అనంతపురం, సెప్టెంబర్ 7 : రాష్ట్ర రాజధానిలో శనివారం ఎపి ఎన్జీఓలు నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభపై జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్‌లో సభ నిర్వహణపై అటు తెలంగాణవాదుల హెచ్చరికలు, ఇటు సీమాంధ్రుల పట్టుదలతో జిల్లాలో టెన్షన్ ఏర్పడింది. ఏ నలుగురు కలిసినా ఈ సభ పైనే చర్చించుకోవడం కనిపించింది. ఉదయం నుంచే అందరూ టివిలకు అతుక్కుపోయారు. ఇలా హైదరాబాద్‌లో ఏక్షణం ఏం జరుగుతోందోనన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో కనిపించింది. దీంతో వార్తా ఛానళ్లను మారుస్తూ టివిల వద్దే గడిపారు. అయితే పలుమార్లు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడంతో ఒకింత అసహనానికి గురయ్యారు. అయితే చివరకు సభ విజయవంతంగా ముగియడంతో జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక హైదరాబాద్‌లో సభ విజయవంతం కావడంతో నేటి నుంచి ఉద్యమం మరింత ఉద్ధృత రూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది.
సభ విజయవంతం పట్ల హర్షం
ఎపి ఎన్జీఓల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతంగా ముగియడంతో జిల్లాకు చెందిన వివిధ ఐకాసల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సభ విజయవంతంగా ముగియడం వెనుక జిల్లా ప్రజల ఆకాంక్ష, కృషి ఎంతో ఉందన్నారు. జిల్లా ప్రజలందరూ ఇచ్చిన ఉత్సాహంతోనే తాము ఈ సభను విజయవంతంగా ముగించగలిగామన్నారు.
సమైక్యాంధ్ర ప్రకటించేంత వరకు
ఉద్యమిస్తాం
అనంతపురం సిటీ, సెప్టెంబర్ 7: ఆంధ్రప్రదేశ్ విభజను వ్యతిరేకిస్తూ జిల్లాలో జరుగుతున్న సమైక్య ఉద్యమాలు 38వ రోజు కూడా నిరసనలు, ర్యాలీలు జరిగాయి. స్థానిక ఆర్‌డిఓ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న రెవిన్యూ, జాక్టో, హంద్రీనీవా సుజల స్రవంతి ఉద్యోగులు, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నిరవధిక దీక్షలకు కొనసాగిస్తున్నారు.
గొంతుకు ఉరి తాడుతో ఉపాధ్యాయుల నిరసన ....
సమైక్యాంధ్రకు మద్దతుగా జాక్టో ఆధ్వర్యంలో ఆర్‌డిఓ కార్యాలయం ముందు నిరవధిక దీక్షలను కొనసాగించారు. ఉదయం ఆర్‌డిఓ కార్యాలయం నుండి టవర్‌క్లాక్ వరకు ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి, అక్కడ ఉరి వేసుకున్నట్లు ఉరితాడు బిగించుకుని నిరసన తెలిపారు. ఈ శిబిరంలో జాక్టో నాయకులు రామాంజనేయులు, నారాయణస్వామి, రామలింగప్ప, నారాయణస్వామి, మహిళ ఉపాధ్యాయులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
హంద్రీనీవా సుజల స్రవంతి ఉద్యోగులు..
స్థానిక ఆర్‌డిఓ కార్యాలయం ముందు హంద్రీనీవా సుజల స్రవంతి ఉద్యోగులు నిరవధిక దీక్షలను శనివారం కొనసాగించారు. ఈ దీక్షలలో మహిళా ఉద్యోగులు పద్మావతి, వెంకటరమణమ్మ, లక్ష్మిదేవి, మేరీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మనోహరరెడ్డి, గోవిందు, సుధాకర్, వెంకటస్వామి పాల్గొన్నారు.
హెల్మెట్ పెట్టుకుని నిరసన తెలిపిన అధ్యాపకులు..
హైదరాబాదులో నిజాం ఆసుప్రతిలో తెలంగాణవాదులు సీమాంధ్రులపై దాడిని నిరసిస్తూ అధ్యాపకులు హెల్మెట్‌ను పెట్టుకుని నగరంలో ర్యాలీ నిర్వహించారు. శనివారం స్థానిక ఆర్ట్స్ కళాశాల నుండి అధ్యాపకులు హెల్మెట్‌ను ధరించి టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. స్థానిక సప్తగిరి సర్కిల్ వద్ద అధ్యాపకులు మానహారం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు బండి శ్రీనివాసులు, గంగాధర్, ఇతర అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
28వ రోజుకు చేరిన రిలే దీక్షలు..
బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జెఎసి ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 28వ రోజున ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఉద్యోగులు కొనసాగించారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు బోరంపల్లి ఆంజనేయులు, రామాంజనేయులు, గిరి, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఉద్యోగులు, మహిళలు, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో..
సమైక్యాంధ్రకు మద్దతుగా స్థానిక వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు జరుగుతున్న దీక్షలు శనివారం కొనసాగించారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు వెంకటేశ్వర్లు, శ్రీ్ధర్‌బాబు, జెఎసి నాయకులు శ్రీనివాసులు, మారుతి, సుధాకర్, రేణుకాదేవి, ఆరోగ్య శాఖ సిబ్బంది , ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్కేయూలో ..
శ్రీకృష్ణవిశ్వవిద్యాలయంలో సమైక్యాంధ్రకు మద్దతుగా 38వ రోజు కూడా దీక్షలు కొనసాగించారు. ఉద్యోగ, విద్యార్థి నాయకులు జాతీయ రహదారిపై భైఠాయించి ధర్నాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్కే యూ అధ్యాపక, ఉద్యోగ, విద్యార్థి జెఎసి ప్రొఫెసర్లు సదాశివరెడ్డి, రాజేశ్వరరావు, ప్రతాప్‌రెడ్డి, నాగయ్య, కేశవరెడ్డి, రామకృష్ణ, లింగారెడ్డి, జైపాల్ యాదవ్, వెంకటరాముడు, సూర్యనారాయణ, రాము, ఎస్కేయూ ఉద్యోగులు, సమైక్యవాదులు, ఇతర విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
తలకిందులుగా తపస్సుతో సమైక్యవాది నిరసన
క్రేన్ ముందు భాగంలో వున్న కొక్కికి తాడుకు కాళ్ళను కట్టుకుని, తలకిందులుగా కట్టుకుని తపస్సు చేసుకుంటూ శనివారం నగరంలో సుమంత్ అనే సమైక్యవాది నిరసన వ్యక్తం చేశాడు. నగరంలోని స్థానిక రఘువీరా టవర్ వద్ద నుండి సప్తగిరి సర్కిల్, టవర్‌క్లాక్, ఓవర్ బ్రిడ్జి వద్ద జరుగుతున్న శిబిరాలకు మద్దతును తెలియజేసాడు. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే తలకిందులుగా తపస్సు చేసినా రాష్ట్రం అభివృద్ధి చెందలేదనే విధంగా ప్రజలకు తెలియజేసానన్నారు. ఈ కార్యక్రమంలో రఘువీరా టవర్స్‌లోని వివిధ షాపుల యాజమానులు, సమైక్యవాదులు పాల్గొన్నారు.
డిఆర్‌డిఎ-ఐకెపి ఉద్యోగుల ఆధ్వర్యంలో..
డిఆర్‌డిఎ-ఐకెపి ఉద్యోగుల ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద జరుగుతున్న నిరవధిక దీక్షలలో డిఆర్‌డిఎ-ఐకెపి ఉద్యోగులు కొనసాగించారు. కార్యక్రమంలో ఐకెపి మహిళలు, డిఆర్‌డిఎ-ఐకెపి ఉద్యోగులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకని మృతి..
బత్తలపల్లి, సెప్టెంబర్ 7: అనంతపురం- కదిరి జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని ఉప్పర్లపల్లి బస్ స్టాప్‌కు సమీపంలోనున్న చిత్రావతి నది వద్ద మలుపులో నల్లమాడ మండలం యర్రవంకపల్లి తాండాకు చెందిన గోపి నాయక్(45) తన కుమారుడు సాయితేజతో కలిసి ద్విచక్ర వాహనంలో అనంతపురం వెళ్తుండగా మదనపల్లికి టమోటాతో వెళ్తున్న టాటాఏస్ ఆటో వాహనం ఢీకొంది. ప్రమాదంలో గోపినాయక్ అక్కడికక్కడే మృతి చెందగా కుమారుడు సాయితేజకు తీవ్రంగా గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి
పామిడి, సెప్టెంబర్ 7: వ్యవసాయ మడిలో వరినాట్లు వేస్తున్న క్రమంలో మోటర్ ఫీజ్ పోవటం కారణంగా ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్ళి ఎబి స్విచ్‌ను పట్టుకోవటంతో విద్యార్థి నరేంద్ర (20) విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శనివారం మండల పరిధిలోని కండ్లపల్లి గ్రామానికి సమీపంలో వున్నటువంటి పెన్నా నది ఒడ్డున కొప్పలకొండ దారిలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబందించి మృతుని బంధువులు తెలిపిన వివరాలిలా వున్నాయి. కండ్లపల్లి గ్రామానికి చెందిన లక్ష్మిదేవి, శంకర్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానమన్నారు. కళ్యాణదుర్గంలో డిప్లొమా సెకెండ్ ఇయర్ చదువుతున్న నరేంద్ర మడిలో వరినాట్లు వేయడానికి వెళ్ళారని ఇంతలో మోటర్ ఆగిపోవడంతో ఫీజు పోయిందంటూ కొప్పలకొండ దారిలోని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫీజును వేయడానికి ఎబి స్విచ్‌ను పట్టుకోగా విద్యుత్‌షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.
బాలిక అపహరణయత్నం విఫలం
హిందూపురం, సెప్టెంబర్ 7: హిందూపురం పట్టణంలో 12 ఏళ్ల బాలిక అపహరణయతాన్ని స్థానికులు అడ్డుకున్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఈ సంఘటన జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఇంటింటికి మినరల్ వాటర్ క్యాన్లు అందజేసే రవి, శ్రీరాములు శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఓ ఇంట్లో నీళ్ల క్యాన్ దించి అక్కడే ఉన్న బాలిక(12)ను గణపతి విగ్రహాలు చూపిస్తామని మభ్యపెట్టి అదే ఆటోలో తీసుకువెళ్లారు. ఆటో ఆటోనగర్‌వైపు వెళ్తుండగా బాలిక ఏడుపు లఘించుకుంది. అదే సమయంలో ఆటుగా మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఓ వ్యక్తి వీరిని అడ్డుకుని బాలిక ఎవరని ప్రశ్నించారు. తమ అమ్మాయినని వారు నమ్మబలకగా, బాలిక కాదని గట్టిగా ఏడ్చింది. దీంతో చుట్టుపక్కలవారు పోగై వారిని నిలదీశారు. ఇంతలో సమాచారాన్ని 2వ పట్టణ పోలీసులకు అందించారు. సమాచారం అందుకున్న 2వ పట్టణ పోలీస్‌స్టేషన్ సిఐ ఇదుర్‌బాషా హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని జరిగినదానిపై విచారణ జరిపారు. బాలికను ప్రశ్నించిన మీదట రవి, శ్రీరాములను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వీరిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.
తేలు కాటుకు యువకుడి మృతి
వజ్రకరూరు, సెప్టెంబర్ 7: మండల పరిధిలోని గూళ్లపాళ్యం గ్రామంలోని శేఖర్ (28) శనివారం తేలు కాటుకు గురై మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాలు.. శనివారం ఉదయం పొలానికి గట్టు వేస్తుండగా తేలు కాటుకు గురయ్యాడు. దీంతో అతడికి తీవ్రమైన చలి జ్వరం, వాంతులు కావడంతో గుంతకల్లు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇతడికి భార్య అనంతలక్ష్మీ, కుమారుడు వున్నట్లు తెలిపారు.
* టివిలకు అతుక్కుపోయిన ప్రజలు
english title:
s
Date:
Sunday, September 8, 2013