Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కాంగ్రెస్, టిడిపిలే టార్గెట్

$
0
0

కడప, సెప్టెంబర్ 7:వైఎస్సార్ సిపి నాయకురాలు వై ఎస్. షర్మిల జిల్లాలో జరిగిన రెండు రోజుల సమైక్యాంధ్ర శంఖారావం బస్సు యాత్రల సభలలో ఆమె ప్రసంగం కాంగ్రెస్, టిడిపి పార్టీలనే టార్గెట్ చేసుకొని దుయ్యబట్టారు. శుక్రవారం ప్రొద్దుటూరు, శనివారం మైదుకూరు, బద్వేలు నియోజక వర్గాల్లో జరిగిన యాత్రల్లో సమైక్యాంధ్రపై ఒక పక్క ప్రసంగిస్తూ మరో పక్క ఆ పార్టీల విధివిధానాలపై దుయ్యపట్టుతూ, తన తండ్రి వై ఎస్సార్ చేపట్టిన సంక్షేమ పథకాలను కొనియాడుతూ, సోదరుడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ ప్రస్థావనంపై ప్రసంగాలు సాగించారు. వైఎస్. షర్మిల రెండు రోజుల పర్యటన విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణులలో ఉత్సాహం వెల్లివిరిసింది. వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం అనంతరం నాలుగు మాసాల క్రితం షర్మిల మహా ప్రజాప్రస్థావనం పేరిట పాదయాత్రలు పూర్తి చేసి, ప్రస్తుతం సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా శంఖారావం పేరిట బస్సుయాత్రను కొనసాగిస్తున్నారు. ఆమె ప్రసంగాలు తన తండ్రి, తన సోదరుడులకు అనుగుణంగానే హవాభావాలతోనే ప్రసంగాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపిలు, ఆ పార్టీ వివిధ విభాగాలకు చెందిన నేతలు ఆమెను అనుసరిస్తూ ఆమె పర్యటనను విజయవంతం చేశారు. ఈ రెండు కార్యక్రమాలు జిల్లాలో పూర్తి స్థాయిలో విజయవంతం కావడంతో 2014 ఎన్నికలపై ఆ పార్టీ శ్రేణులలో ఆశలు చిగురిస్తున్నాయి.

డ్రామాలు కాదు.. పదవులు వదలండి
బద్వేలు/మైదుకూరు, సెప్టెంబర్ 7:రాష్ట్ర విభజనకు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలే మూల కారణమని వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగువారిని నిట్టనిలువునా చీల్చుతున్నారని, వైకాపాతోనే సమ న్యాయం సాధ్యమని సమైక్యాంధ్ర శంఖారావ యాత్రలో వై ఎస్సార్ సిపి నేత వైఎస్ షర్మిల పేర్కొన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆమె శనివారం మధ్యాహ్నం మైదుకూరులో, రాత్రి బద్వేలులో జరిపిన యాత్రలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలలో పాల్గొని ప్రసంగించారు. మహానేత డాక్టర్ వై ఎస్. రాజశేఖర్‌రెడ్డి జీవించి ఉంటే రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టి ఉండేది కాదని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కేవలం సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడానికి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తన రాజకీయ లబ్దికోసం రెండు కళ్ల సిద్ధాంతంతో విభజన ప్రక్రియకు దారి తీసిందని ఆమె ఆరోపించారు. విభజన ప్రక్రియకు భీజమేసింది వై ఎస్సార్‌యేనని చెప్పుకుంటున్న ఆ రెండు పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా విభజన ప్రక్రియను నిలుపుదల చేయాలని ఆమె డిమాండు చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమాలతో వారి పీఠాలు కదులుతాయని భయపడి ఉత్తిత్తి రాజీనామాలు చేసి పత్రికా ప్రకటనలకే పరిమితమవుతున్నారని ఆమె స్పష్టం చేశారు. వారిలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా పదవులకు రాజీనామా చేసి వాటిని స్పీకర్ల ఎదుట ఆమోద ముద్ర వేయించుకొని ప్రజల ముందుకు రావాలని ఆమె డిమాండు చేశారు. పదవులను అంటిపెట్టుకొని రాజకీయ లబ్దికోసం ప్రాకులాడుతున్నారు తప్ప ఆ పదవులు వారికి ఇవే చివరి పదవులని ఆమె పేర్కొన్నారు. తాము తాజాగా కూడా తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై ఎస్. విజయలక్షుమ్మ సమైక్యాంధ్ర ధ్యేయంగా పెట్టుకొని లేఖను కేంద్ర హోం మంత్రికి రాయడం జరిగిందని ఇప్పటికైనా ఆ రెండు పార్టీలు సమైక్యాంధ్ర కోసం లేఖలు ఇవ్వాలని ఆమె డిమాండు చేశారు. హైదరాబాద్ తెలంగాణ వారికే అప్పచెప్పితే సీమాంధ్ర రాజధాని నిర్మించుకోవడానికి పదేళ్లు గడువు ఇస్తున్నామని 60 ఏళ్లకు పూర్తి స్థాయిలో నిర్మించిన హైదరాబాద్ రాజధాన్ని సీమాంధ్ర రాజధాని పదేళ్లలో ఏ విధంగా నిర్మించుకోగలరని ఆమె ప్రశ్నించారు. కేవలం ఆంధ్రులను విభజించి పాలించి తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పావులుగా వాడుకొని ప్రజలలో అశాంతి నెలకొల్పడానికే వారి పన్నాగాలని ఆమె పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి మనస్సులోని మాట, కేంద్రం మాట ఒకటేనని, కేవలం తన పదవిని కాపాడుకొని తన అనుచర గణాన్ని వెనుకేసుకొని రావడానికే ఆయనకు ముఖ్యమంత్రి పదవి అని ఆమె ఎద్దేవ చేశారు. ఆయన హయాంలో రాష్ట్భ్రావృద్ధి శూన్యమని, దివంగత నేత వై ఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటికి తూట్లు వేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన క్యాబినేట్‌లో నేటికి పూర్తి స్థాయి మంత్రి వర్గం లేదని, చేతకాని సి ఎంలలో కిరణ్ ఒకరని ఆమె ఎద్దేవ చేశారు. కేంద్ర ప్రభుత్వం తమ ఇష్టారాజ్యంగా విభజన ప్రక్రియకు అన్ని పార్టీలు సమ్మతించాయని, ముఖ్యంగా వైఎస్సార్ కూడా అప్పట్లో సమ్మతించినట్లు ప్రధాన మంత్రి చేత రాష్ట్ర పెద్దలు చెప్పించడం సిగ్గుచేటని ఆమె ధ్వజమెత్తారు. ఇక టిడిపి నేత ఎన్ చంద్రబాబునాయుడు విషయానికి వస్తే ఆయనకు వెన్నతో పెట్టిన వెన్నుపోటు రాజకీయాలు బాగా తెలుసని తానే మేధావి అని హైదరాబాద్ తన కృషి ఫలంగానే అభివృద్ధి జరిగిందని చెప్పుకుంటూ ప్రజల్లో తిరుగుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఆయన ఆత్మగౌరవ యాత్ర పేరిట ప్రస్తుతం చేస్తున్న బస్సు యాత్రను చూసి ఆంధ్రులు ఎవగింజుకుంటున్నారని ఆమె ఆరోపించారు. తన హయాంలో రూపాయి వడ్డీతో డ్వాక్రా మహిళలకు రుణాలు ఇస్తే వై ఎస్సార్ పావులా వడ్డీతో రుణాలు ఇచ్చారని, పన్నులు లేకుండానే 6 సంవత్సరాలు రాష్ట్రాన్ని అభివృద్ధిబాటలో నడిపించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఇకపోతే చంద్రబాబునాయుడు రాష్ట్ర విభజన కోసం చేయాల్సినంత పని చేసి ఏమి తెలియనట్లుగా ప్రజల ముందుకు వస్తున్నాడని ఆయన గుణపాఠం చెప్పాలని ఆమె విజ్ఞప్తి చేశారు. షర్మిల యాత్ర సందర్భంగా వేలాది మంది కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. బస్సుయాత్ర సాగిన దారి పొడవునా షర్మిల కోసం వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి తరలివచ్చారు. మైదుకూరులో నాలుగు రోడ్ల కూడలిలో జరిగిన బహిరంగ సభకు వేలాది మంది తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే, పార్టీ క్రమశిక్షణ కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. రఘురామిరెడ్డి ఈ సభను విజయవంతం చేయడానికి సర్వశక్తులు వడ్డారు. ఈ సభకు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కె. సురేష్‌బాబు, ఎమ్మెల్యే జి. శ్రీకాంత్‌రెడ్డి, డిసిసిబి ఛైర్మెన్ ఇ. తిరుపాల్‌రెడ్డి, కడప మాజీ మేయర్ పి. రవీంద్రనాథ్‌రెడ్డి, వై ఎస్సార్ సిపి నేతలు వై ఎస్. అవినాష్‌రెడ్డి, మహేశ్వరరెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే బద్వేలు నాలుగు రోడ్ల కూడలిలో జరిగిన బహిరంగ సభకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఈ సభ విజయవంతానికి మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు డిసి. గోవిందరెడ్డి అహర్నిషలు కృషి చేశారు. ఈ సభకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎ. అమర్‌నాథ్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ కె. సురేష్‌బాబు, కడప మాజీ మేయర్ పి. రవీంద్రనాథ్‌రెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్మెన్ డాక్టర్ మునెయ్య, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మెన్ ఎస్. గురుమోహన్, యువ పారిశ్రామిక వేత్త ఎల్. లాజరస్, మాజీ జడ్పీటిసిలు నాగార్జునరెడ్డి, భూపాల్‌రెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టర్ జి. వెంకటసుబ్బయ్య, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్. అవినాష్‌రెడ్డి, చిత్తా విజయప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం షర్మిల శంఖారావం యాత్రకు నెల్లూరుకు తరలివెళ్లగా జిల్లా సరిహద్దుల్లో మేకపాటి బ్రదర్స్ ఆమెకు స్వాగతం పలికి తీసుకెళ్లారు.

సమైక్యవాదులపై దాడి
ఆంధ్రభూమి బ్యూరో
కడప, సెప్టెంబర్ 7 : హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర సభ ముగించుకుని తిరిగి వస్తున్న నాయకులపై మార్గమధ్యంలో జరిగిన దాడిలో ఇద్దరు అధికారులతోపాటు పలువురు గాయపడ్డారు. టిఎంఆర్ ట్రావెల్స్‌లో హైదరాబాద్ నుండి తిరిగి వస్తున్న ఎన్జీఓ నాయకులను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని కొందరు యువకులు ద్విచక్రవాహనాలపై వచ్చి దాడి చేశారు. రాళ్లు రువ్వడంతో బస్సు అద్దాలు పగిలిపోయాయి. ఇందులో కడప జిల్లాకు చెందిన డ్వామా టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాసులు, ఎన్జీఓ నాయకుడు సాంబశివరావు తీవ్రంగా గాయపడ్డారు. దాడి చేసిన యువకులు జై తెలంగాణా అంటూ నినాదాలు చేసి అక్కడి నుండి పరారయ్యారు.
మునెయ్య కుటుంబానికి రెండు లక్షల సాయం
ప్రొద్దుటూరు (రూరల్), సెప్టెంబర్ 7: ఆంధ్ర రాష్ట్రాన్ని సమైక్య రాష్ట్రంగా కొనసాగించాలని తన నోట చివరిసారిగా జై సమైక్యాంధ్ర అని ఆర్టీసీ డిపోలోని నీళ్ల ట్యాంకుపైకి ఎక్కి ఒక సారిగా కిందకు దూకి సమైక్యాంధ్ర కోసం ప్రాణ త్యాగం చేసుకున్న గోటి నాగమునెయ్య (48) శవపేటికను ప్రొద్దుటూరు పట్టణంలో ఆర్టీసీ ఉద్యోగులు, కర్షకులు, కార్మికులతో పాటు ఉద్యోగుల జెఎసి కన్వీనర్, మున్సిపల్ కమిషనర్ వెంకటక్రిష్ణ, తహశీల్దార్ శ్రీనివాసులు, అన్నిప్రభుత్వ శాఖల ఉద్యోగులందరూ కలసి ఎపిఎస్‌ఆర్టీసీ బస్టాండు దగ్గర నుంచి పుట్టపర్తి సర్కిల్, రాజీవ్ సర్కిల్ వరకు అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఈ కార్యక్రమం ఎపిఎస్‌ఆర్టీసీకి చెందిన జెఎసి నాయకులు టిజిఆర్ రెడ్డి, డి రాచయ్య, ఎంవి నారాయణ తదితర ఉద్యోగుల ఆధ్వర్యంలో ఈ ఊరేగింపు జరిగింది. ఈ సందర్భంగా నాగమునెయ్య అమర్హ్రే, సమైక్యాంధ్ర ముద్దు, తెలంగాణ వొద్దు, రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దు, తెలుగు ప్రజలను విడకొట్టొద్దు, తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టోద్దు అంటూ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, కార్మికులు, కర్షకులు, ఇతర అధికారులతో పాటు పట్టణంలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, కింది స్థాయి సిబ్బంది పాల్గొన్నారు. బంధువులు, సమైక్యాంధ్ర ప్రజలు ఆయనపై పూలవర్షం కురిపించారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసన సభ్యుడు నంద్యాల వరదరాజులరెడ్డి పాల్గొని నివాళులర్పించారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో సిఐ బాలిరెడ్డితో పాటు అన్ని ప్రభుత్వ ఉద్యోగుల జెఎసిల ఆధ్వర్యంలో అన్ని శాఖల ఉద్యోగులు, పురప్రజలు తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

వైఎస్సార్ సిపి నాయకురాలు వై ఎస్. షర్మిల జిల్లాలో జరిగిన రెండు రోజుల సమైక్యాంధ్ర శంఖారావం బస్సు యాత్రల
english title: 
c

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>