Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సమెక్య సూక్ష్మ వినాయక ప్రతిమ తయారు

$
0
0

నెల్లూరు, సెప్టెంబర్ 8: నెల్లూరు నగరానికి చెందిన జెండావీధికి చెందిన స్వర్ణకారుడు షేక్ ముసవీర్ తాజాగా బంగారంతో సమైక్య వినాయకుడి ప్రతిమను తయారు చేసి అందరి మన్ననలు పొందారు. ఈయన గతంలో అనేక సూక్ష్మ నమూనాలను తయారు చేసిన విషయం తెలిసిందే. వినాయక చవితిని పురస్కరించుకుని ఆయన సమైక్య వినాయక నినాదంతో సూక్ష్మ నమూనాని వినాయకుడిన ప్రతిమను తయారు చేశారు.
వీనిటి తయారు చేసేందుకు రెండురోజులు సమయం పట్టిందన్నారు. ఈ నామూనా తూకం సమైక్యాంధ్ర వినాయక తూకం 750 మిల్లీ గ్రాములు, పొడవు 3సెం.మీ పచ్చని బంగారు ఆకులతో వినాయక రూపం దాని తూకం 90మిల్లీ గ్రాములు, పొడువు 0.8 సె.మీ,వెడల్పు 0.6 సెం.మీ ఇంకొక వినాయకుని తూకం 100మిల్లీ గ్రాములు, పొడువు 0.8 సెం.మీ, వెడల్పు 0.6 సెం. మీటర్లని తెలిపారు.నెల్లూరు కల్చరల్, సెప్టెంబర్ 8:కుల మతాలకు అతీతంగా ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకునే వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పూజకు అవసరమైన పూజా సామగ్రి, ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు వచ్చిపోయే వారితో ఆదివారం నగరం సందడిగా కనిపించింది. పండుగ సోమవారమే అయినా నగరంలో ఆదివారంనుండే చవితి సందడి ప్రారంభమైంది. అమ్మకానికి సిద్ధంగా ఉన్న వినాయక విగ్రహాలను కొనుగోలుచేసి మండపాలకు తరలించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది నగరంలోని వివిధ కూడళ్లలోని వినాయక మండపాల్లో భారీనుండి అతిభారీ సైజు విగ్రహాలను ఏర్పాటుచేసేందుకు నిర్వాహకులు ఆసక్తి చూపారు. ప్రధాన సెంటర్లలో మండపాలు ఏర్పాటుచేసి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన రంగురంగుల విద్యుత్ దీప కాంతులతో నగరం శోభాయమానంగా ప్రకాశిస్తోంది. వినాయకుని వివిధ అవతార విశేషాలను తెలియచేసే కటౌట్లు విద్యుత్ దీపాలు అమర్చి వివిధ సెంటర్లలో ఏర్పాటుచేశారు. ఆదివారం నుంచే పండుగకు అవసరమైన వివిధ సామాగ్రి కొనుగోలు చేసేందుకు వచ్చే మహిళలు, పిల్లలు, పెద్దలతో మార్కెట్ రోడ్లన్నీ నిండిపోయాయి. నగరంలోని చిన్నబజారు, పెద్ద బజారు, ఎసి కూరగాయల మార్కెట్, రామలింగాపురం, మినీ బైపాస్, వేదాయపాళెం, సంతపేట, రంగనాయకులపేట, నవాబుపేట, వెంకట్రామాపురం సెంటర్, మైపాడు గేటుతోపాటు చిన్నచిన్న ఇరుకు సందుల్లో సైతం పూలు, ప్రతి, మామిడితోరణాలు, అరటిపిలకలు, టెంకాయలు, వినాయక విగ్రహాలు, వినాయక వ్రతకల్పం పుస్తకాలు జోరుగా విక్రయిస్తున్నారు. పూజలో ప్రధానంగా దానిమ్మ, మరువం, దర్భ, జమ్మి, విష్ణుకాంత, ఉమ్మెత్త, దుర్వార, ఉత్తరేణి, కలువ, జాజి, రేగు, మామిడి, మారేడు, గనే్నరు, జిల్లేడు, దేవదారు, దేవకాంచన తదితర ఆకులతో పూజిస్తారు. ఆకుపూజ చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. చెరువుగట్టు, కావలువ గట్లపై లభించే ఈ పత్రులను నగరానికి చుట్టుపక్కల గ్రామాలనుండి సేకరించి తీసుకువచ్చి విక్రయిస్తున్నారు.గతంలో ఐదు రూపాయలకు లభించే పత్రి పొట్లాలు 15నుండి 30 రూపాయల ధర పలుకుతున్నాయి. ముఖ్యంగా మారేడు, నేరేడు, వెలగ, జాజి, కలువ పూల ధరలు ఆకాశన్నంటాయి.
విశేషం. ఇక వినాయక మండపాల్లో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహం చేతుల్లో ఉంచే పెద్ద లడ్డులు కూడా స్వీట్‌షాపుల్లో సిద్ధంగా ఉంటున్నాయి. దీంతో మిఠాయిదుకాణాల్లో వ్యాపారాలు పుంజుకుంటున్నాయి. వివిధ సైజుల్లో లభిస్తున్న వినాయక విగ్రహాలను కొలుగోలు చేస్తున్నారు. అన్ని ధరలు పెరుగుతున్నట్టే వినాయక విగ్రహాల ధరలు సైతం ప్రతి ఏటా పెరుగుతున్నాయి. ఇళ్లల్లో ప్రతిష్టించుకునే విగ్రహాలు సైజు, కళాత్మక విలువనుబట్టి ధర పలుకుతున్నాయి. గతంలో 20 రూపాయలకు లభించే వినాయక విగ్రహాలు ప్రస్తుతం యాభైకి చేరుకున్నాయి. వినాయక మండపాల్లో ఏర్పాటుచేసిన భారీ వినాయక విగ్రహాల ధరలైతే వేలు, లక్షల్లో ఉంటున్నాయి. ప్లాస్టర్‌ఆఫ్ పారిస్, రంగుల ధరలు పెరిగిపోవడంతో విగ్రహాల ధరలు పెంచక తప్పడంలేదని విగ్రహాల తయారీదారులు చెపుతున్నారు. ధరలు విపరీతంగా ఉండడం, పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో అప్పటికప్పుడు బంకమట్టితో తయారుచేసే వినాయక విగ్రహాలను కొనుగోలుచేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.

జనాభిమానం వెల్లువ
నెల్లూరు, సెప్టెంబర్ 8: మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం జిల్లాలో విజయవంతమైంది. స్వతహాగా వైఎస్ కుటుంబంపై సానుభూతి, సమైక్యాంధ్ర పట్ల సామాన్య ప్రజానీకంలో పెల్లుబుకుతున్న అభిమానం వెరసి షర్మిల బస్సు యాత్రగా నిర్వహించిన ఈ కార్యక్రమం అడుగడుగునా జయప్రదమయ్యేందుకు పార్టీ కేడర్ బాటలు వేసినట్లుగా వర్ణించాలి. ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఓ రోజంతా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగేలా ప్రణాళిక రూపొందించారు. జిల్లాకు పశ్చిమ సరిహద్దున ఉన్న మర్రిపాడు మండలం నుంచి షర్మిల బస్సు యాత్ర ప్రారంభమైంది. నెల్లూరు-ముంబయి ప్రధాన రహదారిపై ఉన్న వివిధ గ్రామాలు సమీపంలో ఉన్న పల్లెల నుంచి ప్రతి కూడలిలోనూ గుంపులుగుంపులుగా జనం షర్మిలను చూసేందుకు ఎగబడ్డారు. ముందుగా నిర్దేశించుకున్న రూట్ మ్యాప్‌లో లేని కూడళ్లలో కూడా షర్మిల బస్సు ఆగుతూ అందరికీ అభివందనం చేసుకుంటూ వెళ్లారు. కొన్ని చోట్ల బస్సు ఆగదేమోనన్న భావనతో రోడ్డుకు అడ్డంగా జనం నిలబడటంతో ఇక చేసేదేమి లేక ఆమె వాహనంలో నుంచే అందరికీ కనపడేలా అచ్చం తన తండ్రి మాదిరిగానే చేయి ఊపుతూ ముందుకెళ్లారు. దీంతో ప్రతి చోటా అనుకున్న సమయం కంటే ఆలస్యంగా బస్సు కదిలింది. అయినాసరే తండోపతండలుగా తరలివచ్చిన జనం జై సమైక్యాంధ్ర, జై జగన్, జోహార్ వైఎస్‌ఆర్ నినాదాలు హోరెత్తిస్తూ తమ అభిమానం చాటుకున్నారు. మహిళలు సైతం వివిధ ప్రాంతాల నుంచి షర్మిల సభా స్థలి వద్దకు భారీగా తరలివచ్చారు. సమైక్యాంధ్ర అంశంలో రెండురోజుల క్రితం పార్టీపరంగా స్పష్టమైన ప్రకటన వెలువడటంతో సగటు ప్రజానీకంలోనూ ఈ పర్యటనకు సానుకూల వాతావరణం ఏర్పడింది. ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి కుటుంబం ఈ యాత్రను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. జన సమీకరణలోనూ సఫలీకృతులయ్యారు. ఆత్మకూరుతో సహా ఉదయగిరి నియోజకవర్గం నుంచి వివిధ మండలాల నుంచి కూడా భారీగా జనాన్ని సమీకరించడం విశేషం. దీంతో తొలి బహిరంగ సభగా నిర్వహించిన ఆత్మకూరు పట్టణం జనంతో కిక్కిరిసిపోయింది. ప్రధాన బజార్ అంతటా వాహనాలు ముందుకెళ్లలేని రీతిలో ఎక్కడికక్కడ జనం నిలబడిపోయారు. సభావేదిక వద్ద జనం నిలబడేందుకు కూడా స్థలం సరిపోక తోపులాటలు జరిగాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహనరెడ్డి తనయుడు గౌతమ్‌రెడ్డి ఈ కార్యక్రమంలో హడావుడి సృష్టించారు. గౌతమ్ పేరిట పట్టణంతో సహా నెల్లూరు-ముంబయి రహదారికి ఇరువైపులా చాలాచోట్ల ఫక్స్‌బోర్డులు ఏర్పాటయ్యాయి. బ్యానర్లు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ తోరణాలు, జెండాలు కూడా పెద్దసంఖ్యలోనే ఏర్పాటు చేశారు. అదేవిధంగా బుచ్చిరెడ్డిపాళెం కూడలి వద్ద కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో స్వాగత ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ఫ్లక్స్‌బోర్డులు పెద్దసంఖ్యలో నెలకొల్పడంతో సహా బుచ్చి కూడలిలోని మహానేత వైఎస్ కాంస్య విగ్రహానికి మిరుమిట్లు గొలిపేలా నూతనంగా రంగులు వేశారు. షర్మిల తరలివచ్చే సందర్భంలో భారీగా బాణాసంచా పేలుస్తూ పండుగ వాతావరణాన్ని తలపించేలా హోరెత్తించారు. కేంద్ర ప్రభుత్వం సమైక్యాంధ్రకు కట్టుబడి ఉండేలా ప్రకటన వచ్చే వరకు తమ పార్టీ, కుటుంబం చేస్తున్న ఆందోళనా కార్యక్రమాల్ని విస్తృతం చేస్తామంటూ షర్మిల పలుచోట్ల ఉపన్యాసాల్లో భాగంగా పేర్కొన్నారు. ఆమె ప్రసంగాలకు జనం నుంచి మంచి స్పందన కానవచ్చింది. మొత్తమీద షర్మిల పర్యటన వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో నూతనోత్సాహం నింపింది.

40వ రోజుకు చేరిన సమైక్య ఆందోళనలు
నెల్లూరు, సెప్టెంబర్ 8: సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఆందోళనకారులు పార్టీలకు, వర్గాలకు అతీతంగా 40వ రోజు కూడా కదం తొక్కారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నెల్లూరుజిల్లా వ్యాప్తంగా వివిధ ఆందోళనా కార్యక్రమాలు కొనసాగాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ సోదరి షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ కార్యకర్తలతో సహా సమైక్యాంధ్ర అభిమానులు కూడా పాల్గొన్నారు. పలుచోట్ల సమైక్యవాదులు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు ప్రధాన భూమికగా నెల్లూరు విఆర్ గ్రౌండ్స్‌లో సమైక్యాంధ్ర పరిరక్షణ సభ చేపట్టారు. ప్రధాన రాజకీయ పార్టీలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాల నేతృత్వంలో వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేసే కార్యక్రమాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో తెలంగాణా నేతలు కెసిఆర్‌తో సహా యూపిఏ అధినేత్రి సోనియాగాంధీ దిష్టిబొమ్మల దహనాలు నిర్వహిస్తున్నారు. సమైక్యాంధ్ర నినాదాలు హోరెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరి మారే వరకు ఈ ఆందోళనలు కొనసాగే పరిస్థితులు ఏర్పడుతుండటం గమనార్హం. నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయినా చాలామంది తమ నైతిక మద్దతు ప్రకటించారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
పెళ్లకూరు, సెప్టెంబర్ 8: మండల పరిధిలోని టెంకాయతోపు గ్రామ సమీపంలో ఆదివారం పూతలపట్టు- నాయుడుపేట రహదారిపై ద్విచక్రవాహనంపై వెళుతున్న పాలంపల్లి శివ(24) అనే యువకుడిని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో సంఘటన స్ధలంలో మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాయుడుపేట పట్టణంలోని పొగగొట్టం ప్రాంతానికి చెందిన కార్పెంటర్ పాలంపల్లి సుబ్బయ్య గత మూడేళ్లుగా కుటుంబ సభ్యులతో కలసి తన అత్తగారి ఊరైన పెళ్లకూరులో నివాసం ఉంటున్నారు. ఆదివారం ఉదయం సుబ్బయ్య కుమారుడు శివ తన ద్విచక్రవాహనంపై తన మేనమామ సుబ్బారావు కుమార్తె మహాలక్ష్మిని పునబాక గ్రామంలో దించి తిరిగి వస్తుండగా టెంకాయతోపు వద్ద నాయుడుపేట నుండి శ్రీ కాళహస్తి వైపు వెళుతున్న ఓ లారీ అతి వేగంగా దూసుకొని బైక్‌పై వస్తున్న శివను ఢీకొంది. ప్రమాదంలో శివ సంఘటన స్థలంలో మృతి చెందాడు. మృత దేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పెళ్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా శివ మరణ వార్త తెలుసుకొన్న నాయుడుపేట ఎఎంసి చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, పెళ్లకూరు మండల కాంగ్రెస్ నాయకులు బైనా మల్లికార్జున రెడ్డి, ఉచ్చూరు రమణారెడ్డి, సర్పంచ్ బైనా మాలతి,వైకాపా నాయకులు బైనా చంద్రశేఖర రెడ్డి, పేరం మధుసూదన నాయుడు మృత దేహాన్ని సందర్శించి నివాళుర్పించారు.
సాక్షర భారత్ ఆధ్వర్యంలో ర్యాలీ
పెళ్లకూరు, సెప్టెంబర్ 8: అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మండల పరిధిలోని తాళ్వాయిపాడులో మండల సాక్షరతాభారత్ కో ఆర్డినేటర్ పురిణి కృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. గిరిజన కాలనీలోని సాక్షరతాభారత్ వయోజనలు ప్లకార్డులు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సాక్షర భారత్ కో ఆర్డినేటర్ కృష్ణ మాట్లాడుతూ మండలంలో 100 శాతం అక్షరాస్యత ఫలితాలను సాధిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జి అనురాధ, గ్రామ కో ఆర్డినేటర్లు ఓ వెంకయ్య, సి విజయలక్ష్మి, శ్రీనిసువాసులు తదితరులు పాల్గొన్నారు.
దారి కావాలంటూ దగ్గవోలు గ్రామస్థుల ఆగ్రహం
డక్కిలి, సెప్టెంబర్ 8: మండల పరిధిలోని దగ్గవోలు గ్రామ పంచాయతీ శ్రీరాంపల్లి గ్రామానికి రోడ్డు సౌకర్యం కావాలంటూ రెండు గ్రామాల ప్రజలు అటవీ శాఖ అధికారులతో ఆదివారం వాగ్వివాదానికి దిగారు. పంచాయతీ పరిధిలోని శ్రీరాంపలిల గ్రామం అడవిలో ఉండటంతో గ్రామానికి ఉత్తర దిక్కున ఉన్న అటవీ భూమిని అటవీ శాఖ అధికారులు వివిధ రకాల చెట్ల పెంపకానికి సిద్ధం చేస్తున్నారు. శ్రీరాం పల్లి గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకుండా కంచె ఏర్పాటు చేయడంతో రెండు గ్రామాల ప్రజలు అటవీ శాఖ అధికారులతో వివాదానికి దిగారు. పూర్వీకుల కాలం నుండి ఇది మేత పొరంబోకు భూమిగా గ్రామస్థులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పత్రాలు కూడా తమ వద్ద ఉన్నాయని రెండు గ్రామాల ప్రజలు తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించి తమ రెండు గ్రామాలకు రోడ్డు సౌకర్యంకల్పించాలన్నారు.
వాకాడు ఆర్టీసీకి భారీ నష్టం
వాకాడు, సెప్టెంబర్ 8: సమైక్యాంధ్రకు మద్దతుగా ఆర్టీసీకి చెందిన ఎన్‌ఎంయు నాయకులతో పాటు ఆదివారం నుండి సిఐటియు కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో డిపోలో పూర్తి స్థాయిలో బస్సులునిలిచి పోయాయి. కోటి రూపాయలు నష్టం వాటిల్లినట్టు డిఎం రామలింగేశ్వరరావు తెలిపారు. రోజుకు 5 లక్షల రాబడి ఉంటుందని, ఆదివారం ఒక్క సర్వీసును తిప్పలేక పోయినట్టు తెలిపారు. బస్సులు పూర్తి స్థాయిలోనిలిచి పోవడంతో ప్రైవేటు వాహన దారులకు విపరీతమైన చార్జీలతో వారిష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వాకాడు- కోట మార్గంలో ఆటోలు పది నుండి పదిహేనురూపాయలు, వాకాడు నుండి గూడూరుకు 35 నుండి 40రూపాయల వరకు చార్జీలు వసూలు చేస్తున్నారు.

దేశ భవితకు యువత పరుగు
గూడూరు, సెప్టెంబర్ 8: స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో దేశ భవితకు యువత పరుగు కార్యక్రమం పోస్టర్లను ఆదివారం ఎబివిపి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పరిషత్ జిల్లా కన్వీనర్ మల్లికార్జున మాట్లాడుతూ స్వామి వివేకానంద ప్రపంచంలో ఉండే యువతకు ఆదర్శ ప్రాయుడన్నారు.
స్వామిజీ సెప్టెంబర్ 11న చికాగో మహాసభలో చేసిన ప్రసంగం రోజుని పురస్కరించుకొని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు యువత పరుగు కార్యక్రమం నిర్వహించ తలపెట్టినట్టు చెప్పారు. ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నెల 11న ఉదయం 9.30 గంటలకు గూడూరు రెండో పట్టణంలోని మాళవ్యానగర్ సెంటర్‌నుండి కార్యక్రమం మొదలై టవర్ క్లాక్ సెంటర్‌లో బహిరంగ సభతో కార్యక్రమం ముగుస్తుందన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి సిహెచ్ సునీల్, రంజిత్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ శాంతి హోమం
గూడూరు, సెప్టెంబర్ 8: సమైక్యమే మా నినాదం, రాష్ట్రం విడిపోతే అన్ని వర్గాల ప్రజలూ తీవ్రంగా నష్ట పోతారని, ఈ రాష్ట్రాన్ని ముక్క చెక్కలుకాకుండా చూడాలని స్థానిక ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాదరావు అభిలషించారు. ఆదివారం సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా గూడూరు టవర్ క్లాక్ సెంటర్‌లో బ్రాహ్మణ సేవా సంఘం, పురోహితుల ఆధ్వర్యంలో శాంతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే అందరూ కలిసి ఉండాలన్నారు. కోట సునీల్ కుమార్ శర్మ మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ శాంతి హోమం ద్వారానైనా కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం మనసు మార్చుకొని రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావూరి సత్యనారాయణ శాస్ర్తీ, బ్రాహ్మణ సేవా సంఘ ఉపాధ్యక్షులు, సభ్యులు రమణ, శ్రీనివాసరావుతదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రం సమైఖ్యంగా ఉండాలని కోరుతూ నిర్వహించిన శాంతి హోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రం విడ గొట్టవద్దంటూ ఆర్టీసీ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. మండలంలోని చెన్నూరు గ్రామంలో కూడా రోడ్డుపై విద్యార్థులు, గ్రామస్థులు కాసేపు వాలీబాల్ ఆట ఆడి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మందాటి గోపాలకృష్ణయ్య, సిహెచ్ నాగేంద్రకుమార్, దేశిరెడ్డి ప్రజేందర్ రెడ్డి, వై మల్లిఖార్జున్, ఎస్ కొండయ్య, ఎం రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు
డక్కిలి: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జెఎసి మండల శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలేనిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. డక్కిలి సింహపురి యూత్ ఆధ్వర్యంలో ఆదివారం భారీ ఎత్తున వెలంపల్లి రోడ్డు సెంటర్ నుండి కమ్మపల్లి రోడ్డు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వెంకటగిరి-రాపూరు రోడ్డుపై మానవహారం చేపట్టారు. కలువాయి మండలం చిన్న బద్దెవోలు గ్రామానికి చెందిన కళాకారులు నృత్యాలు చేపట్టారు. ఈ నృత్యాలు పలువురిని ఆకట్టుకొన్నాయి. అనంతరం సింహపురి యూత్ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. వీరికి ఉపాధ్యాయులు సంఘీభావం ప్రకటించారు. దగ్గవోలు గ్రామంలో పంచాయతీ సర్పంచ్ యద్దల ఉదయకుమార్ ఆధ్వర్యంలో దగ్గవోలు యూత్ అధ్యక్షులు మస్తాన్ నాయుడు, టివిఎస్ నాయుడు, పద్మయ్య, దూడల రవి, శ్రీకాంత్ ఆధ్వర్యంలో విద్యార్థులు గ్రామస్థులు గూడూరు- వెంకటగిరి రోడ్డుపై మోకాళ్లపై నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జెఎసి మండల కన్వీనర్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు డివి రెడ్డి, దూడల పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.
భవన నిర్మాణ కార్మికులు ఆందోళన
వాకాడు: రాష్ట్ర విభజనకు నిరసనగా మండలానికి చెందిన భవన నిర్మాణ కార్మికులు ఆదివారం ఆందోళనకు దిగారు. మండల కేంద్రంలోని బజారువీధుల్లో కెసిఆర్, సోనియా గాంధీలకు వ్యతిరేకంగా సమైక్యాంధ్రకు మద్దతుగానినాదాలు చేసి ర్యాలీ నిర్వహించారు. అశోక్ పిల్లర్‌సెంటర్ వద్ద తమనిరసను రోడ్డుకు అడ్డంగా గోడ కట్టారు. ఇకనైనా కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన అంశాన్ని పునరాలోచించుకొనాలని కార్మిక సంఘ అధ్యక్షులు రియాజ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చక్రవర్తి, అనంతాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

‘పర్యావరణ సమతుల్యానికి మట్టివినాయక విగ్రహాలే శ్రేష్టం’
గూడూరు, సెప్టెంబర్ 8: పర్యావరణ సమతుల్యం కాపాడేందు కోసం ప్రతి ఒక్కరు ఈ వినాయక చవితికి మట్టి వినాయక విగ్రహాలకు పూజలు నిర్వహించి పర్యావరణ సమతుల్యం కాపాడాలని జన విజ్ఞాన వేదిక సభ్యులు కోరారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా వేదిక ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను కేవలం 5 రూపాయలకే విక్రయించారు. ఈ సందర్భంగా వేదిక సభ్యులు మాట్లాడుతూ మట్టి వినాయక విగ్రహాలన ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని, కాలుష్య రహిత ఈ విగ్రహాలను వినియోగించాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక గాంధీబొమ్మ సెంటర్‌లో వినాయక మట్టి విగ్రహాలను కేవలం 5 రూపాయలకే విక్రయించారు. ఈ కార్యక్రమంలోరోటరీ క్లబ్ అధ్యక్షుల మయూరీ శ్యాంసుందర యాదవ్, మండల విద్యాశాఖాధికారి ఎండి ఇస్మాయిల్, జెవివి జిల్లా అధ్యక్షులు చిత్తూరు అంజిరెడ్డి, జెవివి మండల అధ్యక్షులు వివి కుమార్, విశ్వభారతి స్కూల్ కరస్పాండెంట్ ఐతా కమలాకర్, ప్రాస్పరో స్కూల్ కరస్పాడెంట్ బుస్సా దశరథరామిరెడ్డి, కె చంద్ర, నవీన్ జయకుమార్, సురేంద్రమోహన్, కె ప్రసాదరావు, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే చర్యలు తప్పవు
ఓజిలి: సోమవారం నుండి వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్న దృష్ట్యా మండలంలో ఎక్కడైనా చవితి ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు నిర్వహించినట్టు తెలిస్తేనిర్వహకులపై చర్యలు తప్పవని ఆదివారం ఇన్ చార్జీ ఎఎస్సై నారాయణ రెడ్డి తెలిపారు. విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తీసుకొనాలని, మైక్ ఏర్పాటుకు డిఎస్పీ అనుమతి తప్పని సరి అన్నారు.

వేర్పాటువాదంపై నిప్పులు చెరిగిన
సమైక్య కవితా సమరం
నెల్లూరు కల్చరల్, సెప్టెంబర్ 8: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్ర పరిరక్షణ నేపధ్యంలో సృజన సాహిత్య,సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక టౌన్‌హాల్ వర్థమాన సమాజం గ్రంథాలయం మిద్దెపై దగ్గుపాటి రాధాకృష్ణ పర్యవేక్షణలో జరిగిన సమైక్య కవితా సమరంలో పాల్గొన్న కవులు తమ కవితాగానంతో వేర్పాటువాదంపై నిప్పులు చెరిగారు. విశ్వవ్యాప్తిగా కీర్తిప్రతిష్టలు గడించిన తెలుగు జాతిని రెండుగా చీల్చి రాష్ట్ర సమగ్రతను, సంక్షేమాన్ని అంధకారమయం చేయడం సహించరాదంటూ కవులు ముక్త కంఠంతో వెలుగెత్తారు. రాధాకృష్ణ మాట్లాడుతూ దశాబ్ధాలపాటు అధికారిక పదవులు అనుభవించి ప్రజల ప్రాధమిక అవసరాలను కూడా తీర్చలేని నాయకులు వేర్పాటువాదం పేరుతో రాజకీయ లబ్ధిని పొందాలనుకోవడం జాతి ద్రోహమని విమర్శించారు. జాతి సమైక్యతను పెంచి తెలుగు ప్రజలకు గౌరవాన్ని చేకూర్చాలని దగ్గుపాటి హితవుపలికారు. ఈకార్యక్రమంలో మారం సుధాకర్, అంకయ్యచౌదరి, జెఎస్‌లత, ఎస్ నరసింహారెడ్డి, ఐఎస్‌రావు, సుబ్బారెడ్డి పాతూరు అన్నపూర్ణ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. కవిసమ్మేళనంలో బిరదవోలు రామిరెడ్డి, వరదా శ్రీనివాసులు, గుర్రాల రమణయ్య, ఇసనాక దయాకర్‌రెడ్డి,తంగిరాల సుధాకర్, పంచాగ్నుల విశే్వశ్వరశర్మ, అన్నం శివకృష్ణ, జి లలిత, ధనలక్ష్మి, హస్మిత్, మురళీమోహన్‌రాజు, రవితేజ, సుబ్బారావు, దశయ్య, పద్మనాభయ్య, అమానుల్లాఖాన్, సుదర్శనమ్మ, డాక్టర్ ఇలియాజ్, దూర్జటి వెంకటేశ్వరరావు, దశరథరామిరెడ్డి, సిహెచ్‌రామారావు, దుర్గం మధుసూధన్‌తోపాటు పలువురు కవులు పాల్గొని కవితాగానం చేశారు. కవిసమ్మేళనంలో పాల్గొన్న కవులకు నిర్వాహకులు ప్రశంసాపత్రాలు అందచేశారు.

సీమకు సమన్యాయం తర్వాతే
పార్లమెంట్‌లో విభజన బిల్లుకు మద్దతు
నెల్లూరు , సెప్టెంబర్ 8: సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలు కాపాడేవిధంగా రాష్ట్ర విభజన బిల్లు ఉంటేనే పార్లమెంట్‌లో బిల్లుకు బిజెపి మద్దతివ్వాలని బిజెపి రాష్ట్ర కార్యదర్శి కాకు విజయలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో జాతీయ నేతలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రలో జరిగే నష్టానికి, నష్ట నివారణకు తీసుకునే చర్యలపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయలక్ష్మి పలు అంశాలతో కూడిన రూట్‌మ్యాప్‌ను జాతీయ నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేసేందుకు పోలవరం ద్వారా గోదావరి కృష్ణానదుల అనుసంధానం ద్వారా లభమయ్య నికర జలాలలో 30టిఎంసిలు రాయలసీమకు కేటాయించాలని, నాగార్జునసాగర్ కుడి కాలువను నెల్లూరు జిల్లా సంగం వరకు పొడిగించాలన్నారు. ఐటిపార్కులు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు,బిహెచ్‌ఇల్, బిడిఎల్, డిఆర్‌డిఓ, ఐపిఇ, ఐఎస్‌బి వంటి సంస్థలను సీమాంధ్రలో స్థాపించాలని కోరారు. దుగరాజపట్నం , రామాయపట్నం, మచలీపట్నం పోర్టుల నిర్మాణం, ఇచ్ఛాపురం నుండి చెన్నైవరకు, ఇసిఎల్ రోడ్డు నిర్మాణం, కాకినాడ - చెన్నై బకింగ్‌హాం కెనాల్ పునరుద్ధరణ, వ్యవసాయ, ఆయుర్వేద సంస్థలు ఏర్పాటుచేయాలన్నారు. తిరుపతి, విజయవాడల్లో అంతర్జాతీయ విమానాశ్రయాలు, గాజువాక, విజయవాడ , నెల్లూరు, చెన్నై కర్నూలు పవర్ ట్రాన్సిమిషన్ కారిడార్, తెలుగు సాహిత్య సంస్థలు ఏర్పాటుచేయాలని కోరారు. హైదరాబాద్‌లో సీమాంధ్రులకు రాజ్యాంగ రక్షణ, పరిశ్రమల స్థాపనకు 20సంవత్సరాల టాక్స్ హాలిడే, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు. అతి పురాతన ఆలయాల అభివృద్ధి ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని, విక్రమ సింహపురి,కృష్ణ, అంబేద్కర్, వైఎస్‌ఆర్ యూనివర్సిటీల అభివృద్ధికి గ్రాంట్లు మంజూరు చేయాలన్నారు.

సమెక్య సూక్ష్మ వినాయక ప్రతిమ తయారు
english title: 
idol

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>