విశాఖపట్నం, సెప్టెంబర్ 8: కోరిన కోరికలు తీర్చే వినాయకునికి ఈసారి సమైక్య కష్టాలే మిగులుతున్నాయి. పేద, మధ్యతరగతి ప్రజానీకం వినాయక చవితిని ఆనందంగా చేసుకునే పరిస్థితులు ఎక్కడా కనిపించడంలేదు. నిత్యావసర సరకులు మండిపోతున్నాయి. మరో పక్క ఆర్టీసీ బస్సులు 26 రోజులుగా నిలిచిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగులకు నెల రోజులుగా జీతాల్లేవు. ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు, నిర్మాణ కార్మికుల పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు. నెల రోజులు కష్టించి పనిచేసిదంతా ఆటోలు దోచుకుంటున్నాయి. కనీస చార్జీలు పది రూపాయలు చేసేశారు. ఇక పూజా సామగ్రి ధరలు సామాన్యులకు షాక్‌నిస్తున్నాయి. బియ్యం, పప్పులు, నూనెల ధరలు ఆకాశాన్నింటాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సగటు జీవి పరిస్థితి కనాకష్టంగా ఉంది. వినాయకునికి నైవేద్యం పెట్టే చమురు, పండ్ల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో వీటి గురించి మాట్లాడలేకపోతున్నారు.
వినాయక చవితి పండుగ చేసుకునేందుకు సామాన్యులు సాహసించడంలేదు. ఎందుకంటే ఎంత సాదాసీదాగా చేసుకోవాలన్నా నలుగురితో కూడిన కుటుంటానికి కనీసం వెయ్యి రూపాయలు ఉండాల్సిందే. కిలో బియ్యం రూ.50లు, కిలో ఉల్లి 50 నుంచి 60 వరకు పలుకుతోంది. పచ్చిమిర్చి, అల్లం కిలో ధరలు చూస్తే వంద రూపాయలకు మించిపోయాయి. బీర, ఆనప, చేమ, పొటల్స్, కాకర, ఆగాకర, బెండ, దొండ, అరటికాయలు కిలో రూ.40 పైగానే అమ్ముడుపోతున్నాయి. నూనెలు, పప్పులు దాదాపు వందకు చేరుకున్నాయి. వినాయకుని పూజా సామగ్రికి కనీసం రూ.100 నుంచి 200 వరకు చెల్లించాల్సిందే.
వీధుల్లో కనిపించని సందడి
ఈసారి వీధుల్లో వినాయకుని పందిళ్ళు పల్చబడ్డాయి. ఎక్కడపడితే అక్కడ వినాయకుని పందిళ్ళు విద్యుత్‌కాంతులతో, ఆకర్షణీయంగా దర్శనమిచ్చేవి. పలు రకాలైన పూలజాతులు, పండ్లతో వినాయకుని అలంకరించేవారు. సమైక్య ఉద్యమం, రవాణా సౌకర్యం లేకపోవడం, ఉద్యోగులకు జీతాలు లేకపోవడం వంటి అనేక కారణాలతో ఈ పరిస్థితి నెలకొంది. చందాల వసూళ్ళు సమస్యగా మారింది. చవితి ఉత్సవ నిర్వాహకులు కాస్త వెనక్కి తగ్గుతున్నారు. అందువల్ల విశాఖలో వినాయక పందిళ్ళు అంతంత మాత్రంగానే వెలుస్తున్నాయి.
27రోజులుగా రోడ్డెక్కని ఆర్టీసీ
సమైక్య ఉద్యమంలో భాగంగా ఆర్టీసీ కార్మికులు 27 రోజులుగా సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో విశాఖ జిల్లాలో తొమ్మిది డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. ఒక్క బస్సు కూడా రోడ్డెక్కలేదు. 5500 మందికి పైగా ఎన్‌ఎంయు, ఎంప్లారుూస్ యూనియన్ల కార్మికులు సమ్మెకు దిగారు. దీనివల్ల రోజుకి రూ.80 నుంచి 90 లక్షల మేర సంస్థ తన ఆదాయాన్ని కోల్పోతోంది. ఈ విధంగా ఇప్పటి వరకు 26కోట్లకు పైగానే నష్టం వాటిల్లింది. ఒకవైపు సంస్థ ఆదాయాన్ని కోల్పోగా మరోపక్క గత నెల 15వ తేదీ నుంచి కార్మికులకు జీతాల్లేవు. కాగా 50కి పైగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, సిబ్బంది పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. రెవెన్యూ, ఎపి ఎన్జీవోలు, పంచాయితీరాజ్, నీటిపారుదల, ఖజనా, వైద్య, పశుసంవర్ధక, వ్యవసాయ శాఖలకు చెందిన వేలాది మంది ఉద్యోగులకు జీతాల్లేక వినాయక చవితి చేసుకునేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గాజువాకలో గణేశ ఉత్సవాలు
గాజువాక, సెప్టెంబర్ 8: వినాయక ఉత్సవాల్లో భాగంగా గాజువాక లంకావారి మైదానంలో ఏర్పాటు చేసిన 77 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని సోమవారం ఉదయం 11.10 నిమిషాలకు ప్రతిష్టించేందుకు పురోహితులు ఏర్పాట్లు చేస్తున్నారు. గాజువాక కెఎన్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 77 అడుగుల భారీ వినాయకుడు రాష్ట్రాన్నికే ప్రత్యేక నిలుస్తాడని ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ కర్నంరెడ్డి నర్సింగరావు తెలియజేశారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి స్పూర్తిగా ఈ భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వినాయక చవితి సందర్భంగా గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య చేతుల మీదగా తొలి పూజ నిర్వహించే విధంగా ఏర్పాటు చేసినట్లు నర్సింగరావు తెలిపారు. 21 రోజుల పాటు స్వామి వారికి పూజలు నిర్వహించి అనంతరం నిమజ్ఞం చేసే కార్యక్రమాన్ని కమిటీ చేపడుతుంది. ఉత్సవాల్లో భాగంగా సమైక్యాంధ్ర వ్యతిరేకలు కోసం యమపురి భారీ సెట్టింగ్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతీ ఒక్కరినీ ఆకుట్టుకుంటుంది. గత ఐదేళ్ల నుండి గాజువాక కేంద్రంగా భారీ వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. సుమారు 5లక్షల మేర భక్తులు దర్శించుకునే అవకాశం ఉంటుందని కమిటీ ప్రతినిధులు అంచనా వేస్తుంది. తొలి పూజ కార్యక్రమానికి మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు రాజ్యసభ సభ్యులు టి.సుబ్బిరామిరెడ్డిలు హాజరుకానున్నట్లు కెఎన్‌ఆర్ తెలియజేశారు. అలాగే వడ్డపూడిలో 36 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని మహాగణపతి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు.
వినాయక విగ్రహాల నిమజ్జనలో
పోలీసు నిబంధనలు
విశాఖపట్నం, సెప్టెంబర్ 8: వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని ఆర్.కె.బీచ్‌లో వినాయక విగ్రహాలను నిమజ్జనానికి సంబంధించి ఈ నెల 9వ తేదీ నుండి 19వ తేదీ వరకు పోలీసులు నిబంధనలను విధించారు. వినాయక విగ్రహాలను తీసుకుని వచ్చే వాహనాలన్ని సిరిపురం జంక్షన్ చేరుకుని, సిఆర్ స్క్వేర్, ఎయు ఆవుట్ గేటు, పార్కు హోటల్ మీదుగా విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఎ.యు.ఉమెన్స్ హాస్టల్ ఎదురుగా ఆర్.కె.బీచ్‌లో నిర్ధేశించిన ప్రదేశానికి తీసుకుని రావాలి. సర్వీసు రోడ్డులో నుండి వెళ్లి విగ్రహాలను నిమజ్జనానికి దించి, గోకుల్ పార్కు వద్ద గల ర్యాంపు నుండి వాహనాలను తీసుకుని వెళ్ళాలి. నిమజ్జనం తర్వాత వాహనాలన్ని ఎన్‌టిఆర్ విగ్రహం నుండి ఎఐఆర్ జంక్షన్ వయా సిఆర్‌రెడ్డి స్క్వేర్ మీదుగా గేటు వే హోటల్ జంక్షన్ నుండి పందిమెట్ట , కోర్టు జంక్షన్ మీదుగా తిరిగి వెళ్ళిపోవాలి. బీచ్‌రోడ్డు వైపు నివసించే ప్రజలు ఈనెల 9 నుండి 19వరకు మధ్యాహ్నం నాలుగు గంటల నుండి బీచ్‌రోడ్డు వైపు రాకుండా ప్రత్యామ్నయ మార్గం ఉపయోగించుకోవాలి. వినాయక ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల నుండి నిమజ్జనం, వాహనం పోవు మార్గం అనుమతి తీసుకుని, పోలీసులు సూచించిన రూటులోనే వెళ్లి నిమజ్జనం చేసి, తిరిగి గమ్యస్థానాన్ని చేరుకోవాలి. ఉత్సవ నిర్వాహకులు పైన పేర్కొన్న తేదీల్లో రాత్రి 11గంటలలోనే నిమజ్జనం కార్యక్రమం పూర్తి చేసుకోవాలి. నిమజ్జన వాహనాలు తప్పనిసరిగా రవాణా శాఖ జారీ చేసిన ఫిట్‌నెస్ సర్ట్ఫికేట్‌ను కలిగి ఉండాలి. నిమజ్జన వాహన డ్రైవర్లు మద్యం, మత్తు మందులను సేవించి డ్రైవింగ్ చేయరాదు.
నగరంలో చవితి సందడి
విశాలాక్షినగర్, సెప్టెంబర్ 8: నగరంలో వినాయక చవితి సందడి మొదలైంది. గణనాథుడి పండగను జరుపుకోవడానికి భక్తులు ఆదివారం నగరంలోని పలు కూడళ్ళ వద్ద పూజా సామగ్రి కొనుగోళ్ళకు వెళ్ళారు. దీంతో మార్కెట్లు జనసంద్రంగా మారాయి. వినాయకుడి ప్రతిమతో పాటు వివిధ రకాల పండ్లు, పత్రి, పూలు, పూజ సామగ్రి కొనుగోళ్లతో మార్కెట్లు భక్తులతో కిటకిటలాడాయి. గత ఏడాది కంటే ఇప్పుడు ధరలు అధికంగా ఉన్నాయని భక్తులు చెబుతున్నారు. పూలధరలు ఆకాశాన్ని అంటినప్పటికీ నగరంలోని రైతుబజార్లలో 60 టన్నుల పూలు అమ్మకాలు జరిగినట్లు అదికారులు వెల్లడించారు. ఏడాదిలో మొదటి పండుగ వినాయకచవితిని భక్తిశ్రద్ధలతో జరుపుకుని ఎటువంటి విఘ్నాలు లేకుండా కుటుంబాలు చల్లగా ఉండాలని భక్తులు పండుగను వైభవంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పూర్ణామార్కెట్, కురుపాం మార్కెట్, నగరంలో ఉన్న 12 రైతుబజార్లలో పత్రికి డిమాండ్ పెరిగింది. గణనాథుని 21 రకాల పత్రులతో పూజించే సాంప్రదాయం కొనసాగుతోంది. మాచి, వాకుడు, గరిక, మారేడు, రేగు, ఉత్తరేణి, తులసి, ఉమ్మెత్త, మామిడి, విష్ణుక్రాంతి గనే్నరు, దానిమ్మ, మరువం, వావి, జాతి, జమ్మి, రావి, ఏనుగుచెవి, దేవదారు, మర్రి, జిల్లేరు వంటి చెట్లు, మొక్కల ఆకులను వినియోగిస్తారు. అన్నిరకాల పత్రి అందుబాటులో లేనప్పటికీ కొన్ని రకాల ఆకులు మార్కెట్‌లో అమ్మకానికి వర్తకులు అందుబాటులో ఉంచారు. నగరంలోని పెద్ద, చిన్న పందిళ్లు వెలిసాయి. పందిళ్ళను వివిధ రకాల రూపాల్లో తీర్చిదిద్ది, విద్యుద్దీపాల అలంకరణతో గణనాధుని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.
‘లక్షగళ గర్జన విజయవంతం చేయాలి’
అనకాపల్లి, సెప్టెంబర్ 8: ఈ ప్రాంత చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో ఒకేమాట ఒకేబాటగా రాజకీయాలకు అతీతంగా లక్షగళ గర్జన కార్యక్రమాన్ని సమైక్యాంధ్ర సాధన కోసం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్లు అనకాపల్లి సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ చైర్మన్ మాదేటి పరమేశ్వరరావు తెలిపారు. ఈనెల 11న అనకాపల్లిలో సమైక్యాంధ్ర సాధన కోసం నిర్వహించే ఈ నిరసన కార్యక్రమం ద్వారా దిక్కులు పిక్కటిల్లనున్నాయని ఢిల్లీవరకు ఆంధ్రు ల వాణి వినిపించేందుకు ఈ నిరసన ఒక గొప్పవేదిక కాగలదని ఆయన తెలిపారు. అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో అన్ని వర్గాల వారిని అనూహ్య రీతిలో సమీకరించేందుకు ఇప్పటికే వివిధ వర్గాల వారు ప్రజల్లో విస్క్రత ప్రచారం నిర్వహిస్తున్నారని అనకాపల్లి పట్టణ దేశం అధ్యక్షులు బుద్ధ నాగజగదీష్ తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమనాయకులు పరకాల ప్రభాకర్ ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేస్తున్నట్లు డైట్ కళాశాల కరస్పాండెంట్ దాడి రత్నాకర్ తెలిపారు. సమైక్యాంధ్ర ఆవశ్యకతను తెలియజేస్తూ ఈ వేదికలో పలు సాంస్క్రతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పట్టణ వైసీపి నేత జానకిరామరాజు తెలిపారు. స్థానిక మున్సిపల్ గ్రౌండౌలో ఉదయం 9నుండి మధ్యాహ్నం 12గంటల వరకు జరిగే ఈ నిరసన కార్యక్రమానికి సమైక్యాంధ్ర కోసం పదవులకు రాజీనామా చేయని నేతలను అనుమతించబోమని సంఘ సేవకులు మళ్ల సురేంద్ర, మాజీ మున్సిపల్ చైర్మన్ కడిమిశెట్టి రాంజీ తదితరులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మందపాటి జానకిరామరాజు, బిఎస్‌ఎంకె జోగినాయుడు, మళ్ల అబ్బాయినాయుడు, జాజుల రమేష్, మద్దుల వేణు తదితరులు పాల్గొన్నారు.
రిలే నిరాహార దీక్షలు
యలమంచిలి : సమైక్యాంధ్ర కోరు తూ యలమంచిలిలో ఆదివారం పలు రాజకీయ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, సామాజిక సంఘాలు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఉపాధ్యాయ జెఎసి నాయకులు బి.లక్ష్మణరావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడితే ఆంధ్ర ప్రాంతంలో రాజ్యం లేని రాజుపాలన ఏర్పడుతుందని ఏద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు ఎస్‌విఎస్‌ఎన్ రాజు అల్లూరి సీతారామరాజు వేషాధారణతో నిరసన తెలియజేస్తు పలువురిని ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో ఎఎన్‌ఎస్‌ఎఎన్ మూర్తి, ఎన్‌వి సూర్యనారాయణ, ఎ రత్నరాజు, ఎవిఎన్ మూర్తి, ఎస్. సన్యాసినారావు పాల్గొన్నారు. అలాగే జెఎసి చేపట్టిన దీక్షల్లో శిష్టికరణం సంఘం నాయకులు దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా నాయకులు ఎస్‌ఎంకె మహాంతి, జెసి ప్రభాకర్, మల్లికార్జునరావులు మాట్లాడుతూ సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం కావడంతో సమైక్య వాదం మరింత బలపడిందన్నారు. ఈ కార్యక్రమంలో జెఎసి కన్వీనర్ సోమేశ్వరరావు, ఓరుగంటి విద్యాసాగర్, వనం నాగేశ్వరరావు, కొఠారు సాంభ పాల్గొన్నారు. తెలుగు దేశం శిభిరంలో సోమలింగపాలెం కార్యకర్తలు దీక్షల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యల్లపు శ్రీనివాసరావు, కోరిబిల్లి సత్యనారాయణ, టి. సోమేశ్వరరావు, బొడ్డేడ అప్పారావు పాల్గొన్నారు.
నియోజకవర్గం అభివృద్ధికి రూ. మూడు కోట్లు మంజూరు
నర్సీపట్నం, సెప్టెంబర్ 8: నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు చేపట్టే స్పెషల్ డెవలప్‌మెంట్ నిధుల నుండి మూడు కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి మంజూరు చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే బోళెం ముత్యాలపాప వెల్లడించారు. ఆదివారం సాయంత్రం స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నిధుల నుండి కోటి రూపాయలు మున్సిపాలిటికి,రెండు కోట్ల రూపాయలు నాలుగు మండలాలకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. నర్సీపట్నం నుండి కృష్ణాదేవిపేట వరకు 26 కిలో మీటర్ల ఆర్. అండ్.బి. రోడ్డు విస్తరణకు ఐదు కోట్ల రూపాయలు మంజూరయ్యాయన్నారు. వేములపూడి సమీపంలోని మువ్వలగెడ్డపై వంతెన నిర్మాణానికి కోటి 15 లక్షల రూపాయలు విడుదల అయ్యాయని వివరించారు. తాండవ సుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని గునిపూడి వద్ద చెరుకు కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు సి. ఎం. 35లక్షల రూపాయలు విడుదల చేసారన్నారు. ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు వీలుగా సుగర్ ఫ్యాక్టరీలు ఆధునీకరించేందుకు ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేసారన్నారు. త్వరలోనే కొనుగోలు కేంద్రంకు శంకుస్ధాపన చేయనున్నట్లు తెలిపారు. నర్సీపట్నం మెయిన్‌రోడ్డులో కృష్ణా బజార్ నుండి పెదబొడ్డేపల్లి వరకు డ్రైనేజీల నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రికి నివేదిక అందజేసామన్నారు. వీటికి అవసరమైన ప్రతిపాదనను పంపించాలని సి. ఎం. ఆర్. అండ్.బి. ఉన్నతాధికారులను ఆదేశించారన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల తాగునీటి ఇబ్బందులను తొలగించే 85 కోట్ల రూపాయల అంచనాతో ముఖ్యమంత్రికి ప్రతిపాదన అందజేసామన్నారు. ఈ ప్రతిపాదనను సి. ఎం. అమోదించి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించారని , త్వరలోనే నిధులు మంజూరవుతాయని ఎమ్మెల్యే వివరించారు. నర్సీపట్నంలో అసంపూర్తిగా ఉన్న షాదిఖానా పూర్తి చేసేందుకు 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయన్నారు.
ఎవరి ఆస్తులు ఎంతో తేల్చుకుద్దాం
అయ్యన్నపాత్రుడు ఆస్తులు ఎంతో, తమ ఆస్తులు ఎంతో తేల్చుకునేందుకు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే ముత్యాలపాప సవాల్ చేసారు. ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నట్లు అయ్యన్నపాత్రుడు పలు సభల్లో చేస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. రాజకీయాల్లోకి రాకముందు అయ్యన్న కుటుంబ సభ్యుల పేరున ఎంత ఆస్తులు ఉన్నాయో, తాము రాజకీయాల్లోకి వచ్చేనాటికి తమ కుటుంబ సభ్యుల పేర్లతో ఎంత ఆస్తులు ఉన్నాయో రికార్డులతో సహా తేల్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముత్యాలపాప స్పష్టం చేసారు. అలాగే ఇద్దరి ఆస్తులపై సి.బి. ఐ. విచారణకు సిద్ధం కావాలని అయ్యన్నపాత్రుడికి సవాల్ విసిరారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నిరాహార దీక్షలు చేస్తున్న మహిళల సమక్షంలో ప్రజాప్రతినిధినైన తన పట్ల అసభ్యపదజాలంతో మాట్లాడడం ఎంత వరకు సమంజసమో అయ్యన్నపాత్రుడు విజ్ఞతకే వదిలివేస్తున్నానన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో మహిళల పట్ల ఎంత గౌరవం ఉందో అర్ధమవుతుందన్నారు. తెలుగుదేశం పార్టీకి 30 సంవత్సరాల పాటు సేవ చేసామని, తమ స్వయం కృషితో వేములపూడి గ్రామాన్ని అభివృద్ది చేసుకున్నామన్నారు.మూడు దశాబ్దాలు తమ ప్రాంత ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా, మంత్రిగా గెలుపొందిన అయ్యన్నపాత్రుడు వేములపూడి గ్రామానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. ఈసమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రుత్తల యర్రాపాత్రుడు, మీసాల సుబ్బన్న, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గొలుసు నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
తల్లీకొడుకు దుర్మరణం
అనకాపల్లి, సెప్టెంబర్ 8: రోడ్డుప్రమాదంలో బైక్‌పై వస్తున్న తల్లీకొడుకులు ఇరువురు దుర్మరణం చెందారు. పట్టణంలోని సుంకరిమెట్ట జంక్షన్ సమీపంలో ఆదివారం ఉదయం ఈ ఘోరప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుండి కోటపాడు మండలంలోని చౌడువాడకు బైక్‌పై వెళుతున్న తోట నానాజీ (25) ఆయన తల్లి తోట పైడమ్మ (45)లు వెనుకనుండి వచ్చిన లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే విశాఖపట్నంలోని మల్కాపురం క్రాంతి కాలనీకి చెందిన తోట నానాజీ చౌడువాడలో ఉన్న తన అమ్మమ్మ ఆరోగ్యం బాగోలేకపోవడంతో చూసేందుకు తల్లితోపాటుగా బైక్‌పై బయలుదేరాడు. సొంతంగా బైక్‌లేకపోవడంతో స్నేహితుడిని ఆ బైక్ అడిగి తల్లిని తీసుకుని వస్తుండగా సుంకరిమెట్ట జంక్షన్‌లో ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి పడిపోయాడు. అదే సమయంలో యలమంచిలి నుండి పెందుర్తి వైపు వెళుతున్న లారీ వెనుకనుండి వచ్చి ఢీకొట్టింది. ఈ సంఘటనలో తల్లీకొడుకులిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. షిప్‌యార్డులో నానాజీ ఒక ప్రైవేటు కాంట్రాక్టర్ దగ్గర వెల్డర్‌గా పనిచేస్తున్నారు. వివాహం కాలేదు. పైడమ్మకు నానాజీ ఒక్కడే కొడుకు. గత కొన్ని రోజులుగా పెళ్లిసంబంధాలు చూస్తున్నారు. నానాజీ తండ్రి అప్పారావు ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉండే కొడుకుతోపాటు తల్లికూడా దుర్మరణం చెందడంతో వారి కుటుంబ సభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అనకాపల్లి సర్కిల్ ఇనస్పెక్టర్ శ్రీనివాసరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సమైక్యాంధ్ర సాధించే వరకూ
ఉద్యమం ఆగదు
నర్సీపట్నం, సెప్టెంబర్ 8: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని యు.పి.ఎ. చైర్ పర్సన్ సోనియాగాంధీ హామీ ఇచ్చే వరకు సీమాంధ్రలో ఉద్యమం ఆగదని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆదివారం ఉదయం పట్టణంలోని సిటీ క్లబ్ ఆవరణలో సమైక్యాంధ్రకు మద్దతుగా లక్ష్మీ కుంకుమపూజలు, శాంతి హోమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ సోనియాగాంధీ రాష్ట్రాన్ని విభజన నిర్ణయం నుండి మనస్సు మారి సమైక్యాంధ్రగా కొనసాగాలని లక్ష్మీ కుంకుమపూజలు, శాంతిహోమం నిర్వహిస్తున్నామన్నారు. ఎ.పి. ఎన్జీవోలు హైదరాబాద్‌లో సమైక్యాంధ్రకు మద్దతుగా నిర్వహించిన సభ విజయవంతమైందని, దీని ద్వారా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారనే నమ్మకం సీమంధ్రుల్లో వచ్చిందన్నారు. హైదరాబాద్ సభ ముగించుకుని తిరిగి వస్తున్న వారిపై టి. ఆర్. ఎస్. శ్రేణులు దాడులు చేయడం సరైంది కాదన్నారు. 14 సంవత్సరాలు టి.ఆర్.ఎస్.వాళ్ళు తెలంగాణాపై ఉద్యమాలు చేస్తే సీమాంధ్రులు ఎక్కడా ఎటువంటి దాడులకు పాల్పడలేదన్నారు.
హైదరాబాద్‌లో శాంతియుతంగా సభ నిర్వహించుకుని తిరిగి వస్తున్న వారిపై దాడులు చేయడం సరైంది కాదన్నారు. అవసరమైతే మేము కూడా వంతుకు వంతు రుణం తీర్చుకోగలమని ఆయన తెలంగాణా వాదులను హెచ్చరించారు. లక్ష్మీకుంకుమపూజలు, శాంతి హోమాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యన్న పాత్రుడు సతీమని పద్మావతి మొదటగా పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో రాజకీయ జె. ఎ.సి. కన్వీనర్ చింతకాయల సన్యాసిపాత్రుడు, పలువురు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వినాయక చవితితో కళకళలాడిన దుకాణాలు
సబ్బవరం, సెప్టెంబర్ 8: హిందువులకు అతి పవిత్రమైన తొలి తెలుగు పండుగ వినాయక చవితి సందర్భంగా ఆదివారం వినియోగదారులతో దుకాణాలు కళకళలాడాయి. ఈ సందర్భంగా వినాయక వ్రత సంకల్పానికి కావాల్సిన రకరకాల పూలు,పత్రి,పాలవెల్లి, వినాయక విగ్రహాలను కొనుగోలు చేసేందుకు వివిధ గ్రామాల నుంచి వినియోగదారులు రావటంతో దాదాపు అన్ని దుకాణాలు కొనుగోలు దారులతో కిటకిటలాడాయి. అయితే ప్రస్తుతం అన్ని ముడి సరుకుల ధరలు ఆకాశాన్నంటడంతో విగ్రహాలు,పూలు,పండ్లు,పత్రి ధరలు కూడా ప్రియంగానే ఉన్నాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. పండగ వాతావరణంతో అన్నిదుకాణాల వద్ద సందడి నెలకొందనటంలో ఎలాంటి సందేహం లేదు.
క్షుద్రపూజల వదంతులతో బోసిపోయిన దారాలమ్మ ఆలయం
సీలేరు, సెప్టెంబర్ 8: దారకొండ దారాలమ్మ ఆలయంలో గత మూడు నెల నుంచి క్షుద్రపూజలు, నరబలి జరిగిందన్న వందతులతో దారకొండ ప్రజలు ఆలయానికి వచ్చే భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గత రెండు రోజుల నుండి దారకొండ ఆలయ ప్రాంగణానికి భక్తులు వచ్చేందుకు సాహసించడం లేదు. దారకొండ ఆలయ సమీపంలో వ్యక్తి మృతదేహం పూడ్చివేత, ఒక మహిళ అస్ధిపంజరం వెలుగుచూడడంతో దారకొండ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఈనేపధ్యంలో దారకొండ సర్పంచ్, ఆలయ కమిటీ చైర్మెన్ గడుతూరి గోపాలకృష్ణ, సీలేరు పోలీస్ స్టేషన్‌కు ఆదివారం సాయంత్రం వచ్చి ఫిర్యాదు చేసారు. ఈరెండు మృత దేహాలపై దర్యాప్తు జరిపి ఆ మృతదేహాలు ఎవరివో అనేది నివృత్తి చేయాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేసి వివరాలు వెల్లడిస్తామని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. అదే విధంగా క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారనే వందతులపై విచారణ నిర్వహిస్తామన్నారు. దీనిపై ప్రజలెవ్వరూ భయపడరాదని తెలిపారు.
* బోసిపోయిన దారాలమ్మ ఆలయం
గత మూడు రోజుల నుంచి దారాలమ్మ ఆలయంలో క్షుద్రపూజలు , నరబలి జరిగాయన్న వదంతులతో భక్తులు దారాలమ్మ ఆలయాన్ని దర్శించేందుకు భయపడుతున్నారు. దీంతో ఆలయం పూర్తిగా బోసిపోయింది. ప్రతీ ఆదివారం మైదాన ప్రాంతాల నుంచి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చేవారు. ఈ వదంతులతో దారాలమ్మ ఆలయం బోసిపోయింది.
పిచ్చికుక్కల స్వైర విహారం : 28మంది ఆసుపత్రి పాలు
చోడవరం, సెప్టెంబర్ 8: పిచ్చికుక్కలు స్వైరవిహారం చేయడంతో 28మంది ఆసుపత్రుల పాలైన సంఘటన మండలంలోని లక్కవరం గ్రామంలో శనివారం సంభవించింది. గ్రామంలోని కాపువీధి, వెలమవీధి తదితర ప్రాంతాల్లో రెండు పిచ్చికుక్కలు దారిలో పోతున్న పాదచారులను, ఆడుకుంటున్న పిల్లలను తీవ్రంగా గాయపర్చాయి. కళ్లాలకు వెళుతున్న రైతులపై కూడా దాడి చేయడంతో 28మంది వరకు గ్రామస్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ కుక్కల దాడిలో గాయపడిన వారందరినీ 108 అంబులెన్సులో ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రధమ చికిత్సలు నిర్వహించారు.
వీరిలో కొప్పు షర్మిల (8) కంఠంపై తీవ్రగాయాలపాలవడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆ పాపను అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో తాటికొండ జగన్నాథం, నాగిరెడ్డి వరహాలమ్మ, కన్నంరెడ్డి నర్సింగరావు, పెంటకోట ప్రసాద్, ఎ. మోహన్, రావాడ పైడితల్లమ్మ, కర్రి సంజయ్‌కుమార్, పల్లి కృష్ణవేణి, ఒ. రాము, రాజాన వాసులకు స్థానిక ప్రభుత్వాసపత్రిలో చికిత్సలు నిర్వహించారు. మిగిలిన వారు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించారు.