కర్నూలు, సెప్టెంబర్ 11 : జిల్లాలో సమైక్య ఉద్యమం నిర్విరామంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. కర్నూలులో ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఆందోళనలతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. జాతీయ రహదారిపై, బళ్లారి నాలుగు రోడ్ల కూడళిలో ప్రజలు చేపట్టిన మానవహారంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలోని నీటి పారుదల శాఖ కార్యాలయం నుంచి ఉద్యోగులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వివేకానంద సర్కిల్, కలెక్టరేట్, విశే్వశ్వరయ్య విగ్రహం మీదుగా తిరిగి తమ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. కలెక్టరేట్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం ముందు కొద్ది సేపు ధర్నా నిర్వహించారు. జిల్లా ఖజానా కార్యాలయ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు నగరంలోని పలు రహదారుల మీదుగా సమైక్య ర్యాలీ నిర్వహించారు. ఇంటర్ విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు విభజనకు కారకులైన కాంగ్రెస్ నేతలకు పిండ ప్రదానం చేశారు. మరోవైపు ఒక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ అనంతరం కలెక్టరేట్ వద్ద రాష్ట్రాన్ని విశ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఉరి వేస్తామంటూ హెచ్చరిస్తూ నిరసన తెలిపారు. అలాగే దంత వైద్యులు, నీటి పారుదల శాఖ ఉద్యోగులు రిలే దీక్షలు ప్రారంభించారు. ఉద్యోగ, ఉపాధి, ఉపాధ్యాయ సంఘం, న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వీరి దీక్షలకు పలువురు సంఘీభావం తెలిపారు. పలు ప్రైవేటు కళాశాలల విద్యార్థులు ఆందోళనల్లో భాగస్వాములయ్యారు. జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, బనగానపల్లె, ఆళ్లగడ్డ, శ్రీశైలం నియోజకవర్గాల్లో సమైక్యాందోళనలు తీవ్రతరం చేశారు. ఇక జెఎసి నాయకులు ప్రైవేటు విద్యా సంస్థలను సైతం మూసి సినిమా హాళ్లు, ప్రైవేటు వాహనాలను విస్మరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాటిని కూడా ఉద్యమంలోకి తీసుకురావాలన్న డిమాండు చేస్తున్నారు.
నేటి నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె
జిల్లాలోని శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో పని చేస్తున్న జెన్‌కో ఉద్యోగులతో పాటు జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్‌కో ఉద్యోగులు గురువారం నుంచి సమ్మె బాట పడుతున్నారు. వీరు ఇప్పటికే తమ యూనియన్ల ఆధ్వర్యంలో సమ్మె నోటీసులు ఇవ్వగా తాజాగా బుధవారం తమకు ప్రభుత్వం ఇచ్చిన సెల్‌ఫోన్ సిం కార్డులను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. జెన్‌కో ఉద్యోగుల సమ్మెతో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని, దీని ప్రభావం ప్రధానంగా పారిశ్రామిక, వ్యవసాయ రంగాలపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ట్రాన్స్‌కో ఉద్యోగుల సమ్మెతో సామాన్యులపై పెను ప్రభావం చూపనుంది. విద్యుత్ సరఫరాకు తాము ఎలాంటి ఆటంకం కల్పించబోమని అనుకోని అవాంతరాల రీత్యా సరఫరాలో ఇబ్బందులు తలెత్తితే తాము మరమ్మతు చేయబోమని వెల్లడించారు.
నేడు మహిళా గర్జన
కర్నూలులో నేడు మహిళా గర్జన నిర్వహిస్తున్నట్లు ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యం బుధవారం ప్రకటించింది. సుమారు 50వేల మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ముందుగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి తెలుగు తల్లి విగ్రహం వద్ద మహిళా గర్జన నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమమే తమకు స్ఫూర్తినిచ్చిందని స్పష్టం చేశారు.
రాయల తెలంగాణ అంటే గొంతులు కోస్తాం
* టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి
కల్లూరు, సెప్టెంబర్ 11 : రాష్ట్రం ముక్కలు కాకముందే ముక్కలు చేస్తూ రాయల తెలంగాణ అంటున్న వాళ్ల గొంతులు కోస్తామని టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. బుధవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడిపై ఆరోపణలు చేస్తున్నారని లేఖ సారాంశం తెలియకుండా మాట్లాడే వారు మూర్కులన్నారు. బాబు ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకుంటే విభజనకు సోనియా వెనకడుగు వేస్తుందా? అని ప్రశ్నించారు. తెలుగు మాట్లాడే వారంతా సమైక్య రాష్ట్రం కోసం పాటుపడాలన్నారు. రాష్ట్రంలో ఉనికిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందన్నారు. తెలంగాణలో కెసిఆర్, సీమాంధ్రలో వైకాపాతో సంబంధాలు పెట్టుకుని టిడిపిని దెబ్బ తీయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్రలో బాబు చేపట్టిన ఆత్మగౌరవ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఇది చూసి ఓర్వలేకే కుట్రలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు కలిసి కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడినా టిడిపి ప్రజల నుండి దూరం చేయలేరన్నారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ మంత్రులు, ప్రజా ప్రతినిధులు పదవులకు రాజీనామాలు చేసి ప్రజలు స్వచ్ఛందంగా చేపట్టిన ఉద్యమంలో పాల్గొంటేనే కేంద్రం దిగివస్తుందని సూచించారు. ప్రజలను కష్టాలకు గురి చేస్తున్న కాంగ్రెస్‌కు ఇవి చివరి రోజులన్నారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు అకెపోగు ప్రభాకర్, పర్వేజ్, తిరుపాల్ బాబు హనుమంతరాయచౌదరి, పోతురాజు రవి, అల్లాబకాష్ తదితరులు పాల్గొన్నారు.
నందికొట్కూరులో...
నందికొట్కూరు : యుపిఎ ప్రభుత్వం తీసుకున్న తెలంగాణ ప్రకటన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ ఉద్యమాలు ఆగవని, ఇందుకోసం అన్ని వర్గాల ప్రజలు సమిష్టిగా ఉద్యమించాలని జెఎసి చైర్మన్ రాజశేఖరరెడ్డి, కో చైర్మన్ రవికుమార్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా బుధవారం ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్‌టిసి, కార్మిక సంఘాలు, వివిధ ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు పటేల్ సెంటర్‌లో నల్లబ్యాడ్జీలు ధరించి రోడ్డుపై వెనకకు నడుస్తూ సమైక్య నినాదాలు చేశారు. జెఎసి దీక్షలు చేస్తున్న ఆర్‌టిసి కార్మికులు, ఆవాజ్ కమిటీ నాయకులకు మద్దతు తెలిపారు. జెఎసి చైర్మన్ రాజశేఖరరెడ్డి పటేల్ విగ్రహానికి పూలమాల వేసి, సమైక్యాంధ్ర సాధనే ధ్యేయంగా ప్రకటించాడు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు సత్యనారాయణ, రాముడు, కృష్ణారెడ్డి, రాబర్ట్, వైడిఅర్.స్వామి, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. అలాగే వైకాపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో పగిడ్యాల మండల వైకాపా నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ మాండ్ర శివానందరెడ్డి, నరసింహారెడ్డి, కోకిల రమణారెడ్డి, రవీంద్రారెడ్డి, ధర్మారెడ్డి, బండి జయరాజు, తదితరులు పాల్గొన్నారు.
నీటిని వృథా కాకుండా వాడుకోవాలి
* కలెక్టర్ సుదర్శన్ రెడ్డి
కర్నూలు టౌన్. సెప్టెబర్ 11 : హంద్రీనీవా ద్వారా ప్రవహిస్తున్న నీటిని వృథా చేయకుండా చెరువును నింపుకుని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుదర్శన్ రెడ్డి గ్రామస్థులకు సూచించారు. కల్లూరు మండల పరిధిలోని తడకనపల్లి గ్రామాంలోని చెరువుకు హంద్రీ నీవా నుండి మోటర్ల ద్వారా నీటిని నింపే కార్యక్రమాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి కోసం చెరువుకు నీటిని నింపుకునేందుకు అవకాశం ఇచ్చామన్నారు. కనుక ఆ నీటిని వృథా చేయకుండా తడకనపల్లి, వామసముద్రం, ఓబులాపురం, ఓబులాపురం తాడా గ్రామాల ప్రజలు వాడుకోవాలన్నారు. ఇంతవరకు వర్షాలు లేక పోవడంతోప్రజలు తాగు నీటికోసం అనేక సమస్యలు ఎదుర్కొన్నారన్నారు. వాటిని దృష్టిలో ఉంచుకుని నీటిని వాడుకోవాలన్నారు. సకాలంలో వర్షాలు కురవడంతో చెరువులు, హంద్రీనదికి నీరు పుష్కలంగా చేరిందన్నారు. చెరువు నిండేవరకు మోటార్లు పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని రైతులు కలెక్టర్‌ను కోరారు. ఇందుకు ఆయన స్పందిస్తు హంద్రీనీవాలో నీరు ఉన్నంత వరకు చెరువుకు నీరు నింపుకోవచ్చని హామీ ఇచ్చారు. అలాగే భారీ వాహనాలు తారు కరగడంతో రోడ్డు పూర్తిగా పాడై పోతోందని, ఇనుప ఖనిజం, కంకర, ఇసుక తరలించేందుకు బారీ వాహనాలు ఎక్కువగా తిరుగుతున్నాయని, వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కలెక్టర్‌కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెసి కన్నబాబు, తహాశీల్దారు శివరాముడు, విఆర్‌ఓలు, తలారులు, రైతులు పాల్గొన్నారు.
అల్లర్లు...గొడవలపై ఉక్కుపాదం
* స్పెషల్ పార్టీ పోలీసులకు శిక్షణ
* చవితి ఉత్సవాలపై ఎస్పీ దృష్టి
కర్నూలు, సెప్టెంబర్ 11 : వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఏ చిన్నపాటి గొడవలు కూడా జరగకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆందోళనలు, గొడవలు జరిగే సమయంలో సిబ్బంది ఏవిధంగా సమర్థవంతంగా తిప్పి కొట్టాలో అనే అంశాలను స్పెషల్ పార్టీ పోలీసు సిబ్బందికి అనుభవం ఉన్న పోలీసు అధికారులతో జగన్నాథ గట్టు వద్ద ఉన్న పోలీసు ఫైరింగ్ రేంజ్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ఎస్పీ కె.రఘురామిరెడ్డి బుధవారం తెలిపారు. ఏదైనా గొడవ, హింసాత్మక సంఘటన చోటు చేసుకుంటే సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తామన్నారు. వజ్రవాహనంపై నుండే అకతాయిలు, అల్లరిమూకలను నియంత్రించే విషయంలో సిబ్బంది ఏవిధంగా ఉండాలి, టియర్ గ్యాస్ ఏవిధంగా ప్రయోగించాలి, ఫైరింగ్ చేయాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. వజ్రా వాహనంలో కెమెరాతోపాటు కమ్యూనికేషన్ సిస్టం, అద్దాలకు ఐరన్ మెష్ ఉండి సిబ్బందికి అంతర్గత రక్షణకు ఉపయోగపడుతుందన్నారు. ఈ వాహనంలో బాష్పవాయువుసెల్, అత్యవసర కాంతిభార్ వెనుక బహుళ ట్యూబ్ ష్పెల్స్ వంటి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉండటంతోపాటు 14 మంది సాయుధ పోలీసు సిబ్బందితో కమాండర్ సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. అవసరమైనప్పుడు ఈ వాహనం చిన్న చిన్న సందుల్లో, రద్దీ ప్రదేశాల్లోకి కూడా చొచ్చుకుపోయేందుకు ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న శాంతియుత వాతావారణాన్ని భవిష్యత్తులో కూడా ఇదేవిధంగా కొనసాగించేందుకు ప్రజలు, మేథావులు, అన్ని రాజకీయ పార్టీలు, మత పెద్దలు, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు, మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఓర్వకల్లు పొదుపు మహిళలు ఆదర్శం
* ప్రపంచ బ్యాంకు అధికారుల ప్రసంశ
ఓర్వకల్లు, సెప్టెంబర్ 11 : పేదరికంలో మగ్గుతున్న కుటుంబాల్లో ఒక్కొక్క రూపాయను పొదుపు చేసి గ్రూపులుగా ఏర్పడి స్వయం సంవృద్ధి సాధించిన ఓర్వకల్లు పొదుపు మహిళలు ప్రపంచ దేశాలకు ఆదర్శ ప్రాయులని ప్రపంచ బ్యాంకు అధికారి అఖిలేష్ గుప్తా ప్రశంసించారు. బుధవారం ఓర్వకల్లులోని స్మెల్క్ కేంద్రాన్ని ఇండోనేషియా అధికారుల బృందం సందర్శించింది. అతిథులకు ఎంఎంఎస్ గౌరవ సలహదారులు విజయభారతి ఓర్వకల్లు పొదుపు ఉద్యమ విజయగాథను వివరించారు. మండలంలో 10వేల మంది మహిళలు 900 పొదుపు సంఘాలుగా ఏర్పడి పొదుపు ఉద్యమంలో పాల్గొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ఎంఎంఎస్ 76కోట్ల టర్నోవర్ సాధించిందన్నారు. మండల సమైక్య అధ్వర్యంలో నిర్వహిస్తున్న జలజీవని, జీవనరేఖ, పాలవేల్లి, భూమి కొనుగోలు, జీవనజ్యోతి పథకాల ద్వారా వివిధ గ్రామాలకు చెందిన పొదుపు మహిళలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు మండల పరిధిలోని నన్నూరు, ఉయ్యలవాడ, లొద్దిపల్లె గ్రామాల్లో ఇండోనేషియా బృందం పర్యటించి అయా గ్రామాల్లో పొదుపు మహిళలు ఉద్యమంలో చేరిన తర్వాత సాధించిన అభివృద్ధిని పరిశీలించారు. ఉయ్యలవాడలో పొదుపు మహిళలు అనుసరిస్తున్న సేంద్రీయా వ్యవసాయ పద్ధతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచబ్యాంకు అధికారులు జాకీపొమరాయ్, సెంటాన్ సూర్యసత్రియండి, జార్జిపోరాయా, సిద్దిక్ పరమాణా, అనురోషిక్ హద్రి, సెల్క్ ఫ్యాకల్టీ మెంబర్లు రాజశేఖర్, రమణ, ప్రకాష్, మహేష్, ఎంఎంఎస్ అధ్యక్షురాలు సావిత్రమ్మ, వివిధ గ్రామాల పొదుపు మహిళలు పాల్గొన్నారు.
పొంగుతున్న వాగులు, వంకలు
సంజామల, సెప్టెంబరు 11 : నాలుగు రోజులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మండల పరిధిలోని పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాగు పరివాహక గ్రామాలైన వసంతాపురం, కమలపురి, ముచ్చలపురి గ్రామాల సమీపంలో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందుల పడుతున్నారు. అంతేగాకుండా 1500 ఎకరాల్లో వరి పంటలు నీటి మునిగాయి. మండల పరిధిలోని వసంతాపురం, కమలపురి, ముదిగేడు, బొందలదినె్న, ముక్కమల్ల, ఎగ్గోని, సంజామల గ్రామాల్లో పంట నష్టం జరిగింది. పంట నీట మునిగి పెట్టిన పెట్టుబడులు, చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోయారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
పొంగిన కుందరవాగు
ఉయ్యాలవాడ : మండలంలో మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పెద్దయమ్మనూరు, ఇంజేడు కుందరవాగు వంతెనలపై నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో బుధవారం రాకపోకలు స్తంభించిపోయాయి. దీని వల్ల ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలాగే ఇంజేడు కుందరవాగు వంతెనపై మోకాళిలోతు నీరు ప్రవహిస్తోంది. దీంతో మండల కేంద్రానికి రాకపోకలు 4 రోజుల నుండి పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రధాన రహదారి అయిన ఇంజేడు కుందరవాగుపై నూతన వంతెనను ఏర్పాటు చేస్తే ప్రయాణికుల కష్టాలు తీరుతాయని అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.
లారీ ఢీకొని వ్యక్తి మృతి
కోవెలకుంట్ల, సెప్టెంబర్ 11 : పట్టణంలోని ఎంపిడివో కార్యాలయం సమీపంలో లారీ ఢీ కొనడంతో బుధవారం పట్టణానికి చెందిన నల్లగట్ల పుల్లయ్య(45) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని స్వామినగర్‌కు చెందిన నల్లగట్ల పుల్లయ్య టీ తాగేందుకు హోటల్‌కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఎంపిడివో కార్యాలయం వద్ద మద్రాసు నుండి వస్తున్న లోడు లారీ ఢీకొనడంతో తల లారీ టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్ను ఎస్సై సుబ్బరాయుడు లారీ డ్రైవర్ దేవయ్యను అదుపులోకి తీసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
వ్యక్తి ఆత్మహత్య
శిరివెళ్ల, సెప్టెంబర్ 11: స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలోని చెన్నూరు గ్రామానికి చెందిన గోశ ఏసయ్య (50) పురుగుమందు తాగి మృతిచెందినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. గత కొన్ని సంవత్సరాల పక్షవాతం రావడంతో కాళ్లు చేతులు పడిపోగా జీవితంపై విరక్తిచెంది పురుగుమందు సేవించగా గ్రామస్థులు నంద్యాల ప్రభుత్వ అసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతిచెందినట్లు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
దొంగ అరెస్టు.. నగదు స్వాధీనం
బనగానపల్లె, సెప్టెంబర్ 11 : పట్టణానికి చెందిన అతార్ అఖిల్ హుస్సేన్ అనే దొంగను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై బిఎ మంజూనాథ్ బుధవారం తెలిపారు. అతని వద్ద నుండి రూ.7500 నగదు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. సదరు దొంగ నేషనల్ మెడికల్ స్టోర్, ఖాజీవాడలో కిరాణాషాపు, ఎస్‌ఎస్‌ఎం కిరాణాషాపు, రాఘవేంద్ర మెడికల్ స్టోర్ తదితర చోట్ల చోరీకి పాల్పడినట్లుని ఎస్సై తెలిపారు.
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
శిరివెళ్ల, సెప్టెంబర్ 11: మండలంలోని జీనెపల్లె మజీరా పార్వతీపురం వద్ద బుధవారం సుమారు రూ. 8 లక్షలు విలువచేసే 92 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు లారీలో తరలిస్తుండగా పార్వతీపురం వద్ద లారీ అగిపోయింది. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వెళ్లి దుంగలను స్వాధీనం చేసుకోని పోలీస్‌స్టేషన్‌లో ఉంచామన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.