోవడంతో 2014 నాటికి సగం పనులు కూడా పూర్తి అవుతాయన్న నమ్మకం లేదని అధికారులే బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా 6వ యూనిట్ నిర్మాణం కోసం దిగుమతి చేసుకున్న పలు యంత్ర పరికరాలను ఇతర ప్రాంతాలకు తరలించాలనే యోచనలో జన్‌కో ఉందని తెలియడంతో ఉద్యోగ సంఘాలు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అలాంటి పరిస్థితి కల్పిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించడంతో తరలికార్యక్రమం నిలిచిపోయింది. లేకపోతే ఆర్టీపిలోని యంత్ర సామాగ్రిని తెలంగాణలోని భూపాల్‌పల్లె నిర్మాణ ప్రాజెక్టుకు తరలించాలని జన్‌కో అధికారులు తగు చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఆర్టీపిపిలోని 4 యూనిట్లలో ఉత్పత్తి నిరాటకంగా సాగుతుంది. మొత్తం 1050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆర్టీపిపి నుండి ఉత్పత్తి అవుతున్నట్లు ఉన్నతాధికారులు తెలియజేశారు. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకపోయిన ఈనెల 12వ తేదీ నుండి మెరుపు సమ్మెకు ఉద్యోగులు దిగితే పరిస్థితి ఎలా ఉంటుందోనని అటు జెన్‌కో అధికారులతో పాటు స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ లోపు సమైక్యాంధ్ర సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశ ప్రజల్లో వ్యక్తమవుతోంది. లేకపోతే 12వ తేదీ నుంచి ఆర్టీపిపిలో విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.