ఆత్మకూరు, సెప్టెంబర్ 8 : సోదర భావంతో మెలుగుతున్న తెలుగు ప్రజల మధ్య కాంగ్రెస్ పార్టీ వైషమ్యాలు రగిల్చిందని, కాంగ్రెస్ నేతల రాక్షసపాలనకు ఇది నిదర్శనమని దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల అన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణపై ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోవాలన్నారు. రాష్ట్ర విభజనకు కేంద్రం స్వస్తి పలకాలని, విభజన అనివార్యమైతే ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నారు. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా విభజిస్తే జనం చూస్తూ ఉరుకోరని ఆమె దుయ్యబట్టారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం లలో ఆదివారం సమైక్య శంఖారావం బస్సు యాత్ర కార్యక్రమంలో వైఎస్ షర్మిల మాట్లాడారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజన చేసి సీమాంధ్ర ప్రాంతాన్ని ఎడారిగా మార్చేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తూ యాత్రలు నిర్వహించడం ఎంతవరకు సమంజమని ఆమె ప్రశ్నించారు. కేంద్రాన్ని చొక్కా పట్టుకుని నిలదీయాల్సిన చంద్రబాబునాయుడు సీమాంధ్రవాసులను కలుసుకునేందుకు కపటయాత్రను సాగిస్తున్నారని దుయ్యబట్టారు. విభజన జరగకుండానే తెలంగాణా వేర్పాటు నాయకులు సీమాంధ్ర ప్రజలపై దాడులు చేయడం గర్హనీయమన్నారు. విభజన జరిగితే ఎగువ ప్రాంతాలనుంచి వచ్చే నీళ్లు ఆగిపోయి సాగునీటికి, తాగునీటికి సీమాంధ్రప్రజలు అవస్థలు పడాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర విభజన ప్రకటన అంశం తెరమీదుకు రాగానే వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలు, ఎంపిలు తమ పదవులకు రాజీనామాలు చేశారని, ఇతర పార్టీల నాయకులు పదవులు పట్టుకు వేళాడుతున్నారని దుమ్మెత్తి పోశారు.
సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎంపిలు, ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేసి ఉద్యమంలో పాలు పంచుకోవడం లేదో తనకు అర్ధం కావడంలేదని, ప్రజలు ఎన్నుకున్న వీరు ప్రజల నిరసనలకు ఎందుకు మద్దతు తెలపడం లేదని ప్రశ్నించారు. తన తండ్రి వైఎస్ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాల ఫలాలు అట్టడుగువర్గాల వారికి సైతం అందాయన్నారు. ఖరీదైన వైద్యం సైతం పేదలకు అందేలా ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి వారి గుండెల్లో వైఎస్ గూడుకట్టుకున్నారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వల్ల ఎన్నో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేరిగ మురళీ, కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు నలపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల వైకాపా మండలాధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు, వైయస్‌ఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అనంతర బస్సు యాత్ర బుచ్చిరెడ్డిపాళెం, కొడవలూరు ప్రాంతాల్లో జరిగింది.
.................
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ప్రసంగిస్తున్న వైఎస్ షర్మిల
వచ్చేది రాజన్న రాజ్యమే : సమైక్య శంఖారావంలో షర్మిల
english title:
c
Date:
Monday, September 9, 2013