బుచ్చిరెడ్డిపాళెం, సెప్టెంబర్ 8 : రాష్ట్ర విభజనపై తమ పార్టీకి ఎలాంటి అభ్యంతరాలు లేవని యూపిఏ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లేఖను ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వెనక్కు తీసుకోవాలని నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్ కుమార్తె షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం కార్యక్రమంలో భాగంగా బుచ్చిరెడ్డిపాళెంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనలో ఉన్న అనేక సమస్యల పరిష్కారాన్ని టిడిపి చర్చించకుండా విభజనకు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా తమ పార్టీ తప్పుడు నిర్ణయం తీసుకుందని లెంపలు వేసుకుని ఆ లేఖను వెనక్కు తీసుకోవాలని ఆయన చంద్రబాబుకు సూచించారు.
లింకులు పెట్టుకునేది చంద్రబాబే: ప్రసన్న
రాజకీయ మనుగడ కోసం ఇతర పార్టీలతో లింకులు పెట్టుకునే అలవాటు టిడిపి అధినేత చంద్రబాబునాయుడుదేనని ప్రసన్న తిప్పికొట్టారు. షర్మిల సమైక్య శంఖారావ సభలో ఆయన మాట్లాడుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇడుపుల పాయ నుండి ఢిల్లీకి లింకులు పెట్టుకున్నారని చంద్రబాబు చేస్తున్న బూటకపు మాటలను ప్రజలు నమ్మబోరన్నారు. ఒక వేళ అలాంటి లింకు తమ పార్టీ పెట్టుకుని ఉంటే తమ నాయకుడు జగన్ జైల్లో ఎందుకు ఉంటారని ప్రశ్నించారు. చంద్రబాబు బస్సు యాత్రను శవయాత్రగా అభివర్ణించారు. నేదురుమల్లి పద్మనాభరెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్ చనిపోలేదని, చంపేశారన్న విషయం అందరికి తెలుసన్నారు. జగన్‌ను నుంచి కాంగ్రెస్ భయపడి ఆయనను జైల్లో పెట్టిందన్నారు. జగన్ తప్పు చేయలేదు కాబట్టే ఇంతవరకు శిక్షపడలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు మేరిగ మురళీ, మేకపాటి చంద్రమోహన్‌రెడ్డి, కొమ్మి లక్ష్మయ్యనాయుడు, కాకాణి గోవర్థన్‌రెడ్డి, స్థానిక నాయకులు మేనకూరు సీతారామిరెడ్డి, సూరా శ్రీనివాసులురెడ్డి, అల్లాభక్షు, జూగుంట స్నేహలత, మల్లారెడ్డి, కోడూరు సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
షర్మిల బస్సుపై నుంచి పడిన నేత
* పరిస్థితి ఆందోళనకరం
బుచ్చిరెడ్డిపాళెం, సెప్టెంబర్ 8 : సమైక్యశంఖారావం సభకు విచ్చేసిన షర్మిల బస్సుపై నుండి ఓ నాయకుడు ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని ఇసుకపాళెం గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోడూరు సుధాకర్‌రెడ్డి షర్మిల బస్సు ఏర్పాటు చేసిన వేదికపై ఉన్నాడు. బస్టాండ్ సెంటర్‌లో సభ ముగిసిన అనంతరం చెన్నూరు రోడ్డు మీదుగా షర్మిల బస్సు యాత్ర కొనసాగుతుండగా వినాయకుని గుడి వద్ద పందిరి ఏర్పాటుచేసి ఉండడంతో అందరూ బస్సు మీద కూర్చున్నారు. పందిరి దాటిన అనంతరం లేచి నిలబడేందుకు సుధాకర్‌రెడ్డి ఒక చేతిని బస్సు పైభాగంలో అమర్చిన స్పీకర్ బాక్సుపై వేసి లేవబోయాడు. ఆ బరువుకు స్పీకర్ బాక్సు జారిపోవడంతో అతను వెనక్కు పడిపోయాడు. దీంతో సుధాకర్‌రెడ్డి తలకు తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన 108 అంబులెన్స్‌లో నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అక్కడి వైద్యుల సూచనల మేరకు చెన్నైకు తరలించనున్నట్లు ఆసుపత్రివర్గాలు తెలిపాయి. కాగా సుధాకర్‌రెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి సమీప బంధువు.