అనంతపురం, సెప్టెంబర్ 7 : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు, రిలే దీక్షలు, వంటా వార్పు కార్యక్రమాలు 39వ రోజుకు చేరుకున్నాయి. జిల్లాలో ప్రతి ఒక్కరూ సమైక్యాంధ్ర కావాలంటూ నినదిస్తున్నారు. ఎన్జీఓలు ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు తరలివెళ్లినా మిగిలిన ఉద్యోగులు ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు, రిలే దీక్షలు కొనసాగించారు. అలాగే నగరంలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు సంఘీభావం తెలుపుతూ వైకాపా కార్యకర్తలు, నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. క్లాక్ టవర్ సమీపంలో ఓవర్ బ్రిడ్జి వద్ద సమైక్యాంధ్ర కావాలని నినదిస్తూ ఉపాధ్యాయులు గొంతుకు ఉరి తాగు తగిలించుకుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. అధ్యాపక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి హెల్మెట్‌లు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. జెఎన్‌టియు సిబ్బంది, విద్యార్థులు కూడా పెద్దఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.
‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు సంఘీభావం తెలుపుతూ ఆపిల్ క్రియేషన్స్ ఉద్యోగి సుమంత్ జెసిబి సహాయంతో తలకిందులుగా వేలాడుతూ ప్రదర్శన చేశాడు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట బిఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు దీక్షలు సాగించారు. వీరితో పాటు ఉపాధ్యాయులు, డిఆర్‌డిఎ, ఐకెపి, వాణిజ్య పన్నుల శాఖ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, ఆర్టీసీ, వివిధ శాఖల ఉద్యోగులు దీక్షలను కొనసాగించారు. కళ్యాణదుర్గంలో నియోజకవర్గానికి చెందిన దళితులు దళిత గర్జన నిర్వహించారు. ధర్మవరంలో న్యాయవాదులు మానవహారం నిర్మించి నిరసన వ్యక్తం చేశారు. ఇలా జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు, దీక్షలు కొనసాగాయి.
ధర్మవరం కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి!
* తెరపైకి పలువురి పేర్లు
ధర్మవరంరూరల్, సెస్టెంబర్ 7: ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైకాపాలోకి చేరడంతో అధికార పార్టీ ఇన్‌చార్జి పదవి కోసం పలువురు యత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి ధర్మవరం రాక మునుపు పార్టీకి పనిచేసి ఆయన వచ్చిన అనంతరం స్థానం కోల్పోయి అసమ్మదీయులుగా మారిన కొందరు నాయకులు ఇన్‌చార్జి కోసం అంతర్గతంగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నాయకులతోపాటు మరికొందరు బిసి నాయకులు ముఖ్యంగా చేనేత వర్గానికి చెందిన నాయకులు పావులు కదుపుతున్నట్లు సమాచారం. అయితే రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పుడే చేరితే ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందన్న భావనతో వారు బయటకు సమాచారాన్ని పొక్కకుండా తమ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు నియోజకవర్గంగా చర్చలు సాగుతున్నాయి. ఇందుకు జిల్లా కాంగ్రెస్ పెద్దల ఆశీర్వాదం తప్పక వుండాలన్న నెపంతో వారికి అనుకూలంగా వుంటున్న వ్యక్తులతో కలుస్తున్నట్లు చర్చంచుకుంటున్నారు. సమైక్య ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో రాష్ట్ర విభజన వుండక పోవచ్చునని, ప్రధానంగా విభజన జరిగినా కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లకుండా రాయల తెలంగాణ ఏర్పాటుచేసే అంశం కూడా తెరపైకి రావడంతో అదే జరిగితే కాంగ్రెస్ పూర్వ వైభవం వుంటుందన్న ఆశలను పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బాధ్యతల కోసం పలువురు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అటు కేతిరెడ్డితోనూ, ఇటు వరదాపురం సూరితోనూ కొందరు నాయకులు అసమ్మతిగా వుండటం వీరందరూ రాజకీయంగా ఆ మార్గాన్ని ఎంచుకునే అవకాశాలున్నట్లు పలువురు విశే్లషకులు భావిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఆగిన అనంతరం నిర్ణయాన్ని బట్టి బహిరంగంగానే పార్టీ బాధ్యతలను తీసుకునేందుకు ముందుకు వచ్చేందుకు పలువురు నాయకులు నిర్ణయించుకుంటున్నారు. మరోవైపు జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి తన అనునాయులకు ధర్మవరం కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పజెప్పి ఇక్కడ తన ప్రాబల్యాన్ని మరోసారి చాటుకునే పరిస్థితులు వున్నాయని పలువురు బాహాటంగా పేర్కొంటున్నారు. ఏది ఏమైనా విభజన జరుగకపోయినా, రాయల తెలంగాణ ఏర్పడినా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకునేందుకు నాయకులు ముందుకు వచ్చే అవకాశాలు మెండుగా వున్నాయి.
స్వార్థ రాజకీయాల కోసమే
రాష్ట్ర విభజన
* టిడిపి నేతలు
మడకశిర, సెప్టెంబర్ 7: స్వార్థ రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ తెలుగు జాతిని విచ్ఛిన్నం చేస్తుందని టిడిపి జిల్లా అధ్యక్షుడు బికె పార్థసారధి, ఎంపి నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యేలు పల్లె రఘునాథరెడ్డి, అబ్దుల్‌ఘనీ, పరిటాల సునీత, మాజీ ఎంపి కాలవ శ్రీనివాసు లు పేర్కొన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన ‘తెలుగు జాతి ఆత్మ గౌరవ యాత్ర’కు సంఘీభావంగా శనివారం మడకశిరలో టిడిపి ఆధ్వర్యం లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో మైండ్ గేమ్ రాజకీయాలు చేస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1983 నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఆనాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విభజన అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ పెద్దలే చెబుతుండగా వైకాపా మాత్రం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నాటకాలు ఆడుతోందని దుయ్యబట్టారు. దేశంలో అస్సాం, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, గూర్ఖాల్యాండ్‌లో ప్రత్యేక రాష్ట్రం కావాలని అసెంబ్లీ తీర్మానాలు చేసి పంపినా వాటిని పట్టించుకోకుండా తన కుమారుడిని ప్రధానమంత్రిని చేసేందుకు సోనియాగాంధీ ఆంధ్ర రాష్ట్ర విభజనకు పూనుకుందని విమర్శించారు. ఇలా దేశంలో రాష్ట్రాలను విభజిస్తే 50 కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాల్సి ఉం టుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని సీమాంధ్రకు చెందిన 25 మంది ఎంపిలు, మంత్రులు రాజీనామా చేస్తే కేంద్ర ప్రభుత్వం పడిపోయి సంక్షోభం ఏర్పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించే సమయంలో మూడు ప్రాంతాల ప్రజల మనోభావాలను తెలుసుకోవాల్సి ఉందన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల తీరని నష్టాలను చవి చూడాల్సి వస్తుందన్నారు. సమైక్యాంధ్ర సాధనకు అందరూ ఐకమత్యంగా ఉద్యమించాలన్నారు. కార్యక్రమంలో టిడిపి నేతలు మహాలక్ష్మీ శ్రీనివాస్, ఈరన్న, శ్రీనివాస్‌మూర్తి, రామకృష్ణ యాదవ్, వెంకటస్వామి ప్రసంగించగా నాయకులు నారాయణరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, నరసింహమూర్తి, గురుమూర్తి, పాండురంగప్ప, నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
* కళ్యాణదుర్గంలో దళిత గర్జన
english title:
s
Date:
Sunday, September 8, 2013