అనంతపురం, సెప్టెంబర్ 8 : సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు, దీక్షలు 40 రోజులకు చేరుకున్నాయి. దీంతో రవాణా వ్యవస్థ, పరిపాలన పూర్తిగా స్థంభించిపోయాయి. జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, రిలే దీక్షలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రం అనంతపురము నగరంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులంతా నగరానికి చేరుకోవడంతో ప్రధాన రహదారులన్నీ కిటకిటలాడాయి. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చేసిన నినాదాలతో నగరం మార్మోగింది. ప్రదర్శన అనంతరం సప్తగిరి సర్కిల్‌లో రోడ్డుపైనే ప్రార్ధనలు నిర్వహించారు. ధర్మవరంలో జెఎసిల ఆధ్వర్యంలో సమైక్యవాదులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. కదిరి నియోజకవర్గంలోని ఆమడగూరు మండల కేంద్రానికి చెందిన తలారి నరసింహయ్య (40) అనే వ్యక్తి గుండెపోటుతోమృతి చెందాడు. గడచిన 35 రోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న నరసింహయ్య పాలకుల ప్రకటనలతో మనసు వికలమై గుండెపోటుకు గురయ్యాడని బంధువులు చెప్పారు. కళ్యాణదుర్గంలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో సుమారుగా పదివేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. 1500 బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు.
ఎమ్మెల్యే శిల్పా దీక్ష భగ్నం
కర్నూలు: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా కర్నూలు జిల్లాలో ఆదివారం రాస్తారోకో, ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా పరిధిలోని 40, 44వ నంబరు జాతీయ రహదారులపై పలు చోట్ల సమైక్యవాదులు రాస్తారోకో నిర్వహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా మోహన రెడ్డి ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స నిర్వహిస్తున్న వైద్యులు ఫ్లూయిడ్స్ ఎక్కించి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ న్యాయవాదుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. హైదరాబాదులో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్‌సభ స్ఫూర్తితో ఎపిఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో రాయలసీమ స్థాయిలో సభను నిర్వహించడానికి నాలుగు జిల్లాల ఎన్జీవో నాయకులు కసరత్తు ప్రారంభించారు. ఇదిలావుండగా డోన్, ఆదోని, ఎమ్మిగనూరుల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి.
తెలంగాణలో దాడులపై ఆగ్రహం..
రాజమండ్రి/కాకినాడ: హైదరాబాద్‌లో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు హజరైన ఉద్యోగులపై తెలంగాణలో జరిగిన దాడులపట్ల గోదావరి జిల్లాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ దాడిలో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, రావులపాలెంకు చెందిన, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి చెందిన ఉద్యోగులు గాయపడిన సంగతి విదితమే. శాంతియుతంగా సభకు హాజరైన ఉద్యోగులపై పాశవికంగా దాడి చేయటం అన్యాయమని వివిధ శాఖల ఉద్యోగులతో పాటు, సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఉద్యమాన్ని మరింత ఉద్ధృతంగా సాగించాలని ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. ఈ దాడులను ఖండిస్తూ ఆదివారం రాజమండ్రి సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద సమైక్యవాదులు నల్ల రిబ్బన్లు కళ్లకు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సెయింట్ పాల్స్ లూథరన్ చర్చి వద్ద క్రైస్తవులు మానవహారం ఏర్పాటు చేశారు. రాజమండ్రిలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లాలో అనేక చోట్ల సమైక్యాంధ్ర నినాదంతో మట్టి వినాయక ప్రతిమలను సమైక్యవాదులు ఉచితంగా ప్రజలకు పంపిణీచేశారు.
ఇదిలావుండగా, హైదరాబాద్ సభకు తీసుకెళ్లి సురక్షితంగా తిరిగి గమ్యస్థానాలకు చేర్చిన తెలంగాణాకు చెందిన ప్రైవేటు బస్సు డ్రైవర్లను ఆదివారం రాజమండ్రిలో ఎన్‌జిఓలు ఘనంగా సత్కరించారు. ఎన్జీఓ హోమ్‌లో హైదరాబాద్‌కు చెందిన వెంకటేష్, ఖమ్మంనకు చెందిన సత్యబ్రహ్మంను సత్కరించి, నగదు పురస్కారాన్ని అందించారు. జిల్లా కేంద్రం కాకినాడలో ఆదివారం సమైక్య నిరసనలు జోరుగా సాగాయి. కలెక్టరేట్ ఎదుట ఎ.ఎస్.సత్యవతీదేవి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉపాధ్యాయులు, ఉద్యోగులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయ జెఎసి ఆధ్వర్యంలో జడ్పీ సెంటర్‌లో మానవ హారం, మోడల్ పార్లమెంట్ నిర్వహించారు. న్యాయశాఖ ఉద్యోగులు, అడ్వకేట్లు, పశు సంవర్ధక శాఖ, బిసి ఎస్సీ కార్పొరేషన్లు, దేవాదాయ, డి ఆర్‌డి ఎ, విద్య, వైద్యారోగ్య శాఖల అధికార్లు, సిబ్బంది రిలే దీక్షలు నిర్వహించారు. జె ఎన్‌టియుకెలో విద్యార్థులతో పాటు నాన్‌టీచింగ్ స్ట్ఫా సైతం ఆందోళన చేపట్టారు.
పశ్చిమ గోదావరిలో..
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో సమైక్య ఉద్యమం ఆదివారం ఉద్ధృతంగా సాగింది. భీమవరంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌కు సమైక్య సెగ తగిలింది. పట్టణంలో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన మంత్రి విశ్వరూప్, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, డిసిసి మాజీ అధ్యక్షుడు గోకరాజు రామరాజును జిల్లా విద్యార్థి ఐకాస కన్వీనర్ డాక్టర్ వత్సవాయి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఉద్యమకారులు ఘెరావ్ చేశారు. పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు. స్పందించిన మంత్రి విశ్వరూప్ రాజీనామా చేసిన వారిలో మొట్టమొదటి వ్యక్తిని తానేనని చెప్పబోతుండగా వాటిని ఆమోదింపజేసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. నవంబర్ 1వ తేదీ లోపు తన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించకపోతే తాను రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఆమోదింపజేసుకుంటానని మంత్రి తెలిపారు. భీమవరంలో మున్సిపల్ కాంట్రాక్టు డ్రైవర్ల సంఘం ఒంటి కాలిపై నిరసన ప్రదర్శన చేశారు. భీమడోలు జంక్షన్‌కు చెందిన కాపల్లి విజయ మారుతి హరనాధ్‌రాజు సమైక్యాంధ్రకు మద్దతుగా అరగుండు చేయించుకుని, మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు.
విజయనగరం జిల్లాలో
విజయనగరం: విజయనగరం జిల్లాలో సమైక్యాంధ్ర కోసం రోజు రోజుకూ నిరసనలు మిన్నంటుతున్నాయి. పట్టణంలో టిడిపి ఆధ్వర్యంలో ఆదివారం మయూరి కూడలి వద్ద మోకాలిపై నిరసన, రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమం, మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు, జిల్లా అధ్యక్షుడు జగదీష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ తరఫున రిలే దీక్షలు కొనసాగించారు. కోట కూడలి వద్ద ఉపాధ్యాయ పోరాట సమితి, ఇంటర్ విద్య, న్యాయవాదులు తమ రిలే దీక్షలను కొనసాగించారు. కలెక్టరేట్ వద్ద ఉద్యోగ జెఎసి ఆధ్వర్యంలో రిలే దీక్షలను నిర్వహించారు. చీపురుపల్లిలో జెఎసి ఆధ్వర్యంలో మానవహారం చేపట్టారు. సీతానగరంలో సమైక్యాంధ్ర కోసం జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. వేపాడలో వంటావార్పు చేపట్టారు.
సిక్కోల్‌లో ..
శ్రీకాకుళం: జిల్లాలో పలు ప్రాంతాలు సమైక్య రాష్ట్రం కోసం చేపట్టిన ఉద్యమాలు, ఆందోళనలతో దద్దరిల్లాయి. బైక్ ర్యాలీలు, మానవహారాలు, దీక్షాశిబిరాల వద్ద వినూత్న నిరసనలతో ఆదివారం ఉద్యమం ముందుకు సాగింది. మండలాల్లోని గ్రామాల నుంచి సమైక్యవాదులు పట్టణాలకు బైక్ ర్యాలీతో చేరుకుని ఇక్కడ నిరసనలు వ్యక్తంచేశారు. సింగుపురం, కళింగపట్నం, ఎచ్చెర్ల మండలాల నుంచి ఉపాధ్యాయులు, ఉద్యోగులు బైక్ ర్యాలీతో జిల్లా కేంద్రానికి చేరుకుని నినాదాలతో మానవహారాలు చేపట్టారు. ఎవడబ్బ సొత్తురా.. హైదరాబాద్ మనదిరా అంటూ సమైక్యవాదులు చేస్తున్న నినాదాలు నింగినంటుతున్నాయి. జిల్లాలో పలుచోట్ల సమైక్యాంధ్రకు మద్దతుగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు చేపడుతున్న రిలే దీక్షలకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతమవ్వడంతో మరింత స్ఫూర్తితో ఉద్యమం ముందుకు కదులుతోంది. పార్టీలకతీతంగా స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు స్వచ్ఛందంగా సమైక్య ఉద్యమంలో పాల్గొని స్వరం కలుపుతున్నారు.
అనంతలో ముస్లింల భారీ ర్యాలీ.. గుండెపోటుతో సమైక్యవాది మృతి.. మంత్రి విశ్వరూప్‌కు సమైక్య సెగ
సమైక్యాంధ్ర కోసం విద్యార్థి మృతి
హిరమండలం, సెప్టెంబర్ 8: సమైక్యాంధ్ర కోసం శ్రీకాకుళం జిల్లాలో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన హిరమండలం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సుబలై గ్రామంలో చోటుచేసుకుంది. వాకాడ చంద్రశేఖరరావు(15) అనే విద్యార్థి సేవ్ ఆంధ్రప్రదేశ్ ప్రసారాలు టివిలో చూసిన అనంతరం రాష్ట్ర విభజనపై తీవ్ర ఉద్వేగానికి గురై శనివారం రాత్రి మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం తెలిపారు. చంద్రశేఖర్ హిరమండలం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. వాకాడ ప్రభాకరరెడ్డి, రమణమ్మలకు ఏకైక కుమారుడు. తల్లిదండ్రులు వలస కూలీలు కావడంతో తాత అప్పారావు సంరక్షణలో ఉన్నట్టు బంధువులు తెలిపారు. విద్యార్థి మృతికి సంతాపం తెలుపుతూ హిరమండలంలోని పాతబస్టాండ్ దీక్షా శిబిరం వద్ద సమైక్యవాదులు వౌనం పాటించారు.
చంద్రశేఖర్ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
5లక్షల మందితో
సమైక్య గర్జన
పోస్టర్ విడుదల చేసిన మంత్రి గంటా
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, సెప్టెంబర్ 8: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఈనెల 17న విశాఖపట్నంలో విశాఖ సమైక్య గర్జన తలపెట్టినట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. రామకృష్ణ సాగర తీరంలో రాజకీయేతర ఐకాస ఆధ్వర్యంలో తలపెట్టిన సమైక్య గర్జనతో విశాఖలో సమైక్య కాంక్షను చాటాలని పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం విడుదల చేశారు. టిడిపి, వైకాపా, కాంగ్రెస్ సహా పలు ఐక్యకార్యాచరణ వేదికల ప్రతినిధులను సమావేశానికి ఆహ్వానించారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు చేస్తున్న సమైక్య ఉద్యమానికి బాసటగా సమైక్య గర్జన చేపట్టాలని నిర్ణయించారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో ఎపి ఎన్జీఓలు నిర్వహించిన సేవ్ అంధ్రప్రదేశ్ సభ అనూహ్య విజయం సాధించడంతో హీరోగా నిలిచిన ఎపి ఎన్జీఓ నేత అశోక్‌బాబును ఈసభకు ఆహ్వానించనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.
చవితి సందడిలోనూ కొనసాగుతున్న నిరసనలు
వినాయక చవితి సందడిలోనూ విశాఖ నగరంలో సమైక్య నిరసనల హోరు కొనసాగింది. జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన దీక్షలు కొనసాగాయి. ఎయులో ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి జెఎసి ప్రతినిధులు రిలేదీక్షలు కొనసాగించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖ జిల్లాలోని అనకాపల్లి పట్టణంలో ఈ నెల 11న లక్ష గళ ఘోష తలపెట్టారు. ఉద్యోగ సంఘాల ఐక్యకార్యాచరణ సంఘాల ఆధ్వర్యంలో ఈకార్యక్రమం నిర్వహించనున్నారు. నర్సీపట్నం పరిధిలో టిడిపి మహిళా విభాగం ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేలా కాంగ్రెస్‌కు మంచి బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థించారు.
11 నుంచి కృష్ణా జిల్లాలో 48 గంటల బంద్
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, సెప్టెంబర్ 8: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర బహిరంగ సభ ఊహించని రీతిలో విజయవంతం కావటంతో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృష్ణా జిల్లా సమైక్యాంధ్ర జెఎసి నేతలు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో కృష్ణా జిల్లాలో 48 గంటల బంద్‌కు నాయకులు పిలుపునిచ్చారు. బంద్‌ను విజయవంతం చేసేందుకు విద్యార్థి, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, వాణిజ్య, ఇతరత్రా అన్ని సంఘాలను కలుపుకెళుతున్నారు. ప్రైవేటు వాహనాలను కూడా నిలువరించాలని నిర్ణయించారు. ఇప్పటికే మున్సిపల్ ఇంజనీర్లు సమ్మెలోకి దిగటంతో అన్నిరకాల అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. మరోవైపు 80 మంది జిల్లా అధికారులు తొలుతగా ఐదురోజుల సామూహిక సెలవు పెట్టటంతో ప్రభుత్వ కార్యక్రమాలు స్తంభించాయి. విద్యార్థుల ఆందోళన 40వ రోజుకు చేరగా ప్రభుత్వ గ్రంథాలయాల సిబ్బంది, మున్సిపల్ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మె 26వ రోజుకు చేరింది. ఆదివారం సాయంత్రానికే చవితి ఘడియలు ప్రవేశించడంతో సమైక్యవాదులు రహదారులపై విఘ్నేశ్వర పూజలు చేశారు.
13న మహిళా గర్జన
ఈ నెల 13న మధ్యాహ్నం స్వరాజ్య మైదానంలో కనీసం 50వేల మంది మహిళలతో మహిళా గర్జన నిర్వహించాలని ఎన్జీవో హోంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. జెఎసి కన్వీనర్ ఎ విద్యాసాగర్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి మనోరంజని ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగినులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
26వ రోజుకు చేరిన రిలే దీక్షలు
మచిలీపట్నం టౌన్, సెప్టెంబర్ 8: సమైక్యాంధ్ర కోరుతూ మచిలీపట్నం కోనేరు సెంటరులో నిర్వహిస్తున్న నిరవధిక రిలే నిరాహార దీక్షలు ఆదివారం 26వ రోజుకు చేరాయి. కృష్ణా జిల్లాలోని మొవ్వ మండల జెఎసి ఆధ్వర్యంలో ఆదివారం యాజ్ఞీకులు స్ర్తి సూక్తం, పురుష సూక్తం, నవగ్రహ హోమాలను సమైక్యాంధ్ర మంత్రాలతో కలిపి శాస్త్రోక్తంగా నిర్వహించారు. సోనియా గాంధి, షిండే, చిదంబరం, కెసిఆర్‌ను రాక్షసులుగా చిత్రీకరిస్తూ హోమాలు చేశారు. కలిదిండిలో రాస్తారోకో నిర్వహించి సోనియా గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గ్యార్వీ షరీఫ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తిరువూరులో చిన్నారులు రోడ్డుపై కరాటే ఫీట్లు ప్రదర్శించి నిరసన తెలిపారు.
గుంటూరు జిల్లాలో...
గుంటూరు: గుంటూరులో ఆదివారం వివిధ సంఘాల ఆధ్వర్యాన రిలే దీక్షలు, మానవహారాలతో నిరసనలు తెలిపారు. తెనాలిలో మున్సిపల్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు 13వ రోజకు చేరాయి. నరసరావుపేటలో ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్యోగ జెఎసి ఆధ్వర్యంలో రిలే దీక్షలు 27వ రోజుకు చేరాయి. మంగళగిరిలో సమైక్యాంధ్రకు మద్దతుగా రజకులు నడిరోడ్డుపై బట్టలు ఉతికారు. అనంతరం అంబేద్కర్ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడ్డారు.
ఐఎసెట్ కౌనె్సలింగ్ బహిష్కరణకు నిర్ణయం
వైవియు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పరీక్షలు వాయిదా
ఆంధ్రభూమి బ్యూరో
కడప, సెప్టెంబర్ 8: కడప జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం మరింత ఉద్ధృతమవుతోంది. ఈ నెల 10వ తేదీన జరగాల్సిన ఐసెట్ కౌనె్సలింగ్‌ను బహిష్కరించాలని పాలిటెక్నిక్ ప్రిన్సిపాళ్లు, లెక్చరర్ల జెఎసిలు నిర్ణయించాయి. యోగివేమన యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పరీక్షలు మరోసారి వాయిదా వేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులంతా ఆదివారం జిల్లా కేంద్రానికి చేరుకుని భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా అనంతరం రిలేదీక్షలు ప్రారంభించారు. హైదరాబాద్‌లో త్వరలో సీమాంధ్ర న్యాయవాదుల సమైక్యసభ నిర్వహించనున్నట్లు న్యాయవాదుల జెఎసి నేతలు వెల్లడించారు. రాజధానిలో తెలంగాణ న్యాయవాదుల దాడికి నిరసనగా ప్రదర్శన నిర్వహించారు. కడప నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన పాత్రికేయులు కలెక్టరేట్ ఎదుట ఆమరణదీక్ష చేపట్టారు. జిల్లాలోని జమ్మలమడుగు, రాజంపేట, ప్రొద్దుటూరు, బద్వేల్, పులివెందుల ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. విభజన సెగలు జిల్లాలోని ఆర్టీపీపీ, యురేనియం ప్రాజెక్టులను వెంటాడుతున్నాయి. దీనితో ఉత్పత్తి గణనీయంగా పడిపోతోంది.