విజయవాడ, సెప్టెంబర్ 8: ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన తెలుగుజాతిని విడగొట్టే ప్రయత్నం చేసినా, అవమానించినా సహించేదిలేదని, అవసరమైతే ప్రాణాలర్పించడానికైనా వెనుకాడబోనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఉద్వేగంతో ప్రకటించారు. నాడు కెసిఆర్‌కు తాను మంత్రి పదవి ఇచ్చి ఉంటే రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టేదికాదేమోనని కూడా ఆయన అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవ బస్సుయాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలో మూడోరోజు ఆదివారం నూజివీడు, మైలవరం నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈసందర్భంగా జరిగిన సభల్లో తెలుగుజాతి సమైక్యత గురించి తొలిసారి బాబు ఉద్వేగంగా మాట్లాడారు. అయితే ప్రస్తుత ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలా, స్వస్తిపలకాలా అనే విషయమై ఆయన స్పష్టమైన ప్రకటన చేయలేదు. రాష్ట్ర విభజన సమస్యకు తొలుత 1999లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేతగా ఆజ్యం పోశారని విమర్శించారు. కేవలం తనను ఇరకాటంతో పెట్టేందుకే ఈ పని చేశారన్నారు. 2008లో నాటి పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర విభజనకు ఆమోదం తెలుపుతూ కేంద్రానికి తాను లేఖ ఇచ్చిన మాట వాస్తవమే అయినా అడ్డగోలుగా, ఇష్టానుసారం విభజించమని చెప్పలేదన్నారు. 2004 ఎన్నికల్లో సోనియాగాంధీ తెలంగాణలో టిఆర్‌ఎస్ కండువా కప్పుకొని ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అంగీకారం తెలిపారన్నారు. 2009లోనూ ఇదే విషయాన్ని ప్రకటించారని, అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో అత్యధిక గ్రామ పంచాయతీలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవటంతో సహించలేక తమను దెబ్బతీసేందుకే విభజన ప్రక్రియ చేపట్టారంటూ ఆయన నిప్పులు చెరిగారు. వ్యవసాయం దండగ అని తాను ఎన్నడూ అనలేదన్నారు. అయితే తనను అప్రతిష్ఠ పాల్జేసేందుకు వైఎస్ దుష్ప్రచారం చేశారని, తాను సభలో ఎన్నిసార్లు నిలదీసినా సమాధానం చెప్పలేక ఎదురుదాడికి దిగేవారని ఆయన గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీ తొమ్మిదేళ్ల పాలనలో సైబర్ సిటీని సృష్టించి ప్రపంచ పటంలో రాష్ట్రానికి గుర్తింపు తెచ్చానన్నారు. ఇపుడు వెలిగిపోతున్న సింగపూర్‌కు ఈ స్థాయి గుర్తింపు రావటానికి 50ఏళ్ల కాలం పట్టిందన్నారు. వైఎస్ పెద్దకొడుకు గాలి జనార్దనరెడ్డి, రెండో కొడుకు జగన్ వందల కోట్లు ప్రజాధనం మింగి జైలుపాలు కాగా విజయమ్మ పవిత్రమైన బైబిల్‌ను పట్టుకుని రోజుకోమాట, గంటకోమాటతో ప్రజలను మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు. మహాత్మాగాంధీ అంతటి నేత బైబిల్ వల్ల తాను ప్రభావితుడినయ్యానని చెప్పారని, అయితే వైఎస్ కుటుంబీకులు ఏమాత్రం ప్రభావితులయ్యారో అర్ధం కావటంలేదన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని, జగన్ ముఖ్యమంత్రి కావటమనే వారి తాపత్రయం కలగానే మిగిలిపోతుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కాగా, నూజివీడు శాసనసభ్యుడు చిన్నం రామకోటయ్య గతంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైనా ఆ నియోజకవర్గంలో బాబు యాత్రకు అడుగడుగునా అనూహ్యరీతిలో స్పందన లభించింది.
దిగవల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగిస్తున్న చంద్రబాబు